MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. మంగళవారం ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విచారించనున్న సుప్రీంకోర్టు..
లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు సంస్థలు.. వాటి కార్యాలయంలో విచారణ చేయకుండా.. నళిని చిదంబరం తరహా వెసలుబాటు తనకు కావాలని కోర్టును కోరింది.
MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారించనుంది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు సంస్థలు.. వాటి కార్యాలయంలో విచారణ చేయకుండా.. నళిని చిదంబరం తరహా వెసలుబాటు తనకు కావాలని కోర్టును కోరింది.
ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో మహిళలను విచారణ చేయకుండా చూడాలని కోరింది. కార్యాలయంలోకి పిలిచి విచారించడం సరికాదని కోర్టును ఆశ్రయించింది. అలాగే తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు కావాలని కోరింది. కవిత కోరిన వివిధ అంశాలపై మంగళవారం విచారణ జరుగుతుంది. మహిళల ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో పలువురు నేతలు గతంలో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ సెక్షన్ 160ని దర్యాప్తు సంస్థలు ఉల్లంఘిస్తున్నారని నళిని చిదంబరం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేశారు. దీని ప్రకారం ఈడీ, సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న మహిళలను ఇంటి వద్దే విచారించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్లపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు పది రోజుల గడవు కావాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. మరోవైపు ఇటీవలే ఈడీ విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
అయితే, తన విచారణపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున.. ఆ తీర్పును అనుసరించి మాత్రమే విచారణకు హాజరవుతానని కవిత ఈడీకి తెలిపింది. దీంతో కోర్టు ఇచ్చిన సూచనల్ని అనుసరించి, కవితకు ఇచ్చిన నోటీసుల్ని ఈడీ ఉపసంహరించుకుంది. ఈ అంశంపై తదపరి తీర్పును అనుసరించి కవితను ఈడీ విచారించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే పలువురిని ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.