Yogi Adityanath: యోగి… గూండాలకే గూండా…!

యోగి దృష్టిలో తప్పుచేసిన వారిని తక్షణమే శిక్షించడం తక్షణ న్యాయం. అందుకే యూపీలో అన్ని ఎన్‌కౌంటర్లు.. అన్ని జరగబట్టే జనం కాస్త బయటకు రాగలుగుతున్నారు. మొత్తంగా మాఫియా పాలిట అతిపెద్ద గూండారాజ్‌ యోగి ఆదిత్యనాథ్..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2023 | 07:49 AMLast Updated on: Apr 14, 2023 | 7:49 AM

Mitti Me Mila Dunga Remark Of Up Cm Trends As Atiqs Son Killed In Police Encounter

యోగి చెప్పాడంటే చేస్తాడంతే… చంపుతానంటే చంపేస్తాడంతే… ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా మారిపోయిన ఈ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి తాజాగా కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ కుమారుడు అసద్‌ను మట్టుబెట్టారు. కన్నీరంటే తెలియకుండా ఎందరినో దారుణంగా చంపిన అతీక్‌ అహ్మద్‌… కొడుకును తలుచుకుని కన్నీరు కార్చేలా చేశారు యోగి.

వారిని మట్టిలో కలిపేస్తా… ఇది నా మాట…మాజీ ఎమ్మెల్యే హత్య కేసులో ప్రత్యక్షసాక్షి ఉమేష్‌పాల్‌ హత్య తర్వాత యోగి చెప్పిన మాటలు… ఆ మాటలను నిలబెట్టుకున్నారు యోగి… ఆయన మాటే శాసనం.. మాట ఇస్తే తప్పడు…. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అతీక్‌ అహ్మద్‌ కుమారుడు అసద్‌ అహ్మద్‌ను 50రోజులు వెంటాడి వేటాడి తూటాలకు బలిపెట్టారు పోలీసులు. ఫిబ్రవరి 24న ఉమేష్‌పాల్‌ హత్య జరిగింది. అప్పటికే అతీక్‌ అహ్మద్‌, అతడి ఇద్దరి కుమారులు జైల్లో ఉన్నారు. అతీక్‌ మూడో కుమారుడు అసద్… ఈ హత్యకు ప్లాన్ చేశాడు. అమలు చేశాడు. ఆ వెంటనే పారిపోయాడు. అప్పట్నుంచి సాగిన వేట.. ఈ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. ఝాన్సీలో అసద్‌ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వేట మొదలుపెట్టారు. పోలీసులను గమనించిన అతను కాల్పులకు దిగాడు. ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. మొత్తం 42రౌండ్ల కాల్పులు జరిగాయి. ఎదురులేని రాజులా మీసాలు మెలేసి తిరిగిన అతీక్‌ అహ్మద్‌ కొడుకు చావు విషయం తెలిసి కుప్పకూలిపోయాడు. నిన్ను నేనే చంపుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినా చేసిన పాపం ఊరికే పోదు.

యోగి ఆదిత్యనాధ్ దెబ్బకు యూపీ క్రిమినల్స్ ఠారెత్తిపోతున్నారు. ఇప్పటికే యోగి హయాంలో ఎన్నడూ లేనన్ని ఎన్‌కౌంటర్లు జరిగాయి. 2017లో యోగి అధికారంలోకి వచ్చారు. అప్పటికి ఉత్తరప్రదేశ్ అరాచకాలకు అడ్డా… గ్యాంగ్ స్టర్లు, మాఫియాదే రాజ్యం.. పోలీసులంటే ఎవరికీ లెక్కలేదు.. నడిరోడ్డుపై పోలీసులు కూడా పట్టపగలు తిరగలేని రోజులు.. కానీ యోగి వచ్చాక సీన్ మారిపోయింది. ఖాకీలకు ఫ్రీహ్యాండ్ ఇచ్చారు. అప్పటిదాకా మన్నుతిన్న పాముల్లా పడి ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్… ఓ విక్రమార్కుడిలా చెలరేగిపోయారు. దొరికినవాడ్ని పట్టుకున్నారు. దొరకనివాడ్ని లేపేశారు.

ఈ ఆరేళ్లలో యూపీలో జరిగిన ఎన్‌కౌంటర్ల సంఖ్య సుమారు 10వేల 800… అంటే రోజుకు సగటున 5 ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇక ఈ ఆరేళ్లలో 190 మంది క్రిమినల్స్ ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి 11రోజులకో కరడుగట్టిన నేరస్థుడు పోలీసు తుపాకీకి బలైపోయాడు. ఇక పోలీసులు 23వేల మంది చిన్నా, పెద్దా నేరస్థులను అరెస్ట్ చేశారు. ఎన్నో నేరాలు, ఘోరాలకు దిగిన కరడు గట్టిన రాక్షసులు కూడా తూటాలకు దొరికిపోవడమో లేక రాష్ట్రం విడిచి పారిపోవడమో చేశారు. కొన్ని వందల మంది బతికుంటే బలుసాకు తినొచ్చంటూ ఊళ్లను, ఆస్తులను వదిలి పరారయ్యారు. నేను తప్పుచేశాను… నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దంటూ కొన్నిరోజుల క్రితం అతీక్‌ అహ్మద్‌ మీడియా ద్వారా పోలీసులను కోరాడు. కానీ చేసిన పాపం ఊరకపోదు… నేరానికి శిక్ష అనుభవించాల్సిందేనన్నారు యోగి. ఒక్క అతీక్‌ మాత్రమే కాదు చాలామంది గ్యాంగ్‌స్టర్లు యోగి దెబ్బకు బెంబేలెత్తిపోయారు.

సాధారణంగా మానవహక్కుల సంఘాలకో, ప్రజలకో భయపడి కొన్ని వ్యవహారాలను గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం అన్నీ బహిరంగంగానే జరుగుతాయి. ఎవరు ఏమనుకుంటున్నారన్నది యోగి పట్టించుకోరు. అది ఎన్‌కౌంటర్ అని అందరికీ తెలిసేలాగానే జరుగుతుంది. అసద్‌ది కూడా అలాంటి ఓ ఎన్‌కౌంటరే… ఇలాంటివాళ్లను పట్టుకుని జైల్లో పెట్టి రోజూ ముప్పొద్దులా మేపాలా అన్నది యోగి ప్రశ్న. పైగా తప్పు చేసిన వారు నేతలైనా, మాఫియా అయినా, గ్యాంగ్‌స్టర్ అయినా సరే వారి ఇళ్లపైకి బుల్‌డోజర్లు వెళతాయి. అలా వెళ్లడానికి వాటికేం అధికారం ఉంది అంటే సమాధానం రాదు. కానీ వాటి పనిమాత్రం అవి చేసుకుపోతాయి. అక్కడితో ఆ గ్యాంగ్‌స్టర్ దారికి రావాలి. లేకపోతే తూటా రుచి చూడక తప్పదు.

యోగి చేస్తున్నది తప్పా రైటా అంటే అదో పెద్ద చర్చకు దారి తీస్తుంది. నేరాలు, ఘోరాలతో అల్లాడిపోయిన వారికి అది రైట్… చట్టం, న్యాయం అనేవారికి అది రాంగ్. యోగి దృష్టిలో తప్పుచేసిన వారిని తక్షణమే శిక్షించడం తక్షణ న్యాయం. అందుకే యూపీలో అన్ని ఎన్‌కౌంటర్లు.. అన్ని జరగబట్టే జనం కాస్త బయటకు రాగలుగుతున్నారు. మొత్తంగా మాఫియా పాలిట అతిపెద్ద గూండారాజ్‌ యోగి ఆదిత్యనాథ్..