Talasani Srinivasa Yadav : బీఆర్‌ఎస్, బీజేపీ వార్‌లో బంట్రోతు పని..! ఎంత కష్టం వచ్చిందయ్యా తలసాని నీకు..!!
ప్రధాని తెలంగాణకు వచ్చిన ప్రతీసారి.. ఆహ్వానం పలికేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదు. తన తరఫున తనవాళ్లను పంపుతున్నారు. తనవాళ్లు అనుకుంటే మళ్లీ కేటీఆర్, హరీష్ కాదు.. ప్రధానికి ఆహ్వాన కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి ప్రతీసారి కనిపిస్తున్న తల.. మంత్రి తలసానిదే ! ప్రధాని రాష్ట్రానికి వస్తే.. ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు స్వాగతం పలకాలి.. అది ప్రొటోకాల్. ఐతే ఆ ప్రతీసారి తలసాని కావడమే ఇక్కడ హాట్‌టాపిక్ అవుతోంది.

Modi talasani srinivas
బీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయ్. ప్రధానిని పర్సనల్‌గానే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు కేసీఆర్. దీంతో మోదీని కలవడం కూడా ఇష్టం లేదు అన్నట్లుగా కనిపిస్తోంది ఆయన తీరు ! అలా అని ప్రధాని వచ్చినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలకకుండా ఉండలేని పరిస్థితి. ఒకే తల ప్రతీసారి కనిపిస్తోంది.. అదే తలసాని ! పాపం.. పైలెట్ డ్యూటీ అయిపోయింది తలసానిది! వెళ్తే వెళ్లారు ఏంటి సమస్య అనుకోవడానికి లేదు. అక్కడికి వెళ్లి ఆయన ఏం చేయరు.. వాళ్లు చేయనివ్వరు.. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏమీ చేయకూడదు. రెండు చేతులు వెనక్కి మలుచుకొని.. రాని నవ్వు మొహానికి అద్దుకొని.. అలా చూస్తూ ఉండడం తప్ప.. తలసాని చేసేదేమీ ఉండదు. పాపం.. బంట్రోతు పని అయిపోయింది తలసానిది అని జాలిపడుతున్నారు చాలామంది జనం. ఇప్పుడే కాదు… మోదీకి ఆహ్వానం పలికేందుకు వెళ్లిన ప్రతీసారి తలసానికి ఇలానే జరిగింది. ఎవరూ ఆయనను పట్టించుకోరు. పక్కకి నెట్టేస్తారు. తలసాని మాత్రం పాపం.. అలానే నిలబడి చూస్తూ ఉంటారు అమాయకంగా ! ఇప్పుడు అదే జరిగింది.. గతంలో రెండుసార్లు కూడా అదే జరిగింది. ఇంత జరిగినా.. ఓ మాట గట్టిగా అందాం.. ఓ నవ్వు మనస్ఫూర్తిగా నవ్వుదాం.. ఓ చప్పట్లు బలంగా కొడదాం అంటే అదీ లేకపాయె !
ప్రధాని వందే భారత్ రైలు ప్రారంభోత్సవంలో తలసానిని చూస్తే అదే అర్థం అవుతుంది. ట్రైన్ ప్రారంభించగానే.. గవర్నర్, కిషన్ రెడ్డి చప్పట్లు కొడితే.. తలసాని మాత్రం ఎవరో కట్టేసినట్లు చేతులు వెనక్కి కట్టుకొని నిల్చుకున్నారు. దీనికి కారణం ఉందండోయ్ అనేది జనాల నుంచి వినిపిస్తున్న మాట. బీఆర్ఎస్, బీజేపీ మధ్య వైరం దాటి.. శత్రుత్వం వరకు వెళ్లినట్లు కనిపిస్తోంది సీన్ ! అలాంటిది మోదీ ప్రారంభించిన రైలుకు చప్పట్లు కొడితే కేసీఆర్‌కు కోపం.. అలా అని కొట్టకపోతే మోదీకి కోపం. ఎందుకంటే మోదీ అన్ని గమనిస్తుంటారు మరి ! ఇలా బీజేపీ, బీఆర్ఎస్ యుద్ధంతో.. తలసాని పని బంట్రోతులా తయారైంది. నలిగిపోతున్నాడు బిడ్డా పాపం అంటూ.. మరికొందరు సెటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో !