Manipur: పచ్చి అబద్ధం చెప్పిన మణిపూర్‌ సీఎం.. ఇలా కూడా ఉంటారా అసలు..!

వీడియో సర్క్యూలేట్ అయిన తర్వాత స్పందించిన బీరెన్‌ సింగ్..ఈ కేసును పోలీసులు సుమోటోగా తీసుకున్నారని.. నిందితులను అరెస్ట్ చేశారని చెప్పారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తర్వాత తేలింది. అది ఏ ఫ్యాక్ట్ చెక్‌ వెబ్‌సైటో చెప్పిన విషయం కాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 21, 2023 | 12:07 PMLast Updated on: Jul 21, 2023 | 12:54 PM

Manipur Violence Cm Biren Singh Made False Statement Over Viral Video

Manipur: సీఎం పొజిషన్‌లో ఉంటూ పచ్చి అబద్ధం చెబుతారా..? జనాలు అంత పిచ్చివాళ్లా..? ఏం చెప్పినా నమ్మేస్తారనుకుంటున్నారా..?
మణిపూర్‌లో జరిగిన ఘోరం యావత్ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ముగ్గురు మహిళలను వివస్త్రలు చేసి ఊరేగించి, అందులో ఓ యువతిని సాముహికంగా అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా ప్రవర్తించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజానికి ఈ ఘటన మే 4న జరగగా..దానికి సంబంధించిన వీడియో రెండు రోజుల క్రితం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఈ ఘటనను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకోవడం, సుమోటో కేసుగా స్వీకరించడం, ప్రధాని మోదీ స్పందించడం, వీడియోలను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించడం చకచకా జరిగిపోయాయి. అయితే వీడియో బయటకు వచ్చిన తర్వాత మణిపూర్‌ సీఎం బీరెన్ సింగ్ చెప్పిన అబద్ధంపై ప్రజలు భగ్గుమంటున్నారు.
బీరెన్‌ సింగ్ ఏం చెప్పారు?
వీడియో సర్క్యూలేట్ అయిన తర్వాత స్పందించిన బీరెన్‌ సింగ్..ఈ కేసును పోలీసులు సుమోటోగా తీసుకున్నారని.. నిందితులను అరెస్ట్ చేశారని చెప్పారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తర్వాత తేలింది. అది ఏ ఫ్యాక్ట్ చెక్‌ వెబ్‌సైటో చెప్పిన విషయం కాదు. ఆ రాష్ట్ర పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్‌ ప్రకారమే అది అబద్ధం. మే 4న జరిగిన ఈ ఘటన పోలీసులకు ముందుగానే తెలుసు. మే18న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. జూన్ 21న ఈ కేసుపై తొలి FIR నమోదైంది. అయితే ఈ కేసును వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. నిందితులు ఎవరో తెలిసినా కూడా అరెస్ట్ చేయలేదు. వీడియో బయటకు వస్తే కాని కాళ్లు కదలలేదు. సీఎం మాత్రం సుమోటో అంటూ సుత్తి చెప్పారు. వీడియో బయటకురాగానే అరెస్ట్‌ అయిన నిందితుడు.. బాధితులు, పోలీసులను ఆశ్రయించనిప్పుడో, FIRనమోదైన రోజో ఎందుకు అరెస్ట్ కాలేదు..?
ప్రజలకు ఏం చెప్పినా నమ్మేస్తారులే అని సీఎం అనుకుంటే ఎలా..? ప్రతి విషయాన్ని జనాలు గుడ్డిగా నమ్మరు. ఘటన జరిగి మూడు నెలలకు దగ్గర పడుతున్నా.. ఇప్పటివరకు యాక్షన్‌ తీసుకోకపోవడం.. వీడియో బయటకు వస్తే కానీ చర్యలకు దిగకపోవడం మణిపూర్‌ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు. అంటే ప్రజలు చూస్తేనే తప్పు.. లేకపోతే ఏం జరిగినా పర్లేదా..? ఓ సీఎంకు ఉండాల్సిన బాధ్యతలు ఇవేనా..? ముగ్గురు మహిళల పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన వాళ్లని ఇన్నాళ్లు ఎందుకు అరెస్ట్ చేయలేదు..? FIR నమోదు చేయడానికి పోలీసులకు 33 రోజుల సమయం ఎందుకు పట్టింది..? జరిగే ప్రతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసమే చూస్తే ఎలా..? ఇలాంటి విషయాల్లోనైనా మనుషులమన్న విషయం.. ఓ తల్లికి పుట్టామన్న బుద్ధి ఉండాలి కదా..? అబ్బే మాకు అవేం ఉండవు.. అధికారమే ముఖ్యం అనుకుంటే ఏదో ఒక రోజు ప్రజలే తరిమికొడతారు. ఆ రోజు కోసం ఎదురుచూడడం తప్ప ఇప్పుడు చేయగలగిందైతే ఏమీలేదు..!