Jagan: జగన్ ఓడిపోతే ఈ పది మందే కారణం!?
స్వామి భక్తి చూపించేవారంటే.. ఏ నాయకుడికైనా ఇష్టమే ! జగన్ దానికి తీసిపోరు. అందుకే ఆయన దృష్టిలో పడడానికి.. ఆయన మెప్పు పొందడానికి.. తమ భుజాలను తట్టించుకోవడానికి.. వైసీపీలో నేతలు జారే మాటలు.. ఇంకాసేపు బీప్ వేస్తే బాగుండు అనిపిస్తుంటుంది. ఏదో చేయడం కంటే.. ఏదీ చేయకపోవడమే బెటర్ కొన్నిసార్లు ! ఈ లాజిక్ మిస్ అవుతున్నారిప్పుడా పది మంది నాయకులు.
వ్యక్తిగత విషయాలు లాగడంలో.. సిగ్గు, శరంలాంటి పదాలు సింపుల్‌గా వాడడంలో.. వాళ్ల తర్వాతే ఎవరైనా ! మాటల్లో పదును ఉంది అనుకుంటున్నారేమో కానీ.. అదే పదును పార్టీని కోసేస్తోందనే విషయం మర్చిపోతున్నారు నేతలు ! ముఖ్యంగా ఆ పది మంది నేతల తీరు, మాటలు.. పార్టీనే ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకువచ్చింది. బ్యాడ్‌టైమ్ స్టార్ట్ అయిందని అసలే సంకేతాలు కనిపిస్తున్నాయ్. ఇలాంటి సమయంలో ఆ పది మంది చాలు పార్టీని ఓడించడానికి అని ఖాయం అనిపిస్తోంది.
ఈ లిస్టులో ముందుగా వినిపించే పేరు.. కొడాలి నాని ! డ్యాష్ మొగుడు అనే మాటతోనే మనోడి స్పీచ్ మొదలవుతుంది. అరగంట మాట్లాడితే.. బూతులే బూతులు.. అర్థం ఉండదు.. ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు. సబ్జెక్ట్ ఉండదు.. తిట్టడం తప్ప! చంద్రబాబు నుంచి మొదలుపెట్టి లోకేశ్.. వయా దేవినేని ఉమా.. అందరి మీద తిట్ల వర్షమే.. ఆరోపణలే ! ఇన్నీ తిట్టి సమస్యల గురించో, పాలన గురించో ఏమైనా మాట్లాడతారా అంటే.. మైకులు కూడా మౌనంగా ఉండిపోతాయ్ అదేంటో ! అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి ఎపిసోడ్‌తో కొడాలి నాని గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. కమ్మసామాజికవర్గం అంతా ఇప్పుడు కొడాలి మీద గుర్రుగా ఉంది. ఇది చాలదు అన్నట్లు.. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు విషయంలో కనీసం రియాక్ట్ కాలేదు నాని. దీంతో వైసీపీలో అంతో ఇంతో ఉన్న కమ్మ సామాజికవర్గం అంతా.. టీడీపీ వైపే టర్న్ అయిన పరిస్థితి. దీంతో నాని మాటలు, బూతులు, ఆరోపణలు.. వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారాయ్.
ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నది వల్లభనేని వంశీ ! టీడీపీ నుంచి గెలిచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు తిట్టేందుకే అధికార పార్టీ ఆయనను దగ్గర చేసుకుందా అన్నట్లు ఉంది సీన్ ! అసెంబ్లీలో చంద్రబాబు భార్య పేరు తీసుకొచ్చిందే వల్లభనేని వంశీ. ఆయన సామాజికవర్గం కూడా అదే బలంగా నమ్ముతోంది కూడా ! టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి వెళ్లడమే కాదు.. చంద్రబాబు భార్యనే కామెంట్ చేయడంపై ఆ వర్గం అంతా గుర్రుగా ఉంది. చంద్రబాబు బాడీ నుంచి వచ్చే వాసన మీద.. లోకేశ్ బాడీ వెయిట్ మీద కామెంట్లు తప్ప.. రాజకీయంగా ఆరోపణలు చేసినట్లు ఏనాడు కనిపించరు వంశీ ! ఆయన మాటలపై రోజురోజుకు జనాల్లో అసహ్యం పెరిగిపోతోంది. చంద్రబాబుపై వంశీ ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా ఎవరూ రియాక్ట్ కాకపోయినా.. భువనేశ్వరితో పాటు నారా కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగడంపై ఆయన మీద జనాల్లో కోపం మొదలైంది. అది టీడీపీకి ప్లస్‌గా.. వైసీపీకి భారీ మైనస్‌గా మారింది.
ఫ్యాన్ పార్టీకి మేజర్ మైనస్‌గా మారిన మరో వ్యక్తి.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్. సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ అయిపోతున్నారు ప్రతీ విషయంలో! చంద్రబాబును నాని, వంశీ టార్గెట్ చేస్తే.. పవన్ ఏం మాట్లాడినా వెంటనే మైక్ ముందు కనిపించే వ్యక్తుల్లో టాప్‌లో ఉంటారు అమర్నాథ్. వచ్చేసి రాజకీయంగా ఆరోపణలు చేస్తారా.. పవన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా అంటే.. వ్యక్తిగత విమర్శలు తప్ప పెద్దగా ఏవీ కనిపించవ్ ఆయన ప్రసంగంలో ! పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తప్ప.. మరోది వినిపించదు ఆయన నుంచి ! మంత్రి కదా పాలన గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడుతారు అనుకుంటే.. అబ్బే అదేమీ ఉండదు అక్కడ ! జనాలకు చిరాకు తెప్పించే స్థాయిలో కనిపిస్తున్నాయ్ అమర్నాథ్ మాటలు.
అమర్‌నాథ్ తర్వాత వెంటనే వినిపించే పేరు.. మంత్రి రోజా ! చంద్రబాబు, లోకేశ్, పవన్ మీద ఆమె చేసే ఆరోపణలు, తిట్టే తిట్లు.. జనాలకు రోత పుట్టిస్తున్నాయ్. డైమండ్ రాణి అంటూ సోషల్ మీడియాలో రోజా పేరు రీసౌండ్ ఇస్తోంది అందుకే ! రోజా ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. ట్రోల్ చేసేస్తున్నారంటే.. ఆమె మాటల మీద ఎంతలా విసిగిపోయారో.. చిరాకులో ఉన్నారో అర్థం అవుతోంది. అంబటి రాంబాబు సీన్ కూడా అంతే ! భారీ నీటి పారుదల మంత్రి అయినా.. ఆయన నోటి నుంచి పారేది భారీ ఆరోపణలు, బూతులే అని జనాలు ఫిక్స్ అయిపోయారు. చంద్రబాబు, పవన్‌ను తిట్టడానికి తప్పితే.. పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి.. పనులు ఎక్కడి వరకు వచ్చాయ్. ప్రత్యేక హోదా గురించి ఏంటనే విషయాలపై ప్రెస్‌మీట్‌లో పెద్దగా దృష్టి పెట్టరు ఆయన ! సిగ్గు, శరం అనే పదాలను చట్టసభలో అవలీలగా ప్రత్యర్థుల మీద సంధించే మంత్రి అంబటి రాంబాబు. బీప్‌లు వేసుకోవడానికి కావాల్సినంత స్కోప్ ఇస్తారు ఆయన ! చంద్రబాబు, లోకేశ్‌ను తిడుతున్నారని సంబరపడుతున్నారు తప్ప.. సొంత పార్టీకే జనాల్లో అసలు మోసం జరుగుతుందనే విషయం గుర్తించలేకపోతున్నాయ్ వైసీపీ శ్రేణులు.
ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ మాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్‌కు సన్నిహితుడు అని అనిల్‌కు పేరు. జగన్‌ను మరింత ఇంప్రెస్ చేయాలనుకుంటారో.. టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ కావాలి అనుకుంటారో కానీ.. తన మాటలతో పార్టీనే ఇబ్బందుల్లో పెడుతుంటారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ మీద వ్యక్తిగత ఆరోపణలకు దిగుతూ.. పార్టీని దిగజారుస్తున్నారు. తారకరత్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆరోగ్యంపై కామెంట్లు చేసి.. పార్టీని మరింత వీక్ చేయడమే కాదు.. చంద్రబాబు సింపథీ వచ్చేలా మాట్లాడారు.
మరో మంత్రి అప్పలరాజు సంగతి సరేసరి ! ఆయన మంత్రి అన్న విషయం మర్చిపోయారేమో అనిపిస్తుందని జనాలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. జగన్ మెప్పు కోసమే అన్నట్లుగా చంద్రబాబు మీద కామెంట్లు చేస్తున్నారు. బాగా చదువుకున్నవాడు, చంద్రబాబు చేతుల మీదుగా చిన్నప్పుడు అవార్డు తీసుకున్నవాడు అనుకుంటే.. ఆయన మాటలు ఆ స్థాయిలో ఉండడం లేదు. తంతారు, పొడుస్తారు అంటూ చంద్రబాబు మీద కామెంట్లు చేస్తూ.. తన మాటలతో టీడీపీకి సింపథీ క్రియేట్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు మీద మరో మంత్రి నారాయణస్వామి మాటలకు కనీసం కంట్రోల్ ఉండదు. చంద్రబాబు పిచ్చోడు అనే మాటకు దిగి మాట్లాడరు ఆయన ! జగన్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో మాట మీద అదుపు తప్పుతూ విమర్శలు గుప్పిస్తుంటారు.
మరో మంత్రి జోగి రమేష్‌ది కూడా అదే పరిస్థితి ! మైలవరం పంచాయితీ ఎలాగూ ఉంది. ఆ సీటు తనకు కావాలంటే.. జగన్‌తో శభాష్ అనిపించుకోవాలి. దీనికోసం చంద్రబాబును టార్గెట్ చేయడమే మార్గం అనుకుంటారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మీద నోరు జారిన సందర్భాలు ఎన్నో! ఇక విజయసాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోకేశ్‌ను బాడీ షేమింగ్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు. ఇక చంద్రబాబు మీద చేసే విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇలా పది మందిలో మెజారిటీ నేతలు మంత్రులుగా చేసినవాళ్లు.. చేస్తున్నవాళ్లు ! వైసీపీ పాలన గురించి.. పార్టీ విధానాల గురించి కంటే.. ప్రత్యర్థిని తిట్టడం మీద వీళ్లకు ఎక్కువ దృష్టి. ఇది జగన్‌కు భారీ డ్యామేజ్‌గా మారింది. వీళ్లు తిట్టిన ప్రతీసారి చంద్రబాబు మీడియా ముందుకు రావడం.. కన్నీళ్లు పెట్టుకోవడం.. తెలియకుండానే జనాల్లో టీడీపీ మీద సింపథీ క్రియేట్ చేసింది.
తిట్టడం వారి హక్కు.. వినడం మన బాధ్యత అనేలా పరిస్థితి తయారయింది. ఎవరు ఏం అనుకున్నా వారికేం పట్టింపూ ఉండదు. తిట్టడంలో స్వామి భక్తి ఉంది. ఆ స్వామి భక్తే ఇప్పుడు వైసీపీ కొంప ముంచుతోంది. జగన్‌ను సంతోష పెడుతున్నామని అనుకుంటున్నారే తప్ప.. పార్టీ కొంప మునుగుతుందని గుర్తించలేకపోతున్నారు. వాళ్ల భాషకు ఓ స్థాయి లేదు. వారికి ఓ నడవడి లేదు. నోటికి హద్దు లేదు. నియంత్రణ లేదు. నిబద్ధత అన్నది ఆశించడం కూడా తప్పే అనే అభిప్రాయానికి వచ్చేశారు జనం. వీళ్ల మాటలు అసహ్యం పుట్టిస్తున్నాయ్. ఇప్పటికైనా వైసీపీ గుర్తించాలి.. గుర్తించి మారాలి. లేదంటే.. 2024లో ఇంటికే !