PM Modi: మోదీ మేనియా ముగిసిందా..? తొమ్మిదేళ్ల పాలన ఏం చెబుతోంది? రాబోయే సవాలుకు మోదీ సిద్ధమేనా?
ఈ తొమ్మిదేళ్లలో మోదీ పాలన ఎలా ఉంది? ప్రధానిగా ఆయన సాధించింది.. ఇంకా సాధించాల్సినవి ఏంటి? వచ్చే ఎన్నికల రూపంలో మోదీ అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కోబోతున్నారు. దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారు?
PM Modi: దేశ రాజకీయాల్లో, పాలనలో నరేంద్ర మోదీది ప్రత్యేక శకం. ప్రధానిగా దేశంపై ప్రత్యేక ముద్ర వేశారు. తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో విమర్శలు.. విజయాలు.. వైఫల్యాలు.. మూటగట్టుకున్నారు. గత ప్రధానులు ఎవరికీ దక్కనంత కీర్తి అందుకున్నారు. అదేస్థాయిలో విమర్శల్ని ఎదుర్కొన్నారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టి మంగళవారంతో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. 2014 మే, 26న మోదీ తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్లు విజయవంతంగా పాలన పూర్తి చేసుకున్న అనంతరం 2019 మే 30న మరోసారి పీఎం అయ్యారు. ఈ తొమ్మిదేళ్లలో మోదీ పాలన ఎలా ఉంది? ప్రధానిగా ఆయన సాధించింది.. ఇంకా సాధించాల్సినవి ఏంటి? వచ్చే ఎన్నికల రూపంలో మోదీ అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కోబోతున్నారు. దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారు?
రాజకీయ నేతగా, ప్రధానిగా మోదీ స్థాయిని మరొకరితో పోల్చలేం. ఆయన పేరే ఒక బ్రాండ్. మోదీ మేనియా.. మోదీ ఛరిష్మా.. మోదీ ఇమేజ్.. ఎలా చూసినా మోదీ స్థాయి గొప్పదే. దేశంలో ఎవరైనా ఆయన స్థాయి నేతలే. బీజేపీని రెండుసార్లు తన ఇమేజ్‌తోనే అధికారంలోకి తేగలిగారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల్ని ఓడించి, బీజేపీని గెలిపించగలిగారు. ఓటమే లేకుండా దూసుకెళ్లారు. పాలనలో తనదైన ముద్ర వేశారు. కొత్త చట్టాలకు రూపకల్పన చేశారు. దేశంలోనే కాదు.. మోదీ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. ప్రపంచంలో ఎక్కువ ప్రభావవంతమైన నేతగా మోదీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతర దేశాల అధ్యక్షులంగా మోదీ వెనకే నిలిచారంటే మోదీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు మోదీపై నిషేధం విధించిన అమెరికా.. మోదీ ప్రధాని అయ్యాక ఆయనకు ఘన స్వాగతం పలికింది. వ్యక్తిగతంగా మోదీ ఇమేజ్ ఆకాశాన్ని తాకిందనడంలో అతిశయోక్తి కాదు.
మోదీ బలమైన ప్రధాని. ఏ విషయంలోనైనా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగల సత్తా ఉంది. బీజేపీకి ఆ బలం ఉంది. అందుకే మోదీ తనదైన నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారు. 2016లో నోట్ల రద్దు మోదీ తీసుకున్న సంచలన నిర్ణయం. దీని ఫలితాలు ఎలా ఉన్నా అప్పట్లో సామాన్య జనం మాత్రం ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. జీఎస్టీ అమలు, కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, జన్ ధన్ ఖాతా వంటి కీలక నిర్ణయాలతోపాటు స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి పథకాల ద్వారా దేశాభివృద్ధికి పాటుపడ్డారు. అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని పెంచడంలో సఫలీకృతమయ్యారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ అక్కడి తీవ్రవాదుల్ని అంతమొందించి వచ్చింది సైన్యం. ఈ ఘనత తమదే అని చెప్పుకొంది మోదీ ప్రభుత్వం. తాజాగా రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
హామీల అమలులో విఫలం
మోదీ ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారు. తనను గెలిపిస్తే స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న లక్షల కోట్ల నల్ల ధనాన్ని ఇండియా తెప్పిస్తానని మోదీ హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక దీని ఊసే ఎత్తలేదు. ఇక ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామనే హామీ కూడా ఇచ్చారు. ఇది నమ్మిన నిరుద్యోగ యువతను మోదీ నిలువునా మోసం చేశారు. కేంద్ర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు పరిమితంగానే వెలువడుతున్నాయి. వీటితోపాటు 100 స్మార్ట్ సిటీల నిర్మాణం, బుల్లెట్ రైళ్లు, పేదలందరికీ పక్కా ఇళ్లు, ప్రతి కుటుంబానికి 24 గంటల కరెంట్, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం వంటి అనేక హామీలిచ్చారు మోదీ. అలాగే దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్నారు. కానీ, వీటిని నెరవేర్చడంలో విఫలమయ్యారు.
వెంటాడుతున్న సమస్యలు
దేశాన్ని ఇంకా అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. పాక్, చైనాలతో సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశం అలాగే ఉండిపోయింది. దేశ అప్పులు భారీగా పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. జీడీపీ తగ్గుతోంది. 2020లో వచ్చిన కరోనా దేశాన్ని కూడా అతలాకుతలం చేసింది. జనాలు రోడ్లపై నడుచుకుంటూ వందల కిలోమీటర్లు కాలి నడకన వెళ్లే దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. ఈ సమయంలో ప్రజల్ని మోదీ గాలికొదిలేశారనే విమర్శల్ని ఎదుర్కొన్నారు. దేశంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ, పరిశ్రమల్ని రప్పిస్తున్నా నిరుద్యోగం మాత్రం తగ్గడం లేదు. నిరుద్యోగ సమస్య దేశానికి ప్రధాన సమస్యగా మారింది. ఈ అంశంపై మోదీ సరిగ్గా దృష్టి పెట్టలేదనే చెప్పాలి.
దేశ ప్రతిష్ట పెంచిన మోదీ
కొన్ని విషయాల్లో మోదీ దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా నిలబెట్టారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో దేశీయంగా తయారైన వ్యాక్సిన్లను అనేక దేశాలకు సరఫరా చేయడం ద్వారా మోదీ దేశానికి గౌరవం తెచ్చిపెట్టారు. అంతర్జాతీయ సమాజ మనుగడలో భారత పాత్ర ఎంత కీలకమో చాటి చెప్పారు. అనేక దేశాలతో సన్నిహితంగా ఉంటూ, ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై వివిధ అంశాల్లో భారత వైఖరిని నిర్భయంగా చాటి చెప్పారు. రష్యా-యుక్రెయిన్ యుద్ధ సమయంలో తటస్థంగా ఉన్నారు. యుక్రెయిన్‌కు ఆర్థిక సాయం చేశారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, నేపాల్, టర్కీలో భూకంపం సందర్భంగా భారత్ అందించిన సాయం అందరి ప్రశంసలూ అందుకుంది. ఇలాంటి అనేక అంతర్జాతీయ అంశాల్లో దేశ ప్రతిష్టను పెంచారు.
కలిసొచ్చిన వ్యాపార అంశాలు
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో మోదీ సఫలమయ్యారు. విదేశీ పరిశ్రమల్ని ఆకర్షించారు. దేశంలో పరిశ్రమల్ని ప్రోత్సహించారు. అనేక అంతర్జాతీయ సంస్థలు ఇండియాలో తమ కంపెనీలు పెడుతున్నాయి. దేశ పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందుతోంది. రక్షణ రంగంలోనూ సొంత తయారీకి ప్రాధాన్యమిస్తున్నారు. దేశీయంగానే ఆయుధాలు, హెలికాప్టర్లు నిర్మిస్తున్నారు. వందేభారత్ వంటి రైళ్లను ఇండియాలోనే తయారు చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇండియాలోనే తయారు చేయడం కలిసొచ్చింది. నిర్మాణ రంగం పుంజుకుంది. మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారు. రోడ్ల నిర్మాణం, రైల్వే లైన్ల ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్మాణం వంటివి చేపడుతున్నారు. 5జీ వంటి సాంకేతికాభివృద్ధికి, శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాల్ని ప్రోత్సహిస్తున్నారు.
సంక్షేమం నిల్!
మోదీ హయాంలో ప్రజల సంక్షేమాన్ని విస్మరించారనే విమర్శ ఉంది. ప్రజలకు ఉపయోగపడే పథకాల్ని రూపొందించడం లేదు. అందులోనూ పౌరులకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయుష్మాన్ భారత్ మినహా వైద్య, వైద్య రంగాలను పట్టించుకోలేదు. గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పనికి ఆహార పథకాన్ని కూడా మోదీ నీరుగార్చారు. పెట్రో, వంట గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులపై తీవ్ర భారం మోపుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల ధరలు తగ్గినా.. దేశీయంగా పెట్రో ధరల్ని మాత్రం కేంద్రం తగ్గించలేదు. నిజానికి కేంద్రానికి చాలా పథకాలు ప్రకటనల్లో ఉన్నప్పటికీ వాటి అమలు తీరులో లోపం ఉంది. ఏ పథకం అమలవుతోందో కూడా సామాన్యులకు తెలియని పరిస్థితి. దీంతో చాలా పథకాలున్నా లబ్ధిదారులకు అందడం లేదు.
వ్యాపారుల కోసమే మోదీ?
మోదీ ఎదుర్కొంటున్న పెద్ద విమర్శ.. అంబానీ, అదానీలకు దేశ సంపద దోచి పెడుతున్నాడని. ఈ విమర్శలకు అనుగుణంగానే మోదీ నిర్ణయాలు ఉంటూ వచ్చాయి. దేశంలోని ఎయిర్‌పోర్టులు, ఓడ రేవుల నిర్మాణం, నిర్వహణ, రోడ్ల నిర్మాణం, విద్యుత్ రంగాలు వంటి అన్నింటినీ మోదీ.. అంబానీ, అదానీలకే కేటాయిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా మోదీ విక్రయిస్తున్నారు. ఎల్ఐసీ వంటి కేంద్ర సంస్థను అదానీ చేతిలో పెట్టడమే ఇందుకు నిదర్శనం. లాభాల్లో ఉన్న కేంద్ర సంస్థలను కావాలని నష్టాల బాట పట్టించి, ఆ పేరుతో వాటిని తనకు అనుకూలమైన వ్యాపారవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అంబానీ, అదానీలతో మోదీకి సంబంధాలున్నాయని విమర్శలు చేస్తుంటాయి. సామాన్య ప్రజల కోసం కాకుండా.. బడా వ్యాపారుల కోసమే మోదీ పని చేస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి.
వ్యవసాయ చట్టాలతో ఇమేజ్ డ్యామేజ్
మోదీ ఇమేజ్ డ్యామేజ్ చేసిన అతిపెద్ద నిర్ణయం.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు. వీటిని దేశంలోని రైతులు, ప్రతిపక్షాలు.. ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా మోదీ వాటిని అమలు చేసేందుకే ప్రయత్నించారు. ఈ నల్ల చట్టాల్ని రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. అంబానీ, అదానీ కోసమే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని రైతు సంఘాలు మండిపడ్డాయి. ఈ విషయంలో కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులపై బీజేపీకి చెందిన ఎంపీ తనయుడు జీప్ ఎక్కించి, చంపిన ఘటన సంచలనం సృష్టించింది. రైతుల జీవితాలతో మోదీ ఆడుకున్నారనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రభుత్వం ఎంతగా బెదిరించినా రైతులు బెదరలేదు. ఈ చట్టాలు రద్దు చేయాల్సిందే అంటూ పట్టుబట్టారు. చివరకు మోదీ దిగిరాక తప్పలేదు. రైతులకు క్షమాపణలు చెప్పిన మోదీ.. వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇది మోదీ రాజకీయ జీవితంలో ఒక మాయని మచ్చగానే మిగిలిపోతుంది.
పెరిగిన బీజేపీ ఇమేజ్
మోదీ రాకతో బీజేపీలో జోష్ వచ్చింది. దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరించింది. దక్షిణాది రాష్ట్రాల్లో మినహా అన్ని చోట్లా మోదీ, బీజేపీ హవా కొనసాగింది. తొమ్మిదేళ్లలో బలమైన పార్టీగా ఎదిగింది. జాతీయ రాజకీయాల్లో అతిపెద్ద, కీలకమైన పార్టీగా మారింది. పార్టీ క్యాడర్‌తో ఉత్సాహం పెరిగింది. బీజేపీ, హిందూ భావజాలాన్ని విస్తరించడంలో మోదీ సఫలమయ్యారు. బీజేపీ హిందూత్వ సిద్ధాంతాన్ని మోదీ జనంలోకి తీసుకెళ్లగలిగినా.. అదే ఆయనపై విమర్శలకు కారణమైంది. మోదీ హయాంలో మత ఘర్షణలు పెరిగిన మాట వాస్తవం. ముస్లింపై దేశంలో దాడులు పెరిగినట్లు ఆరోపణలున్నాయి. హిజాబ్ అంశం, తలాక్ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి వంటివి బీజేపీని మతతత్వ పార్టీగా ముద్ర వేశాయి.
మరోవైపు ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా.. మోదీ క్రేజ్ మాత్రం పెరిగింది. మోదీ పేరుతోనే గత ఎన్నికల్లో పార్టీ గెలవగలిగిందంటే ఆయన ఏ స్థాయిలో విజయవంతమయ్యారో అర్థం చేసుకోవచ్చు. అయితే, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల ద్వారా మోదీ అతిపెద్ద సవాలును ఎదుర్కోబోతున్నారు. దీంతో ఈసారి మోదీ మరింతగా శ్రమించాల్సి ఉంది. గతంతో పోలిస్తే మోదీ హవా కాస్త తగ్గినట్లు అనిపించినా.. ఆయన ఇమేజ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరోవైపు మోదీకి అమిత్ షా తోడుగా, పార్టీ వ్యూహకర్తలు సరైన ప్రణాళికతో వెళ్తే మోదీ విజయాన్ని అడ్డుకోవడం అసాధ్యం. ఈ దశలో మోదీ మరింత కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. బలపడుతున్న కాంగ్రెస్‌కు అడ్డుకట్ట వేయాలి. ప్రతిపక్షాలు ఏకం కాకుండా చూడాలి. హిందూత్వ, జాతీయవాదం వంటి అంశాల్ని బలంగా జనంలోకి తీసుకెళ్లాలి. ఇటీవలే కర్ణాటక ఫలితాలతో మోదీకి గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం మోదీ గట్టిగానే పోరాడాల్సి ఉంటుంది.