Kavitha – Sukesh: తెగించి కొట్లాడతామంటున్న కవిత..! సుఖేశ్ పై ఏం చేయబోతున్నారు?

కొంతమంది పనిగట్టుకుని కేసీఆర్ ను బద్నాం చేయడానికి ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. తెలంగాణ బిడ్డలం తలవంచబోమని.. తెగించి కొట్లాడతామని స్పష్టం చేశారు. ఎవరో ఆర్థిక నేరస్థుడు ఒక లేఖ రాస్తే దానిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని బట్టి చూస్తే దీని వెనుక ఎవరి కుట్ర ఉందో స్పష్టంగా అర్థమవుతోందన్నారు కవిత.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2023 | 04:08 PMLast Updated on: Apr 13, 2023 | 4:08 PM

Mlc Kavitha Reaction On Sukesh Chandrasekhar Letters

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆర్థిక నేరస్థుడు సుఖేశ్ చంద్రశేఖర్ కూడా కవితపై అనేక ఆరోపణలు చేశారు. అక్కా నెయ్యి డెలివర్ చేసేశా అంటూ కవితతో వాట్సాప్ చాట్ చేసినట్లు కొన్ని డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. ఆప్, టీఆర్ఎస్ నేతలతో కలిసి అనేక లావాదేవీలు చేసాననేది సుఖేశ్ చంద్రశేఖర్ చెప్తున్న మాట. అయితే సుఖేశ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు ఎమ్మెల్సీ కవిత.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ విచారణను ఎదుర్కోవడమే కవితకు సవాల్ గా మారింది. ఫోన్లను ఈడీకి అప్పగించిన కవిత.. మళ్లీ విచారణకు పిలుస్తుందేమోనని ఆతృతగా ఎదురు చూస్తోంది. ఇలాంటి సమయంలో ఆర్థిక నేరస్థుడు, జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలు విడుదల చేస్తుండడం, అందులో కవిత ప్రేమయం ఉందని చెప్పడం తీవ్ర సంచలనం కలిగించింది. సుఖేశ్ చంద్రశేఖర్ మొదటి లేఖలో ఆప్ అధినేత కేజ్రివాల్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆప్ నేతలు ఇచ్చిన 15 కోట్ల రూపాయలు హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్లో AP అనే వ్యక్తికి అందజేసినట్లు తెలిపారు.

అయితే తాజా లేఖలో ఏకంగా ఎమ్మెల్సీ కవితతో తాను చాట్ చేశానంటూ కొన్ని స్క్రీన్ షాట్లను రిలీజ్ చేశారు సుఖేశ్ చంద్రశేఖర్. ఆప్ నేతలు ఇవ్వాల్సిన నగదును అందజేసే క్రమంలో తాను కవితతో చాట్ చేశానని చెప్పుకొచ్చారు. ఆప్, బీఆర్ఎస్ నేతల మధ్య లావాదేవీలకు సంబంధించి తన దగ్గర ఇంకా చాలా సమాచారం ఉందని, వీటన్నిటిపైనా లోతుగా దర్యాప్తు చేయాలని సుశేఖ్ డిమాండ్ చేశారు. ఈ అంశంలో దర్యాప్తు సంస్థలకు సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నాడు. అయితే సుఖేశ్ లేఖల్లో వాస్తవం ఎంత అనేది ఇప్పటి వరకూ తేలలేదు. అందులో నిజాలున్నాయా… సుఖేశ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు.. లాంటివన్నీ చిక్కు ముడులే.

సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలపై కవిత స్పందించారు. అసలు సుఖేశ్ చంద్రశేఖర్ తో తనకు అసలు పరచయమే లేదన్నారామె. కొంతమంది పనిగట్టుకుని కేసీఆర్ ను బద్నాం చేయడానికి ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బిడ్డలం తలవంచబోమని.. తెగించి కొట్లాడతామని స్పష్టం చేశారు. ఎవరో ఆర్థిక నేరస్థుడు ఒక లేఖ రాస్తే దానిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని బట్టి చూస్తే దీని వెనుక ఎవరి కుట్ర ఉందో స్పష్టంగా అర్థమవుతోందన్నారు కవిత. మరి సుఖేశ్ చంద్రశేఖర్ ఇష్యూలో కవిత తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.