Top story: ఆమెతో వేగలేను..టీడీపీలోకి వెళ్లి పోతున్నా వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా

మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది వైసీపీ పరిస్థితి. అసలే అధికారం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జగన్ కు...ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఊహించని ఝలక్ ఇస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2025 | 12:31 PMLast Updated on: Mar 21, 2025 | 12:40 PM

Marri Rajasekhar Resigns From Ysrcp And Mlc Post

మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది వైసీపీ పరిస్థితి. అసలే అధికారం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జగన్ కు…ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఊహించని ఝలక్ ఇస్తున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్…రాజీనామాకు కారణాలు ఏంటి ? మాజీ మంత్రి విడుదల రజిని వేధింపులే కారణమా ? లేదంటే వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ రాకుండా అడ్డుకుంటారనే అనుమానం ఉందా ? అందుకే పార్టీ మారాలనే…రాజీనామా చేశారా ?

వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్సీలు పార్టీకి రాం రాం చెప్పేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా మున్సిపల్ ఛైర్మన్లు, వైఎస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు…రాజీనామాల బాట పట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు…ఏకంగా నలుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. తాజాగా మర్రి రాజశేఖర్…ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ మోషేన్ రాజును కోరారు. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ తో ఆ సంఖ్య ఐదుకు చేరింది.

2004 అసెంబ్లీ ఎన్నికల్లో…మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి…ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసి పరాజయం చెందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం 2010లో వైసిపిలో చేరాడు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత ఉమ్మడి గుంటూరు జిల్లా వైసిపి జిల్లా అధ్యక్షులుగా పని చేశారు. 2018లో వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో కీలకంగా పనిచేశాడు. 2019 ఎన్నికలలో చిలకలూరి పేట నుంచి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అసెంబ్లీ టికెట్ రాకపోయినా…పార్టీని వీడలేదు. జగన్మోహన్ రెడ్డినే నమ్ముకున్నారు. అయితే ఎమ్మెల్సీ హామీతో సర్దుకుని పార్టీలో కొనసాగారు. 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. పదవీ కాలం మరో నాలుగు సంవత్సరాలు ఉండగానే రాజీనామా చేశారు.

మర్రి రాజశేఖర్ రాజీనామా చేసిన తర్వాత…వైసీపీ నేతలు వద్దని వారించారు. పార్టీలో కొనసాగాలని…మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పి చూశారు. నిర్ణయం తీసుకున్నానని…ఇక వెనక్కి తగ్గేది లేదని వైసీపీ నేతలకు చెప్పారు. ఇంతలా మర్రి రాజశేఖర్…మనసు నొచ్చుకోవడానికి కారణమేంటనే చర్చ మొదలైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ త్యాగం చేయడంతో…విడుదల రజిని పోటీ చేశారు. ఆ తర్వాత ఆమె మంత్రి పదవి కూడా చేపట్టారు. విడుదల రజిని ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మర్రి రాజశేఖర్ తో నిత్యం అంతర్గత వార్ నడిపారు. పార్టీకి తానే సర్వస్వం అనేలా నియోజకవర్గంలో వ్యవహరించడం…మర్రికి నచ్చలేదు. ఇదే విషయంపై పార్టీ అధిష్ఠానానికి చెప్పిన ఫలితం లేకుండా పోయింది. విడుదల రజినితో సర్దుకుపోవాలని చెప్పడంతో…మర్రి జీర్ణించుకోలేకపోయారు.

కొంతకాలం అవమానాలు సహించుకుంటూ వచ్చిన ఆయన…కూటమి అధికారంలోకి రావడంతో తన వ్యూహాం మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని భావిస్తున్న మర్రి రాజశేఖర్…తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరిపారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో…వెంటనే వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2029లో చిలకలూరి పేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. ఇదే విషయంపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు…టీడీపీ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా గుంటూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.