Top story: మహాలో వికసించిన కమలం జార్ఖండ్ లో ఎందుకు వాడిందో? జార్ఖండ్ లో పనిచేయని మోడీ మేజిక్
ఆదివాసీ కోటలో జేఎంఎం కూటమికి విజయానికి కారణాలు ఏంటి ? కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా...నామమాత్రపు పాత్రేనా ? ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేయడమే...బీజేపీ కొంపముంచిందా ?
ఆదివాసీ కోటలో జేఎంఎం కూటమికి విజయానికి కారణాలు ఏంటి ? కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా…నామమాత్రపు పాత్రేనా ? ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేయడమే…బీజేపీ కొంపముంచిందా ? జేఎంఎం ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించడం…ఆ పార్టీ నేతలను పార్టీలోకి చేర్చుకోవడమే…జార్ఖండ్ ముక్తి మోర్చాకు అనుకూలంగా మారిందా ? హేమంత్ సోరెన్, జేఎంఎస్ నేతలపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా…కాషాయ కూటమికి కలిసి రాలేదా ? మాజీ సీఎం చంపయ్ సోరెన్…బీజేపీకి ప్లస్ అయిందా ? మైనస్ అయిందా ?
జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి…తిరుగులేని విజయం సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కూటమి…50కి పైగా సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజకీయ అస్థిరతకు కేరాఫ్‌గా నిలిచిన జార్ఖండ్‌లో…జేఎంఎం కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్…మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమైపోయింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను…బీజేపీ ముప్పుతిప్పలు పెట్టింది. మనీ లాండరింగ్ కేసు పెట్టి…హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపింది. ఈడీ కేసులో హేమంత్… విచారణ నుంచి అరెస్టు దాకా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హేమంత్ జైలుకు వెళ్లి రావడంతో…బీజేపీ దాన్నే ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా వాడుకుంది. ఎక్కడ సభ నిర్వహించినా…ప్రధాన మంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా నుంచి…ఇతర బీజేపీ నేతలు జేఎంఎం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు. హేమంత్ సోరెన్ అవినీతి ముఖ్యమంత్రి అని…బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతిస్తోందని ఆరోపణాస్త్రాలు సంధించింది. అయినప్పటికీ బీజేపీ మేజిక్ పని చేయలేదు.
జార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్ అంచనాలు మరోసాయి ఫెయిల్ అయ్యాయి. సర్వేలు ఇచ్చిన ఫిగర్లన్నీ తలకిందులు అయ్యాయి. అందరూ బీజేపీ కూటమి విజయం తథ్యమని సర్వేలు తేలిస్తే…జేఎంఎం కూటమి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. బంటీ ఔర్ బబ్లీగా పేరొందిన హేమంత్-కల్పనాల జోడీ సూపర్ హిట్ కొట్టింది. హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లిన తర్వాత…కల్పనా సోరెన్ సీఎం బాధ్యతలు చేపడతారన్న ప్రచారం జరిగింది. అయితే పార్టీ సీనియర్ నేత చంపాయీ సోరెన్ కుర్చీలో కూర్చోబెట్టారు. భర్త జైలులో ఉన్నంతకాలం కల్పనా సోరెన్…పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూనే…కార్యకర్తలను, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేశారు. శ్రేణులు, కార్యకర్తలకు అన్ని వేళల్లో అండగా నిలిచారు. దీంతో స్వల్పకాలంలోనే కల్పనా సోరెన్ పేరు మార్మోగిపోయింది. జార్ఖండ్ ముక్తి మోర్చాలో…హేమంత్ తర్వాతి స్థానం ఆమెదే అన్నట్లు వ్యవహరించారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల కావడంతో…చంపయీ సోరెన్‌ను సీఎం పదవి నుంచి తప్పించారు. మళ్లీ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆగ్రహించిన మాజీ సీఎం చంపయీ సోరెన్…కమలం గూటికి చేరిపోయారు.
రాష్ట్రంలో 28 స్థానాలు ఎస్టీలు, తొమ్మిది ఎస్సీ రిజర్వుడ్ స్థానాలుండటం…జేఎంఎం కూటమికి బాగా కలిసొచ్చింది. ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఆశించిన మేర ఫలితాలు సాధించనప్పటికీ జేఎంఎం మాత్రం మెరుగైన ఫలితాలు సాధించింది. దీనికి తోడు హేమంత్ సోరెన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడంలో…సంక్షేమ పథకాలు, ఆదివాసీ సెంటిమెంటు…ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించాయి. ఎన్నికల్లో హేమంత్ సోరెన్ అరెస్టును…జేఎంఎం ప్రధాన అస్త్రంగా వాడుకుంది. రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారంటూ కూటమి నేతలు ప్రచారం చేయడం కలిసి వచ్చింది. ఆదివాసీలందర్నీ తమవైపు తిప్పుకోవడమే కాకుండా… ముఖ్యమంత్రి మైయా సమ్మాన్ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. మహిళలకు నెలకు ఇస్తున్న వెయ్యిని…రూ.2500లకు పెంచుతామని హామీ ఇవ్వడం ప్లస్ అయింది.
హేమంత్ వదిన సీతా సోరెన్ కూడా కాషాయ గూటికి చేరిపోయారు. దీంతో అందరూ జేఎంఎం కథ…ఇక కంచికే అని భావించారు. బీజేపీ విజయం నల్లేరు మీద నడకేనని భావించారు. ఒకవైపు హేమంత్ సోరెన్..మరోవైపు కల్పనా సోరెన్ వరుస సభలతో హోరెత్తించారు. గండేయ్ నుంచి పోటీ చేసిన కల్పనా…తిరుగులేని మెజార్టీ తో గెలుపొంది… అసెంబ్లీలో అడుగుపెట్టారు. బంటీ ఔర్ బబ్లీగా పేరొందిన వీరిద్దరి జోడీ రాష్ట్ర రాజకీయాల్లో ఆకర్షణగా నిలిచింది. భార్యభర్తలిద్దరూ…తొలిసారి జార్ఖండ్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.