Mekapati Chandra Sekhar Reddy: లోకేష్‌ను కలిసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. టీడీపీలోకి ఎంట్రీ ఖాయమైనట్టేనా..?
వైసీపీ నుంచి సస్పెండైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాజాగా నారా లోకేష్‌ను కలిశారు. అట్లూరులో నారా లోకేష్ చేస్తన్న యువగళం పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. లోకేష్‌తో కూర్చుని కాసేపు ముచ్చటించారు.
Mekapati Chandra Sekhar Reddy: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నుంచి సస్పెండైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాజాగా నారా లోకేష్‌ను కలిశారు. అట్లూరులో నారా లోకేష్ చేస్తన్న యువగళం పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. లోకేష్‌తో కూర్చుని కాసేపు ముచ్చటించారు.
తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ నెల 13న యువగళం యాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రవేశించబోతోంది. ఈ సందర్భంగానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లోకేష్‌ను కలిసినట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో మంచి పట్టు ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొంత కాలం నుంచి వైసీపీ మీద అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాలో తనను రాజకీయంగా అణచివేసేందుకు తమ పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. అవకాశం దొరికిన ప్రతీసారి పార్టీ హైకమాండ్‌పై తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ వచ్చారు. అటు వైసీపీ నేతలు కూడా మేకపాటికి కౌంటర్లు ఇస్తూనే వచ్చారు. ఆ మధ్య జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మేకపాటి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ వైసీపీ ఆయనపై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
దీంతో ఆయన వైసీపీకి దూరమయ్యారు. కానీ తన పంథా మాత్రం మార్చుకోలేదు. తనను అణచివేసేందుకు హైకమాండ్‌లోని పెద్దలే సహకరిస్తున్నారంటూ మరింత వాయిస్ పెంచారు. తన రాజకీయ అనుభవం అంత వయస్సు లేని వారికి పదవులు కట్టబెట్టి తనను చిన్నచూపు చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన లోకేష్‌ను కలవడం సంచలనంగా మారింది. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమైపోయిందంటున్నారు. ఈ పాదయాత్ర సమయంలో మేకపాటి పసుపు కండువా కప్పుకొనే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భేటిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.