PM MODI: వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. పార్లమెంట్ సమావేశాల రహస్యం అదేనా..?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ (జమిలి ఎన్నికలు) కోసమే ఐదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
PM MODI:సెప్టెంబర్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఉన్నట్లుండి ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణాలు ఏమై ఉంటాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ (జమిలి ఎన్నికలు) కోసమే ఐదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
దేశంలో మోదీ ప్రభుత్వం అనేక సంకరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు, యునిఫాం సివిల్ కోడ్ వంటి సంస్కరణలకు తెరతీసిన బీజేపీ ఇప్పుడు ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు అనే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇది ఇప్పటిమాట కాదు. చాలా కాలం నుంచి మోదీ ప్రభుత్వం దీనికోసం ప్రయత్నిస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగాలనేది మోదీ ప్రభుత్వ ఆలోచన. దీనివల్ల భారీగా ఆదాయం మిగులుతుందని, సమయం కలిసొస్తుందని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై లా కమిషన్ కూడా అధ్యయనం చేసింది.
వచ్చే ఏడాది పార్లమెంట్‌కు ఎన్నికలు జరగాలి. ఈ లోపు ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి, పార్లమెంట్ ఎన్నికలతోపాటు నిర్వహించాలనేది మోదీ ఆలోచన అని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇది సాధ్యమవుతుందా.. లేదా.. అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ ఎన్నికలకు అనుగుణంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే యోచన ఉంది. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీకి తగిన మెజారిటీ ఉంది. అన్ని బిల్లులను ఆమోదించుకునే సంఖ్యా బలం బీజేపీకి ఉంది. దీనికి ఎన్డీయేతర పక్షాలైన వైసీపీ, బీజేడీ వంటి పార్టీలు మద్దతివ్వాలి. అయితే, ఐదు రాష్ట్రాలతోపాటే పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోందా.. లేక అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటోందా అన్నిది కూడా తెలియాలి.
నిజానికి రాబోయే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి బీజేపీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అటు పార్లమెంటుకు, ఇటు అసెంబ్లీకి దేశ ప్రజలు ఒకే సారి ఓటేస్తారు. దీనివల్ల దేశంలో ఎన్నికల హడావిడి కూడా తప్పుతుంది. న్యాయ నిపుణులు, ఇతర పార్టీల నుంచి దీనికి ఏ మేరకు అంగీకరిస్తాయో చూడాలి. జమిలి ఎన్నికలు ఆలోచన మంచిదే అయినా.. ఇప్పుడప్పుడే సాధ్యం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ ప్రక్రియను బీజేపీ ప్రారంభించాలని భావిస్తే అన్ని పార్టీల మద్దతు కూడగట్టి, ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ పార్టీలతో అనేక సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది.