MINISTER ROJA: రోజాకి సానుభూతి ఎందుకు రావడం లేదు..? జనం ఎందుకు పట్టించుకోవడం లేదు..?
రోజా విషయంలో బండారు చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమే. ఈ విషయంలో బండారుపై విమర్శలు వస్తూనే.. రోజాపై సానుభూతి వెల్లువెత్తాల్సి ఉంది. కానీ, రోజాకు ఈ విషయంలో పెద్దగా మద్దతు లభించలేదు. ఆమెపై ఇతర పార్టీలు, మహిళల్లో సరైనస్థాయిలో సానుభూతి కనిపించలేదు.
MINISTER ROJA: ఏపీ మంత్రి, సినీ నటి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. రోజా విషయంలో బండారు చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమే. ఈ విషయంలో బండారుపై విమర్శలు వస్తూనే.. రోజాపై సానుభూతి వెల్లువెత్తాల్సి ఉంది. కానీ, రోజాకు ఈ విషయంలో పెద్దగా మద్దతు లభించలేదు. ఆమెపై ఇతర పార్టీలు, మహిళల్లో సరైనస్థాయిలో సానుభూతి కనిపించలేదు. అంతెందుకు.. సొంత పార్టీ వైసీపీ నుంచే రోజాకు సరైన మద్దతు రాలేదన వాదన ఉంది. ఏదో పోలీసు కేసు పెట్టడం, కాస్త సోషల్ మీడియాలో ఖండించడం తప్ప రోజాపై వ్యాఖ్యలకు ప్రభుత్వం నుంచి కూడా సరైన స్పందన రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమెపై సానుభూతి రాకపోవడానికి కారణమేంటి..? ఇదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది.
పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్ అనే ముద్రతో మంత్రి రోజా దూసుకుపోతూ ఉంటారు. కానీ రోజా మాట్లాడే మాటలు, తిట్లు, పెట్టే శాపనార్ధాలు వింటే ప్రస్తుత రాజకీయాలపై ఎవరికైనా అసహ్యం కలుగుతుంది. తెలుగుదేశం వాళ్ళని, పవన్ కళ్యాణ్‌ని తిట్టాలంటే ఏపీలో రోజా తర్వాతే ఎవరైనా. జగన్‌ని మాటలతో ప్రొటెక్ట్ చేయడంలో రోజాకి సాటి ఎవ్వరు రారు. ఆ విషయంలో ఆమె కన్నూ మిన్నూ కానకుండా మాట్లాడుతారు. ఏదైనా మాట్లాడుతారు. అందులో బూతులు ఉండొచ్చు. జనం జీర్ణించుకోలేని కఠిన పదాలు కూడా ఉండొచ్చు. రోజాకి కావలసింది కేవలం జగన్ దృష్టిలో పడటం. నేను మీకు విశ్వాసపాత్రురాలైన అనుచరురాలిని అని నిత్యం అనిపించుకోవడం. స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతోత్సవంలో చంద్రబాబును పొగిడినందుకు.. రజనీకాంత్‌ను కూడా రోజా వదిలిపెట్టలేదు.
జగన్ కోసం రజనీకాంత్ అంతటి వాడిని తిట్టిపోశారు. అంతకుముందు ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో కూడా రోజా అనుచితంగానే మాట్లాడారు. సాటి మహిళా ఎమ్మెల్యేలపై కూడా అసభ్య పదజాలం వాడారు. మరోవైపు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేస్తే అమానవీయంగా కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఆ దృశ్యం చూసిన చాలామందికి రోజా ధోరణి జుగుప్స కలిగించింది. నిన్నగాక మొన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని, కోడలు బ్రాహ్మణిని కూడా వదిలిపెట్టకుండా విమర్శించింది. జనంలో, ప్రెస్‌మీట్లలో కూడా ఆమె భాష అభ్యంతరకరంగా, నీచంగానే ఉంటుంది. అందుకే ఆమెపై జనాల్లో ఎలాంటి సానుభూతి లేదు. ఇప్పుడు బండారు సత్యనారాయణ రోజాపై అసభ్యంగా మాట్లాడడంపై రాజకీయ వర్గాల్లో ఎవరు పెద్దగా స్పందించడం లేదు. సొంతపార్టీ మహిళా నేతలు కూడా రోజాకి మద్దతుగా మాట్లాడటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆవిడతో టేబుల్ షేర్ చేసుకునే మహిళా మంత్రులు కూడా ఇప్పటివరకు నోరెత్తలేదు.
జనం స్పందన ఇదే..
రోజాపై జనంలోనూ సానుభూతి లేదు. ఎవరూ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. పైగా రోజా కూడా అలాగే మాట్లాడుతుంది కదా అని తేలికగా కొట్టి పడేస్తున్నారు. మహిళలపై ఇలా మాట్లాడొచ్చా.. మీ ఇంట్లో ఆడవాళ్ళపై కూడా ఇలాగే మాట్లాడుతారా.. అంటూ రోజా ఆవేదన వ్యక్తం చేస్తే.. మరి ఒక మహిళై ఉండి రోజా అలా మాట్లాడొచ్చా.. వైసీపీలో మిగిలిన మహిళా నేతలంతా ఇలాగే మాట్లాడుతున్నారా.. మరి రోజా ఎందుకు అలా మాట్లాడుతుంది అని ప్రశ్నించేవారు లేకపోలేదు. ఏదేమైనా రోజా ప్రవర్తనే ఆమె స్థాయి దిగజారడానికి కారణమైంది. ఇవాళ ఆమెపై అంతటి అనుచిత వ్యాఖ్యలు చేసినా సరైన స్పందన రాకపోవడమే దీనికి నిదర్శనం. రాజకీయాల్లో హుందాతనం, పరస్పర గౌరవం ముఖ్యం అనే విషయాన్ని రోజా సహా నేతలంతా గుర్తించాలి.