Manchu Manoj: టీడీపీలోకి మంచు మనోజ్ దంపతులు..? ఏంటి సంగతి..?

దివంగత నేత భూమా నాగిరెడ్డి ఇంటి అల్లుడు కావడం కలిసొస్తుందనే అంచనాతో మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. భూమా ఫ్యామిలీకి టీడీపీ అధినేత చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ టీడీపీలో చేరి పోటీ చేసే అవకాశం ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 4, 2023 | 02:00 PMLast Updated on: Aug 04, 2023 | 2:00 PM

Manchu Manoj Couple Meets Chandrababu Naidu Are They Joining Tdp

Manchu Manoj: మంచు మనోజ్ పొలిటికల్ అరంగేట్రం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. రాయలసీమ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులున్న దివంగత నేత భూమా నాగిరెడ్డి ఇంటి అల్లుడు కావడం కలిసొస్తుందనే అంచనాతో మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. భూమా ఫ్యామిలీకి టీడీపీ అధినేత చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ టీడీపీలో చేరి పోటీ చేసే అవకాశం ఉంది.
ఈ ఏడాది మార్చి 3న భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. భూమా మౌనికా రెడ్డి అక్క భూమా అఖిలప్రియ.. టీడీపీ ప్రభుత్వంలో గతంలో మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తరువాత కూడా ఆమె టీడీపీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అక్క అఖిల బాటలోనే తాను కూడా టీడీపీవైపే ఉంటాననే సిగ్నల్స్ ఇచ్చేలా భూమా మౌనిక రెడ్డి అడుగులు వేశారు. ఈక్రమంలోనే జులై 31,సోమవారం సాయంత్రం తన భర్త మంచు మనోజ్‌తో కలిసి హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అప్పటి నుంచే మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ మొదలైంది.
ఆళ్లగడ్డ లేదా నంద్యాల బరిలో భూమా మౌనిక..?
భూమా అఖిలపై ఆళ్లగడ్డలో అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో పాటు టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డితో ఆమెకు ఉన్న విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో భూమా మౌనికా రెడ్డిని అక్కడి నుంచి చంద్రబాబు బరిలోకి దింపుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. మౌనిక రెడ్డిని ఏవీ సుబ్బారెడ్డి కూడా ఆమోదిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆళ్లగడ్డ సీటును ఒకవేళ భూమా అఖిలప్రియకే కేటాయిస్తే.. మౌనికా రెడ్డి నంద్యాల నుంచి పోటీ చేయిస్తారని చెబుతున్నారు. గతంలో ఇలాగే మౌనిక తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2014లోనూ ఈ రెండు సీట్ల నుంచే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నాగిరెడ్డి కన్నుమూశాక ఆయన అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచారు.
చంద్రగిరిపై మంచు మనోజ్‌ ఫోకస్ అందుకే..?
మంచు మనోజ్‌ కుటుంబానికి చెందిన శ్రీవిద్యానికేతన్‌ విద్యా సంస్థలు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రంగంపేటలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూమా మౌనికను చంద్రగిరి నుంచి పోటీ చేయించడానికి మనోజ్‌ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని కూడా అంటున్నారు. ప్రస్తుతం చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు మోహిత్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ ఇంచార్జిగా పులివర్తి నాని ఉన్నారు. అయితే పులివర్తి నాని కంటే భూమా మౌనికనే గట్టి పోటీ ఇవ్వగలరని టీడీపీ అధినాయకత్వం భావిస్తోందనే టాక్ కూడా వినిపిస్తోంది. మోహన్‌ బాబు కోడలుగా, భూమా నాగిరెడ్డి కూతురుగా మౌనికకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేరు, చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న తమ విద్యా సంస్థల ఉనికికి కూడా కలిసొస్తుందని మనోజ్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ ప్రచార విభాగం చైర్మన్‌ పదవి..
మంచు మనోజ్‌‌ను టీడీపీ ప్రచార విభాగం చైర్మన్‌ పదవిలో నియమిస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ స్టార్‌ క్యాంపెయినర్‌‌గా మంచు మనోజ్‌‌ను ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని చెబుతున్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీతో పోలిస్తే టీడీపీలో పెద్దగా సినిమా యాక్టర్స్ లేరు. వైసీపీలో అలీ, పోసాని కృష్ణమురళి, జోగి నాయుడు, విజయచందర్‌ తదితరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే సినీ నటుల అవసరం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్‌‌కు టీడీపీ ప్రచార విభాగం చైర్మన్‌ పదవిని ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.