Minister Roja: ‘రోజా’ముళ్లు.. నగరి సంగతి కాస్త చూసుకోమ్మా..!

నగరిలో రోజమ్మకు అసమ్మతి సెగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చాలాకాలం నుంచి ఆమెపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇటీవల అది విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మంత్రి అయిన దగ్గర నుంచి పట్టపగ్గాలు లేకపోవడంతో సొంత నియోజకవర్గంలోనే సీనియర్ నేతలు మేడమ్‌పై మండిపడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 28, 2023 | 05:58 PMLast Updated on: Aug 28, 2023 | 5:58 PM

Minister Roja Shoul Look Into Own Constituency Nagari

Minister Roja: వైనాట్ 175 అంటున్న మేడమ్ రోజాకు ఓ సూచన. రాష్ట్రమంతా పార్టీ గెలవడం సంగతేమో కానీ ముందు నీ నియోజకవర్గంలో గెలుస్తావో లేదో చూసుకోమ్మా..! బయటివాళ్లు కాదు.. మీ పార్టీవాళ్లే నీకు ప్రతిపక్షంగా మారిపోయారు కదా..! తేడావస్తే రోజా పువ్వు వాడిపోతుంది కాస్త జాగ్రత్త..!
రోజా.. ‘జబర్దస్త్’ పొలిటీషియన్. చంద్రబాబు, పవన్‌లపై మాటల తూటాలు విసరడం అంటే మేడమ్‌కు మహా ఇష్టం. ఎంతైనా సినిమానటి కదా. అందుకే సినిమా డైలాగులతో వారిపై నోరేసుకుని పడిపోతారు. ఆ క్వాలిటీనే ఆమెకు మంత్రి పదవిని సాధించి పెట్టింది. వాళ్లను, వీళ్లను తిట్టడం సంగతి పక్కనపెట్టి, ఇక తన నియోజకవర్గం నగరిపై కాస్త దృష్టిపెట్టాలని వైసీపీ నేతలే మేడమ్‌కు సూచిస్తున్నారు. నగరిలో రోజమ్మకు అసమ్మతి సెగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చాలాకాలం నుంచి ఆమెపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇటీవల అది విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మంత్రి అయిన దగ్గర నుంచి పట్టపగ్గాలు లేకపోవడంతో సొంత నియోజకవర్గంలోనే సీనియర్ నేతలు మేడమ్‌పై మండిపడుతున్నారు.
రోజాపై వ్యతిరేకత ఎంత ఉందో చెప్పడానికి నిదర్శనం నగరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ సాక్షిగా సోమవారం జరిగిన ఘటన. విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమం కోసం వచ్చిన సీఎం జగన్ నేతల మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. బస్సు దిగిన వెంటనే తనకు కనిపించిన నగరి మున్సిపాలిటీ మాజీ ఛైర్‌పర్సన్ కేజే.శాంతితో ఆప్యాయంగా మాట్లాడారు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని పక్కనే ఉన్న రోజాతో చేయి కలిపించారు. అయితే శాంతి మాత్రం పిడికిలి అలాగే బిగించి ఉంచారు. రోజాతో చేయి కలిపేందుకు ఆమె ఏ మాత్రం ఇష్టపడలేదు. దీంతో రోజా మెల్లగా తన చేయి వెనక్కు తీసుకున్నారు. అయినా మనసులు కలవనప్పుడు చేతులు కలుస్తాయా..? రోజాను వెంటాడుతున్న అసమ్మతికి ఇదో ఉదాహరణ మాత్రమే.
నగరిలోని ప్రతి మండలంలోనూ రోజాకు అసమ్మతి రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. నగరి మున్సిపాలిటీలో రోజాకు మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్, ఈడిగ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ కేజే.శాంతి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శాంతిని ఈడిగ కార్పొరేషన్ పీఠంపై కూర్చోబెట్టింది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక పుత్తూరులో రోజాకు అమ్ములు నుంచి అసమ్మతి రాజుకుంటోంది. ఇక నిండ్ర మండలంలో శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్ చక్రపాణిరెడ్డి అడ్డుపడుతున్నారు. విజయపురంలో రాజు, వడమాలపేటలో మురళీరెడ్డి కూడా రోజాను వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల ముందు నుంచే వీరు రోజా తీరుపై గుర్రుగా ఉన్నా.. పెద్దిరెడ్డి నచ్చచెప్పడంతో తగ్గారు. కానీ ఈసారి మాత్రం అలా కాదంటున్నారు. గత ఎన్నికల తర్వాత రోజా తన కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం, మిగిలిన నేతలను పట్టించుకోకపోవడం, మంత్రినన్న అహంకారం చూపించడం దెబ్బకొట్టింది.
రోజాకు సీటు ఇవ్వొద్దని ఇప్పటికే నగరిలో చాలామంది నేతలు కోరుతున్నారు.

ఆమెకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఆమె తప్ప ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తామంటున్నారు. రోజాతో మాత్రం కలిసి పనిచేయలేమంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్ ఆమెకే టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆమెను ఓడిస్తామని చెబుతున్నారు అసమ్మతి నేతలు. ఒకవేళ చివరి నిమిషంలో పార్టీ ఏమైనా రాజీ ప్రయత్నాలు చేస్తుందేమో చూడాలి. అయితే గతంలో సహకరించినట్లు ఈసారి మాత్రం కుదరదని అసమ్మతి నేతలు చెబుతున్నారు. గట్టిపోటీ ఉంటుందని భావిస్తున్న వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. ఒకవేళ ఒకరిద్దరు నేతలు సహాయనిరాకరణ చేసినా రోజా పువ్వు వాడిపోవడం ఖాయం. మరి రోజా వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అసెంబ్లీ మెట్లు ఎక్కుతారా..? లేక మాజీ ఎమ్మెల్యేగా మారిపోయి జబర్దస్త్ షో చేసుకుంటారా..? వేచి చూడాలి.