తీన్మార్ మల్లన్న సస్పెండ్.. నెక్ట్స్ ఏంటి.. రచ్చ చేయడం ఖాయమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంచార్జిగా బాధ్యతలు తీసుకొని.. సర్వసభ్య సమావేశం నిర్వహించిన నెక్ట్స్ డేనే..

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంచార్జిగా బాధ్యతలు తీసుకొని.. సర్వసభ్య సమావేశం నిర్వహించిన నెక్ట్స్ డేనే.. మీనాక్షి నటరాజన్ తన మార్క్ చూపించారు. తన నిర్ణయాలు ఎలా ఉంటాయో.. ఎలా ఉండబోతున్నాయో.. ఒక్క నిర్ణయంతో చెప్పకనే చెప్పారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేయడం.. తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. గతంలోఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన మల్లన్న ఓడిపోయారు. కొంతకాలం బీజేపీలో పనిచేసి.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. ఎమ్మెల్సీగా విజయం సాధించారు.
ఐతే ఆయన వ్యవహరించే తీరు.. హస్తం పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. కులాల మధ్య చిచ్చురేపేలా ఇటీవల మల్లన్న చేసిన కామెంట్స్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయ్. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయ్. రెడ్డి సామాజికవర్గంపై మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డే చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని.. రెడ్ల పనైపోయిందంటూ… బీసీ సభ సాక్షిగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెడ్లే చిన్న వర్గాలను తొక్కేశారని.. ఇకపై రెడ్ల అంతు చూస్తామని.. రాబోయేది బీసీల రాజ్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటికి మించి కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనను.. పార్టీలోనే ఉండి మల్లన్న వ్యతిరేకించారు. అక్కడితో ఆగారా అంటే.. ఏకంగా సర్వే పత్రాలకు నిప్పు పెట్టారు. ఇది కాంగ్రెస్ పెద్దలకు కోపం తెప్పించింది.
ఆయనపై చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలే హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారు. దీంతో పీసీసీ క్రమశిక్షణ సంఘం మల్లన్నకు నోటీసులు ఇచ్చింది. విచారణ జరిపింది. ఆయన చేసిన కామెంట్స్ పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని భావించి మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి.. మల్లన్నను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. ఐతే ఇప్పుడు మల్లన్న ఏం చేయబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడడంతో.. మళ్లీ బీసీ కార్డును ఉపయోగించుకునే అవకాశం ఉంది. బీసీ వర్గానికి చెందిన నేతను కావడంతోనే.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మల్లన్న మరింత దూకుడు చూపించే అవకాశం ఉంది. మరి ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారా లేదా అన్నది కూడా ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే.. కాంగ్రెస్ ఖాతాలో ఓ సభ్యుడు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నిజానికి పార్టీ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా మల్లన్న వ్యవహార శైలి మార్చుకోలేదు. మరింత రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారు. బీసీలకోసం మాట్లాడితే నోటీసులు ఇస్తారా అని ఎదురు ప్రశ్నించారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేశారు. దీంతో మల్లన్న ఎలాంటి రచ్చ చేయబోతున్నాడో అనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
.