KTR: చంద్రబాబు అరెస్టుకు, తెలంగాణకు ఏం సంబంధం.? ప్రశ్నించిన కేటీఆర్
చంద్రబాబు అరెస్టుకు, తెలంగాణకు ఏం సంబంధం? చంద్రబాబు అరెస్టు ఏపీకి చెందిన రాజకీయ సమస్య. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో నిరసనలా..? – చంద్రబాబును అరెస్టు చేస్తే హైదరాబాద్‌లో ఆందోళనలా? ఆంధ్రాలో పంచాయితీ.. ఆంధ్రాలో తేల్చుకోవాలి.
KTR: ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఏపీ రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేస్తే తెలంగాణకు ఏం సంబంధం అని, ఇక్కడెందుకు ర్యాలీలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ తాజా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
”చంద్రబాబు అరెస్టుకు, తెలంగాణకు ఏం సంబంధం? చంద్రబాబు అరెస్టు ఏపీకి చెందిన రాజకీయ సమస్య. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో నిరసనలా..? – చంద్రబాబును అరెస్టు చేస్తే హైదరాబాద్‌లో ఆందోళనలా? ఆంధ్రాలో పంచాయితీ.. ఆంధ్రాలో తేల్చుకోవాలి. హైదరాబాద్ వాసులను టీడీపీ, వైసీపీ ఇబ్బంది పెట్టడం సరికాదు. వైసీపీ, టీడీపీకి తెలంగాణలో ప్రాతినిధ్యం లేదు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు కలిసిమెలిసి ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమ వేళ కూడా ఐటీ సెక్టార్‌లో ఆందోళనలు జరగలేదు. మా పార్టీ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తిగత అభిప్రాయం. చంద్రబాబు అరెస్టు విషయంలో మేం తటస్థంగా ఉంటున్నాం. ప్రశాంతంగా ఉన్న ఐటీ డిస్టబ్ కావొద్దు. శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దనే ఐటీ ఉద్యోగుల ఆందోళనలకు అనుమతివ్వలేదు.
తెలంగాణలో ఆందోళనలకు ఎందుకు అనుమతివ్వడం లేదని నారా లోకేశ్ నాకు ఫోన్ చేశారు. ఒకరికి అనుమతిస్తే.. వేరే పార్టీకి అనుమతి ఇవ్వాల్సి వస్తుంది. ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వం. చంద్రబాబు అరెస్టు రెండు పార్టీల సమస్య. నాకు లోకేశ్, జగన్, పవన్ అందరూ మిత్రులే. ఏపీ ప్రజలు ఇక్కడ బాగానే ఉన్నారు. చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ అంశం కోర్టులో ఉంది. దీని గురించి మాకు అనవసరం. కావాలనుకుంటే ర్యాలీలు తెలంగాణలో ఎందుకు..? ఏపీలో చేస్కోండి. రాజమండ్రిలో భూమి బద్దలు కొట్టేలా ర్యాలీలు చేసుకోండి. ఇక్కడ ఎవరు చేసినా ఊరుకునేది లేదు” అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.