Manipur Violence: మణిపూర్ హింస.. తగలబడుతున్న రాష్ట్రం.. బాధ్యులెవరు? అసలేం జరుగుతోంది..?

మెయితీలకు ఎస్టీ హోదా కల్పించడాన్ని అక్కడి గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే మణిపూర్‌లో మెయితీల ఆధిపత్యం ఎక్కువ. ఇప్పుడు వాళ్లకు ఎస్టీ హోదా కూడా కల్పిస్తే మరింతగా వారి ఆధిపత్యం పెరిగిపోతుంది. అందుకే గిరిజనులు హైకోర్టు ఆదేశాల్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 5, 2023 | 06:49 PMLast Updated on: May 05, 2023 | 6:50 PM

Manipur Violence Who Is Responsible What Is Going On

Manipur Violence: అందమైన, ప్రశాంత రాష్ట్రంగా పేరున్న మణిపూర్ ఇప్పుడు ఆందోళనలతో అట్టుడుకుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా హింసతో రగులుతోంది. రెండు రోజుల క్రితం మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పరస్పర దాడులు, ఆస్తుల ధ్వంసం, దహనం వంటి చర్యలతో పరిస్థితి చేయిదాటింది. ఈ నేపథ్యంలో అక్కడ గవర్నర్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా జారీ చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ మణిపూర్ ఆందోళనల వెనుక ఉన్న అసలు కారణమేంటి? దీనికి బాధ్యులెవరు?

మణిపూర్‌‌లో మెయితీ తెగ జనాభా ఎక్కువ. వీరు రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్నారు. ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో వీళ్లు ఉంటున్న భూభాగ పరిధి పది శాతం మాత్రమే. వీళ్లు ఎక్కువగా లోయ ప్రాంతంలో ఉంటారు. అయితే, వీళ్లకు గిరిజన హోదా లేదు. మరోవైపు ఇతర తెగలకు చెందిన గిరిజనులు పర్వత ప్రాంతాల్లో ఉంటారు. రాష్ట్రంలో మెయితీస్ తెగ ఎక్కువగా ఉన్నప్పటికీ స్థానిక గిరిజన చట్టాల ప్రకారం వీళ్లు అక్కడ భూములు కొనుగోలు చేసే అవకాశం లేదు. అందువల్ల తమకు కూడా గిరిజన హోదా కల్పించాలని.. అంటే ఎస్టీ జాబితాలో చేర్చాలని మెయితీ తెగ ప్రజలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీల్లో చేర్చితే, నిబంధనల ప్రకారం.. పర్వత ప్రాంతాల్లోనూ భూములు కొనుగోలు చేయవచ్చు. అందుకే చాలా కాలంగా మెయితీలు ఎస్టీ హోదా కోసం ఉద్యమాలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వాల్ని డిమాండ్ చేశారు. కోర్టుకు వెళ్లారు. దీనికి అనుకూలంగా మణిపూర్ ప్రభుత్వం తీర్మానం చేసింది. తాజాగా మణిపూర్ హైకోర్టు మెయితీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. మెయితీలు చేస్తున్న డిమాండ్ విషయంలో నాలుగు వారాల్లోగా కేంద్రానికి సిఫారసు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు సూచన చేసింది అంటే దీనికి కేంద్రం అంగీకరించే అవకాశాలున్నాయి. అంటే ఒక రకంగా మెయితీలకు ఎస్టీ హోదా కల్పించేందుకు మార్గం సుగమమైనట్లే. ఇదే ఇతర తెగలు.. అంటే ఎస్టీల ఆగ్రహానికి కారణమైంది.
వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాలు
మెయితీలకు ఎస్టీ హోదా కల్పించడాన్ని అక్కడి గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే మణిపూర్‌లో మెయితీల ఆధిపత్యం ఎక్కువ. ఇప్పుడు వాళ్లకు ఎస్టీ హోదా కూడా కల్పిస్తే మరింతగా వారి ఆధిపత్యం పెరిగిపోతుంది. అందుకే గిరిజనులు హైకోర్టు ఆదేశాల్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. గిరిజన తెగలైన నాగాలు, జోమీలు, కుకీల ఆధ్వర్యంలో చురాచాంద్‌పూర్ జిల్లాలోని టోర్బుంగ్ ఏరియాలో సంఘీభావ ర్యాలీ జరిగింది. అయితే, ఈ ర్యాలీ క్రమంగా హింసాత్మకంగా మారింది. మెయితీస్ తెగ వారిపై గిరిజనులు దాడులు చేశారు. ఇది ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ర్యాలీ ప్రాంతంలో మొదలైన హింస క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. అనేక చోట్ల మెయితీలు, గిరిజనుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది.

Manipur Violence
రంగంలోకి దిగిన ఆర్మీ.. కర్ఫ్యూ విధింపు
గంటల వ్యవధిలోనే గిరిజనుల ఆందోళన హింసాత్మకంగా మారింది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో అసోం రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగాయి. ఆందోళనల్ని అదుపు చేసేందుకు సైన్యం, పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించారు. పరిస్థితి మరింత అదుపుతప్పకుండా ఐదు రోజులపాటు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఆందోళన జరుగుతున్న ప్రాంతాల్లోని దాదాపు పదివేల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఘర్షణల్లో అనేక మందికి గాయాలయ్యాయి. పలు చర్చిలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పలు చోట్ల దోపడీలకు పాల్పడ్డారు. సైన్యం జరిపిన కాల్పుల్లో 11 మంది వరకు గాయపడ్డారు. కొంతమంది ఆందోళనకారులు ఏకే-47 గన్స్ పట్టుకుని కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
ఎమ్మెల్యేపై దాడి.. అమిత్ షా సమీక్ష
మణిపూర్‌లో పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందీ అంటే.. ఈ అంశంపై సీఎంతో భేటీ అయిన బీజేపీ ఎమ్మెల్యే వంగ్‌జాగిన్ వాల్టేపైనే నిరసనకారులు ఇంఫాల్‌లో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయడపడ్డ ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైతే కాల్పులు జరపొచ్చని ఆయన ఆదేశించారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ అంశంపై నిరంతరం సమీక్ష జరుపుతున్నారు. అలాగే రాష్ట్ర సీఎం ఎన్ బిరేన్ సింగ్ కూడా స్పందించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు.

Manipur Violence
అసలు కారణమేంటి? బాధ్యులెవరు?
గిరిజనుల వాదన ప్రకారం.. మెయితీలు బాగా అభివృద్ధి చెందారు. వారిని ఎస్టీ జాబితాలో చేరిస్తే తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత దెబ్బతింటాయని, మెయితీలు మరింతగా అభివృద్ధి చెందుతారని గిరిజనులు అంటున్నారు. అయితే, 40 శాతం ఉన్న గిరిజనులు రాష్ట్రంలో 90 శాతం భూమిని అనుభవిస్తున్నారని, ఇది సరికాదని మెయితీలు వాదిస్తున్నారు. అలాగే తమ భూమిని ప్రభుత్వం ఇతరులకు అప్పగించాలనుకుంటోందని కూడా గిరిజనులు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా తమకు వచ్చిన హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్వార్ధపూరిత చర్యల వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఘర్షణలకు బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలే కారణమని కాంగ్రెస్ విమర్శించింది. జాతుల మధ్య విభేదాలు సృష్టించడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించింది. ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించి వెంటనే శాంతిభద్రతల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన బాక్సర్, రాజ్యసభ ఎంపీ మేరీ కోమ్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. తన రాష్ట్రం తగలబడిపోతోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని రక్షించాలని మోదీని, అమిత్ షాను కోరారు. కాగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు భద్రతాదళాలు ప్రకటించాయి.