Pakistan: పాక్‌లో సైనిక పాలన..? ఆర్మీ అధికారులు ఏం చెప్పారంటే

ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి దాడులు చేసుకుంటున్నారు. దీంతో పాక్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. శాంతి భద్రతలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో సైనిక పాలన రాబోతుందంటూ ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై పాక్ ఆర్మీ అధికారులు స్పందించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 14, 2023 | 04:30 PMLast Updated on: May 14, 2023 | 4:30 PM

Martial Law In Pakistan Army Officials Said This

Pakistan: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టు, విడుదల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి దాడులు చేసుకుంటున్నారు. దీంతో పాక్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. శాంతి భద్రతలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో సైనిక పాలన రాబోతుందంటూ ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై పాక్ ఆర్మీ అధికారులు స్పందించారు.

ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు. పాకిస్తాన్‌లో సైనిక పాలనకు అవకాశం లేదని, ప్రజాస్వామ్య ప్రభుత్వమే పాలన సాగిస్తుందని అక్కడి ఆర్మీ స్పష్టం చేసింది. రాజీకీయ సంక్షోభం నేపథ్యంలో శాంతిభద్రతలు క్షీణించినప్పటికీ ఆర్మీ పాలనకు అవకాశం లేదని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునిర్ చెప్పారు. దేశంలోని ప్రజాస్వామ్యంపై, ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు. పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో గత నాలుగు రోజుల నుంచి అక్కడ తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పలు దాడుల్లో పది మందికిపైగా మరణించారు. మరోవైపు ఇస్లామాబాద్ సహా అనేక చోట్ల ఆర్మీ క్యాంపులపై కూడా కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.ఈ నేపథ్యంలో రావల్పిండితోపాటు అనేక చోట్ల సైనికులు భారీగా మోహరించారు. ప్రస్తుతం అక్కడ ఆర్మీనే శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఆర్మీనే అధికారం చేపట్టబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇందుకు అనుగుణంగా కొందరు రాజకీయ నేతలు, ఆర్మీ అధికారులు రాజీనామా చేసినట్లు కూడా వదంతులు వ్యాపిస్తున్నాయి. కానీ, వీటన్నింటినీ ఆర్మీ ఉన్నతాధికారులు ఖండించారు. తాము ప్రజాస్వామ్యంవైపే నిలబడతామని చెప్పారు. పాకిస్తాన్‌లో సైనిక పాలనేం కొత్త కాదు. గతంలో అనేక సార్లు దేశంలో సైనిక పాలన కొనసాగింది. 75 ఏళ్ల పాక్ స్వాతంత్ర పాలనలో చాలా ఏళ్లపాటు సైనిక పాలనే కొనసాగింది. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎప్పుడూ పూర్తిస్థాయిలో పాలించింది లేదు. రాజకీయ సంక్షోభం కారణంగా గడువు కంటే ముందే ప్రభుత్వాలు కూలిపోయేవి. రాజకీయ పార్టీల మధ్య అధికారం కోసం పోరు నడిచేది. దీంతో రెండు పక్షాలను కాదని.. చివరకు సైన్యం అధికారాన్ని చేజిక్కించుకునేది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా మరోసారి సైనిక పాలన రాబోతుందంటూ ప్రచారం మొదలు కావడంతో సైన్యం స్పందించాల్సి వచ్చింది.