DIAL VIEW ఛీ..సిగ్గులేని రాజకీయాలు! కొండా సురేఖగారు ఈ 5 ప్రశ్నలకు బదులివ్వగలరా?

ఐ బిలీవ్ ఇన్ ది పవర్ ఆఫ్ వుమెన్స్ వాయిస్ అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా గర్జిస్తే... యావత్ ప్రపంచానికి గూస్ బంప్స్ వచ్చాయి. ముఖ్యంగా మహిళల్లో అణగారిపోతున్న చైతన్యం నినాదమై ప్రజ్వరిల్లింది. ఇందుకు తప్పకుండా మలాలాకు సెల్యూట్ చెప్పాల్సిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 2, 2024 | 06:46 PMLast Updated on: Oct 02, 2024 | 6:46 PM

Minister Konda Surekha Vulgar Comments On Ktr And Akkineni Family

ఐ బిలీవ్ ఇన్ ది పవర్ ఆఫ్ వుమెన్స్ వాయిస్ అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా గర్జిస్తే… యావత్ ప్రపంచానికి గూస్ బంప్స్ వచ్చాయి. ముఖ్యంగా మహిళల్లో అణగారిపోతున్న చైతన్యం నినాదమై ప్రజ్వరిల్లింది. ఇందుకు తప్పకుండా మలాలాకు సెల్యూట్ చెప్పాల్సిందే. కానీ తెలంగాణ మంత్రి కొండా సురేఖ దిగజారుడు కామెంట్స్ చూస్తే… ఐరన్ లేడీ నోటినుంచి రావాల్సిన కామెంట్లేనా ఇవి యావత్ మహిళా సమాజమే సిగ్గుతో తలదించుకుంది. దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతున్న BRS అనుబంధ సోషల్ మీడియా అకౌంట్స్‌ నుంచి తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారనేది మినిస్టర్ కొండా సురేఖ ప్రధాన ఆరోపణ. ఒకవేళ ఇదే కనుక నిజమయితే … ఆ సోషల్ సైకోలు ఎవరైనా సరే తాట తీయాల్సిందే. కానీ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఊరుకుంటానా అంటూ విరుచుకుపడిన కొండా సురేఖ తాను మంత్రిని అనే నిజం మర్చిపోయి..తాను మహిళను అనే విషయం మర్చిపోయి చేసిన అత్యంత నీచాతినీచమైన కామెంట్స్‌ ను చూస్తే… సినీనటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ లో నిలదీసినట్లు ఏమిటి ఈ సిగ్గులేని రాజకీయాలు అని సామాన్యుడు కూడా కడిగేయక మానడు.

కేటీఆర్ టార్గెట్ గా మినిస్టర్ కొండా సురేఖ చేసిన కామెంట్స్ ను ఇప్పుడు సమగ్రంగా చూస్తే…. తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో హీరోయిన్ల జీవితాలు నాశనం చేసింది కేటీఆరే. హీరోయిన్లకు మత్తు పదార్ధాలు,డ్రగ్స్‌ అలవాటు చేసింది కేటీఆరే. ఇందుకే కేటీఆర్ డ్రగ్స్‌ ఛాలెంజ్‌కు రమ్మంటే ముందుకు రాలేదు. ఇవి అంతా ఒక ఎత్తు అయితే… కొండా సురేఖ చేసిన దారుణమైన ఆరోపణలు… డైనమైట్లై పేలాయి. మాదాపూర్ ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చకుండా ఉండాలంటే… సమంతను తన వద్దకు పంపాలని కండీషన్ పెట్టాడు కేటీఆర్. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను ఆపేందుకు… సమంతను కేటీఆర్ వద్దకు పంపేందుకు నాగార్జున, నాగ చైతన్య ఒత్తిడి చేసారు. కేటీఆర్ వద్దకు వెళ్లేందుకు సమంత ఒప్పుకోలేదు. నాగార్జున, నాగచైతన్య,కేటీఆర్ ఒత్తిడి తట్టుకోలేక సమంత విడాకులు తీసుకుందట. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ను వదల్లేదు మినిస్టర్ కొండా సురేఖ. కేటీఆర్‌ అరాచకాలను భరించలేకే రకుల్ ప్రీత్ సింగ్ త్వరగా పెళ్లి చేసుకోవాల్సివచ్చిందని ఆరోపించారు. కేటీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎందరో ఆడవాళ్ల జీవితాలను , ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్ల జీవితాలను నాశనం చేసాడన్న సురేఖ త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు కూడా!

క్వశ్చన్ నెంబర్ 01. కొండా సురేఖగారు… మాదాపూర్ ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన వద్దకు పంపాలనే కండీషన్ పెట్టాడని మీకు ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు? నాగార్జున, నాగచైతన్య, కేటీఆర్‌ నుంచి నాకు రక్షణ కల్పించండి అంటూ సమంత ఏ పోలీస్‌ స్టేషన్‌లో అయినా కంప్లైంట్ ఇచ్చారా? లేక ఆ ధైర్యం లేక సమంత మీవద్దకు వచ్చి వ్యక్తిగతంగా చెప్పుకుని వాపోయిందా?

క్వశ్చన్ నెంబర్ 02. ఎన్‌ కన్వెన్షన్ ను కాపాడుకునేందుకు నాగార్జున, నాగచైతన్యలే సమంతను కేటీఆర్‌ వద్దకు పంపేందుకు ఒత్తిడి చేసారని మీ బాషలో నిలదీయాలంటే బ్రోకరిజం చేసినట్లు మీవద్ద ఉన్న ఆధారాలు ఉన్నాయా? అలాంటి ప్రూఫ్స్ కనుక ఉంటే… ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు. పోనీ రేపో, ఎల్లుండో బయటపెడతారా?

క్వశ్చన్ నెంబర్ 03. కేటీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రకుల్ ప్రీత్ సింగ్‌ను వేధించింది నిజమే అయితే… అందుకోసమే ఆమె త్వరగా పెళ్ళి చేసుకుంది నిజమే అయితే… ఈ విషయం మీకు ఎవరు చెప్పారు. రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా లేక సమంతాలాగే రకుల్ ప్రీత్ సింగ్ సైతం మీకు వ్యక్తిగతంగా గోడు వెళ్లబోసుకున్నారా?

క్వశ్చన్ నెంబర్ 04. కేటీఆర్ హీరోయిన్లకు డ్రగ్స్‌ అలవాటు చేసి ఉండి ఉంటే, పవర్ ను అడ్డుపెట్టుకుని హీరోయిన్ల జీవితాలతో ఆడుకుని ఉండి ఉంటే… అందుకు తగిన సాక్ష్యాలు మీవద్ద ఉండి ఉంటే… ఎందుకు దాచిపెడుతున్నారు. వాటిని ప్రజల ముందుకు ఎందుకు తీసుకురావట్లేదు. ఒకవేళ నిజంగా అవి ఉంటే కేటీఆర్‌ను పొలిటికల్‌గా బ్లాక్ మెయిల్ చేసేందుకు మాత్రమే వాడదల్చుకున్నారా?

క్వశ్చన్ నెంబర్…05. మహిళలు మంత్రులుగా ఉంటే కేటీఆర్ ఇతర బీఆరెస్ నేతలు చూడలేకపోతున్నారని పదే పదే ఆరోపస్తున్న కొండా సురేఖగారు… ఇంత దిగజారుడు ఆరోపణలు ఎలా చేయగలిగారు. కేటీఆర్ వద్దకు వెళ్లమని నాగచైతన్య, నాగార్జున సమంతను ఒత్తిడి చేసారా? నాగార్జునకు భార్యగా అమల, సోదరిగా సుశీల ఉన్నారని వాళ్లు మహిళలే అనే విషయం మర్చిపోయారా, నాగచైతన్యకు కాబోయే భార్య శోభిత దూళిపాళ్ల ఆమె కూడా మహిళే అని మర్చిపోయారా? కేటీఆర్‌ భార్య శైలిమ, తల్లి శోభ, కుమార్తె ఉన్నారని వాళ్లు మహిళలే, వాళ్లు కూడా మీలాంటి మహిళలే…వాళ్లకు ఆత్మగౌరవం ఉంటుంది. వాళ్లకు వ్యక్తిగతం ఉంటుంది. వాళ్లు కూడా మీవంటి మనుషులే అని ఒక్కక్షణం అయినా ఎందుకు గుర్తు చేసుకోలేకపోయారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇలా నిలదీస్తున్నందుకు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలో లేక BRS వ్యతిరేక వర్గమో మమ్మల్ని బూతులు తిట్టొచ్చు. అంతెందుకు మరికొన్ని నిందలతో మామీద మంత్రులు కొండా సురేఖ లేదా సీతక్కో విరుచుకుపడొచ్చు. అయినా సరే ఒకటే మాట. అరాచకాలపై సమగ్రంగా మీ సర్కార్ వద్ద ఆధారాలు ఉండి ఉంటే..వాటిని ప్రజల ముందు ఉంచి కేటీఆర్ బతుకు బట్టబయలు చేయండి. న్యాయస్ధానం ముందుకు తీసుకువచ్చి భవిష్యత్తులో మరే ఇతర రాజకీయ నాయకుడు ఇలాంటి దుర్మార్గపు దుశ్చర్యలకు పాల్పడకుండా గుణపాఠం నేర్పించండి. మెరుగైన సమాజం కోరుకునే వాళ్లు ఎవరైనా ముఖ్యంగా రాజకీయనేతలు ఎవరైనా సరే చేయాల్సింది ఇదే. అలా కాకుండా రాజకీయంగా ప్రత్యర్ధులను టార్గెట్ చేసేందుకు ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడితే..భవిష్యత్తులో ఇవి సత్యాలు కావు కేవలం పొలిటికల్ గెయిన్స్‌ కోసం చేసిన ఆరోపణలు అని తేలిపోతే…. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ప్రజలు అన్నీ గమనిస్తారు. గమనిస్తూ ఉంటారు. బుద్ధి చెప్పాల్సి వచ్చినప్పుడు ఓటుతో, ప్రజాతీర్పుతో కొరడా ఝళిపిస్తారు.