SLBCలాంటి ప్రమాదాలెన్నో.. ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు..
SLBC టన్నెల్ ప్రమాదం ఘటన.. తెలుగు రాష్ట్రాలనే కాదు.. దేశవ్యాప్తంగా కన్నీరు పెట్టిస్తోంది. 8మంది కార్మికులు ఆ సొరంగానికి బలయ్యారు. పది రోజులు దాటింది.. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయ్.

SLBC టన్నెల్ ప్రమాదం ఘటన.. తెలుగు రాష్ట్రాలనే కాదు.. దేశవ్యాప్తంగా కన్నీరు పెట్టిస్తోంది. 8మంది కార్మికులు ఆ సొరంగానికి బలయ్యారు. పది రోజులు దాటింది.. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయ్. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.. ఆచూకీ మాత్రం దొరకడం లేదు. అయినవాళ్ల శవాలైన చూస్తామా లేదా అని ఆర్తి నిండిన కళ్లతో.. అక్కడ కార్మికుల కుటుంబసభ్యుల ఎదురుచూపు.. ప్రతీ ఒక్కరి మనసులను మెలేస్తున్నాయ్. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం అంటే.. ఇంత భయంకరంగా ఉంటుందా.. ప్రాణాలుపణంగా పెట్టి పని చేయాలా.. ప్రాణాలు పోతే తప్ప భవిష్యత్ ప్రాణం పోసుకోదా.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఈ ప్రమాదం తర్వాత వినిపిస్తున్నాయ్. SLBC టన్నెల్ ప్రమాదమే కాదు.. ఇంతకుమించిన విషాదాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయ్. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం పనుల్లోనూ.. ఇలాంటి ప్రమాదం జరిగింది.
ఏడుగురు చనిపోయారు. ప్రాజెక్టు పదో ప్యాకేజీలో భాగంగా సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ దగ్గర మూడు గుట్టల మధ్య 92 మీటర్ల లోతు.. 56 మీటర్ల వెడల్పుతో సర్జ్ పూల్ తవ్వుతున్నారు. మిడ్ మానేరు నుంచి 3 కిలోమీటర్ల కాలువ.. 8 కిలోమీటర్ల సొరంగం నిర్మిస్తున్నారు. కార్మికులు సొరంగ మార్గంలోని పైభాగం డ్రిల్లింగ్ చేస్తుండగా.. పెద్ద బండరాయి పడింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు అక్కడిక్కడే చనిపోగా.. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక SLBC ఘటన.. దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రమాదాన్ని గుర్తుచేస్తోంది. రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు 55 కిలోమీటర్ల సొరంగం తవ్వాలి. సొరంగం తవ్వేప్పుడు.. ఊట నీళ్లు రావడం సహజం. ఆ నీళ్లను బయటకు పంపించడానికి ముగ్గురు కార్మికులు సొరంగం లోపలికి వెళ్లారు.
కాసేపటి తర్వాత మరో 12మంది వారి వెనకాలే బయల్దేరారు. టన్నెల్‌కు బుంగపడి… నీళ్లు వేగంగా దూసుకొచ్చాయ్. వెనకాల వెళ్లిన 12 మంది ప్రాణాలతో బయటపడినా.. ముందు వెళ్లిన ముగ్గురు చనిపోయారు. రెస్క్యూ సిబ్బంది రేయింబవళ్లు వెతికినా లాభం లేకుండా పోయింది. నీళ్లను బయటకు తోడిన తర్వాత.. దాదాపు నెల రోజులకు ముగ్గురు కార్మికుల అస్థి పంజరాలు బయటపడ్డాయ్. డీఎన్‌ఐ టెస్ట్ చేసి వాటిని కుటుంబాలకు అప్పగించిన పరిస్థితి. SLBC టన్నెల్‌లోనూ ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయ్. ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. పంప్ హౌస్ పనుల్లో భాగంగా వంద మీటర్ల లోతులో టన్నెల్ లైనింగ్, కేబుల్ కనెక్షన్లు, ఎర్తింగ్ పనులు చేస్తుండగా.. క్రేన్ కూలి కార్మికులపై పడింది.
ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు చనిపోయారు. ఏపీలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయ్. సుంకిశాల ప్రమాదం ఇప్పుడు గుర్తుచేసుకున్నా.. గుండెల్లో రైళ్లు పరిగెడతాయ్. సర్జ్ పూల్ నిర్మాణం జరుగుతుండగా.. రిటెయినింగ్ వాల్ కుప్పకూలింది. ప్రాజెక్టు దగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇక ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదానికి.. SLBC ఘటనకు చాలా పోలికలు ఉంటాయ్. 2023 నవంబర్‌లో ఉత్తరకాశీలోని సిల్క్వారా టన్నెల్ కుప్పకూలింది. ఇందులో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. దాదాపు 17రోజుల వాళ్లంతా నరకయాతన అనుభవించారు. చిన్న స్టీల్ పైపుల ద్వారా 17రోజులు కార్మికులకు ఆక్సిజన్, నీళ్లు, ఆహారం అందించారు. చివరకు ర్యాట్ హోల్ మైనింగ్ చేపట్టి.. మట్టి తొలగించి 41 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.