100 గంటలు @టన్నెల్ రంగంలోకి మార్కోస్ టీమ్ శవాలైన దొరుకుతాయా.?
నాలుగు రోజులు గడిచాయి....96 గంటలు పూర్తయ్యాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ మాత్రం దొరకలేదు. అసలు వాళ్లంతా ప్రాణాలతో బతికి ఉన్నారా ? లేదా ? అన్నది అంతుచిక్కడం లేదు.

నాలుగు రోజులు గడిచాయి….96 గంటలు పూర్తయ్యాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ మాత్రం దొరకలేదు. అసలు వాళ్లంతా ప్రాణాలతో బతికి ఉన్నారా ? లేదా ? అన్నది అంతుచిక్కడం లేదు. 8 మంది జాడ కనిపెట్టడంలో ర్యాట్ హోల్ మైనర్స్ విఫలకావడంతో…తాజాగా ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దిగింది.
సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, హైవేస్, ఎన్‌జీఆర్‌ఐ, జీఎస్‌ఐ, ఎల్‌అండ్‌టీ, ఐఐటీ మద్రాస్ బృందాలు సహాయక చర్యలు విఫలమయ్యాయి. గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టలేకపోయాయి. సైన్యం టీబీఎం మధ్య వరకు వెళ్లగలిగినా అక్కడ సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. బురద, నీరు, నిర్మాణ సామగ్రిని తొలగిస్తేనే తప్ప కార్మికుల ఆచూకీ గుర్తించడం కష్టమన్న అభిప్రాయానికి వచ్చారు. ర్యాట్ మైనింగ్ బృందం…కార్మికులు చిక్కుకున్న స్థలానికి వంద మీటర్ల దూరం వరకు వెళ్లింది. బురద, నీళ్లు ఉండటంతో జాడ కనిపెట్టలేకపోయారు. దీంతో క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించడంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న మార్కోస్ టీమ్ రంగంలోకి దిగింది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కోసం నాలుగు రోజుల నుంచి వెతుకుతున్న వారి జాడ దొరకట్లేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోకి ఎండో బోట్, ఫోబ్ వంటి ప్రత్యేక కెమెరాలు, స్కానింగ్ పరికరాలు పంపినప్పటికీ ప్రయోజనం చేకూరలేదు. దాంతో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను ఛేదించగలిగేది ఒక్క మార్కోస్ మాత్రమే. కార్గిల్‌తో పాటు కశ్మీర్ తదితర ప్రాంతాల్లో అసాధ్యమనుకున్న చోటు..ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఫలితాల సాధించడంలో మార్కోస్ కు మంచి చరిత్ర ఉంది. దీంతో సొరంగంలో ఆపరేషన్ మార్కోస్ చేపట్టింది. ఇందుకోసం నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలు చేపట్టే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగనుంది. ఈ సభ్యులనే మార్కోస్‌గా పిలుస్తారు. బీఆర్‌వోకు సైతం గుట్టలు, పర్వత ప్రాంతాల్లో సొరంగాలు నిర్మాణం, నిర్వహణ రికార్డు ఉంది. దీంతో మార్కోస్, బీఆర్‌వోలతో కలిపి 10 మంది నిపుణులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సొరంగంలోకి వెళ్తున్నారు. మార్కోస్‌తో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యం పంచుకోనుంది. ఆర్‌వో లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్‌సింగ్ నాయకత్వం వహిస్తున్నారు.
మనుషులు వెళ్లగలిగేంత వరకూ ర్యాట్ హోల్ మైనర్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్లి వచ్చాయి. లోపలి మట్టిని తొలగించినా సెగ్మెంట్లు దెబ్బతిన్న కారణంగా మళ్లీ కుప్పకూలే ప్రమాదం ఉందని ర్యాట్‌హోల్ మైనర్స్ బృందం వెల్లడించింది. సరిగ్గా 13.85 కిలోమీటర్ల పొడవున్న సొరంగం చివరి భాగంలో పైకప్పు కూలింది. అక్కడే 140 మీటర్ల పొడవున్న టన్నెల్ బోర్ మిషన్, కట్టర్ యంత్రాలు బురదలో కూరుకుపోయాయి. అందులోనే ఎనిమిది మంది గల్లంతయ్యారు. నీళ్లు తోడేసిన తర్వాత శిథిలమైన టీబీఎం ప్రతిబంధకమైంది. కన్వేయర్ బెల్టు సాయంతో ఎలాగోలా దాన్నీ దాటేసినా టీబీఎం మొదటి భాగానికి చివరి భాగానికి మధ్య ఐదారడుగులు ఎత్తులో నిలిచిన మట్టి, బురద, నీటి ఊట ప్రధాన ఆటంకాలుగా మారాయి. టీబీఎం ముఖద్వారానికి చేరుకోవాలంటే శిథిలాలను తొలగించి పూడుకపోయిన మట్టిని ఎత్తివేయాలి. సొరంగంలో బురదను, నిర్మాణ వ్యర్థాలను దాటి…టన్నెల్ బోరింగ్ మిషన్ కూలిన ప్రాంతానికి చేరుకోవడం ఒకెత్తు అయితే…చివరి భాగంలో 100 మీటర్ల మధ్య బురదలో అన్వేషించడం మరొక ఎత్తు. అందుకే ఎలాగైనా ఆ ప్రాంతంలో ప్రత్యేక బృందంతో గాలించాలని నిర్ణయానికి వచ్చారు.