Top story:నిర్మలమ్మ గారి పన్ను పోటు…
తింటే పన్ను... తిరిగితే పన్ను... నిద్రపోతే పన్ను... మేల్కొంటే పన్ను.... ఇవేవో తుగ్లక్ జమానా పన్నులు కావు... మన నిర్మలమ్మ గారి పన్ను పోట్లు...,సామాన్యుడి పాట్లు... ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని కాసుకు కూర్చున్నారు మన కేంద్ర ఆర్థికమంత్రి... లేటెస్ట్‌గా పాప్‌కార్న్‌పై వేసిన GST శ్లాబులు మీమర్స్‌కు మంచి మసాలాను అందించాయి.
తింటే పన్ను… తిరిగితే పన్ను… నిద్రపోతే పన్ను… మేల్కొంటే పన్ను…. ఇవేవో తుగ్లక్ జమానా పన్నులు కావు… మన నిర్మలమ్మ గారి పన్ను పోట్లు…,సామాన్యుడి పాట్లు… ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని కాసుకు కూర్చున్నారు మన కేంద్ర ఆర్థికమంత్రి… లేటెస్ట్‌గా పాప్‌కార్న్‌పై వేసిన GST శ్లాబులు మీమర్స్‌కు మంచి మసాలాను అందించాయి. ఫైనాన్స్ మినిస్టర్‌ను సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. ఆవిడ చూడలేదేమో కానీ మీమ్స్‌కు కూడా GST వేసేవారేమో…!
వెదర్ చల్లగా ఉంది కదా అని మీ ఇంట్లో సరదాగా పకోడీలో, బజ్జీలో వేసుకుంటున్నారా…! అయితే జాగ్రత్త… ఆ వాసన బయటకు వెళ్లకుండా చూసుకోండి… అది కానీ బయటకు వెళ్లిందో మీ పని గోవిందా…! మీకు పన్నుపోటు తప్పదు… అలా ఉన్నాయి నిర్మలమ్మ గారి పాలనలో కామన్ మెన్ కష్టాలు.
బాదుడే బాదుడు….బాదుడే బాదుడు… ఈ డైలాగ్ ఎన్నికల సమయంలో జగనన్న ఫేమస్ చేశారు కానీ… ఇది నిర్మలా సీతారామన్‌కు బాగా ఆప్ట్ అవుతుంది. మన ఆర్థికమంత్రి పన్నుల మంత్రిగా మారిపోయారు. ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా బాదుడే బాదుడు. మూడనెలలకోసారి GST శ్లాబులు రివైజ్ చేస్తున్నారు. ఈ గ్యాప్‌లో ఎవరిని ఎలా కుమ్మేయాలో బాగా రీసెర్చ్ చేస్తున్నారు మేడమ్. భూతద్దం పెట్టుకుని మరీ వెతికేస్తున్నారు. తాజాగా ఆమె వేసిన రెండు పన్నులు మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్‌లో ఉన్నాయి. పాప్‌కార్న్‌పై మూడు రకాల పన్నులు వేశారు. ప్యాక్ చేస్తే ఒకలా… చేయకుంటే ఒకలా…. సాల్ట్ పాప్‌కార్న్‌కు ఓ పన్ను… షుగర్ కలిస్తే మరో రకమైన పన్ను రేటు… వీటిని చూసిన వారికి ఇన్ని రకాలుగా పన్ను వేయవచ్చా అని దిమ్మ తిరిగి పోయింది. పన్ను విధానం క్లారిటీగా ఉండాలని తీసుకొచ్చి ఇంతలా సంక్లిష్టం చేస్తారా అని జనం మండిపడుతున్నారు. ప్రీ ప్యాక్డ్, రెడీ టు ఈట్ స్నా్క్స్‌పై 12శాతం GST కొనసాగుతుంది. అయితే క్యారమలైజ్డ్ అంటే షుగర్ కలిసిందనుకుంటే మరో 6శాతం ఎక్కువగా అంటే 18శాతం స్లాట్‌లోకి చేరిపోతుందన్నమాట. పోనీ ఉప్పు, మసాలా కలిపి ముందే ప్యాక్ చేయని పాప్ కార్న్ అనుకోండి… 5శాతం పన్ను వేస్తారన్నమాట. ఓ అరచెంచా షుగర్ కలిపిన పాపానికి అదనంగా ఆరు శాతం ట్యాక్స్ పే చేయాలన్నమాట. పొరపాటున ఏ థియేటర్ కో వెళ్లి ప్యాక్డ్ పాప్ కార్న్ మాత్రం అడగకండి. ఎందుకంటే ఇప్పటికే దానిపై 12శాతం పన్నుంది. 3వందలు పెట్టి పాప్‌కార్న్ ప్యాక్ కొంటే 36రూపాయలు పన్ను కట్టాలి. అదే అందులో కాస్త షుగర్ తగిలిస్తే మాత్రం అది ఏకంగా 54రూపాయలకు చేరుతుంది.
ఇక పాతకార్ల విక్రయాలపైనా GSTని పెంచుతూ తీసుకున్న నిర్ణయం పెద్ద కన్ఫ్యూజనే రేపింది. పాతకారు అమ్మితే దానిపై వచ్చే లాభాలపై పన్నును 12 నుంచి 18శాతానికి పెంచింది GST కౌన్సిల్. అయితే దీన్ని ఎలా లెక్కిస్తారు….? పాతకారు అమ్మిన ప్రతి ఒక్కరూ పన్ను కట్టాల్సిందేనా అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే తర్వాత దానిపై క్లారిటీ వచ్చింది. పాతకారు అమ్మిన ప్రతి ఒక్కరూ పన్ను కట్టాల్సిన పనిలేదు. ఇది వెరీ క్లియర్. GSTకింద నమోదైన వ్యక్తులు, సంస్థలు మాత్రమే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆయా సంస్థలు పాత కార్లు విక్రయిస్తే దానిపై వచ్చే లాభంపై పన్ను చెల్లించాలి. ఇది ఈవీలకూ వర్తిస్తుంది. మీరు ఓ మామూలు వ్యక్తై ఉండి మీరు పాతకారు అమ్మినా మీకు ఎలాంటి పన్నూ పడదు.
సరే మీరు GST కింద రిజిస్టరై ఉన్నారనుకుందాం అలాంటప్పుడు కారు అమ్మితే వచ్చే మొత్తం మీద పన్ను కట్టాలా అన్న అనుమానం వస్తుంది. దీనిపై కూడా క్లియర్ ఇన్ఫో ఉంది. మీ కారు ప్రస్తుత విలువకు, ఇప్పడు అమ్మేదానికి మధ్య గ్యాప్ పైనే 18శాతం GST కట్టాలి. ఉదాహరణకు మీరు 15లక్షలు పెట్టి కారు కొన్నారు. కొన్నేళ్ల తర్వాత తరుగదల తీసేస్తే దాని విలువ 10లక్షలుగా ఉంది. కానీ మీరు కారును 12లక్షలకు అమ్మితే వచ్చే లాభం ఆ రెండు లక్షలపైనే ట్యాక్స్ కట్టాలి. తరుగదలను ఎలా లెక్కిస్తారంటే దానికి ఓ మార్గం ఉంది. మనం కారు ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు దాని విలువ తెలిసిపోతుంది. ఇదంతా కూడా మీరు GSTకింద రిజిస్టరై ఉంటేనే… లేకపోతే అసలు ఏ బాధా లేదు.
కేంద్రం జీఎస్టీని తీసుకొచ్చిందే పన్ను విధానాన్ని ఈజీ చేయడానికి, డబుల్ ట్యాక్స్ పడకుండా జాగ్రత్త పడటానికి. కానీ నిర్మలమ్మ మాత్రం జీఎస్టీ పేరుతో జనాన్ని బాదేస్తున్నారు. ఏం దొరికితే దానిపై పన్ను వేసేస్తున్నారు. సామాన్యుడు ఏం కొన్నా, తిన్నా పన్ను కట్టాల్సిందే. కానీ బడా వ్యాపారులు జీరో వ్యాపారం చేసేవారు మాత్రం అడ్డంగా బలిసిపోతున్నారు. వారిపై చర్యలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. కానీ సామాన్యుడిపై మాత్రం అడ్డగోలుగా భారం మోపేస్తున్నారు. పన్నులు కట్టకుండా వస్తువులు అమ్మేవాళ్లు మన ముందే చాలామంది కనిపిస్తారు. అలాంటి వారిపై మాత్రం ఇలాంటి పన్నుపోట్లేమీ ఉండవు. వారు మాత్రం చట్టానికి చుట్టాలే. కానీ ఎంత బాదినా ఓర్చుకుంటూ పన్నులు కట్టే సామాన్యుడిపై మాత్రం ఎప్పుడూ కొరడా వేలాడుతూనే ఉంటుంది. మళ్లీ వచ్చే GST కౌన్సిల్ మీటింగ్ లో ఇంకా వేటిపై పన్ను వేస్తారో చూడాలి… కాస్త జాగ్రత్త ఈ గ్యాప్ లో నిర్మలమ్మకు మాత్రం కనపడకండి. అలా కనబడినందుకు కూడా పన్ను వేసినా వేస్తారు మరి…!