Telangana: నేనున్న దూసుకుపో.. అసలు తగ్గకు.. బండి సంజయ్‌కి మోదీ ఏం చెప్పారు ?

రోజుకో మలుపు అన్నట్లుగా కనిపిస్తోంది తెలంగాణ రాజకీయం. ఎలక్షన్ ఇయర్‌లోకి ఎంటర్ కావడంతో.. రాజకీయంగా ప్రతీ విషయం వివాదమే అవుతోంది. ప్రతీ అంశం ఆయుధంగా మారుతోంది. కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య.. మాటలు తూటాలకు మించి పేలుతున్నాయ్. వీటికితోడు వరుసగా వెలుగుచూస్తున్న కాంట్రవర్సీలు.. రాజకీయాన్ని మరింత రగుల్చుతున్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 9, 2023 | 03:54 PMLast Updated on: Apr 09, 2023 | 3:54 PM

Modi With Bandi Sanjai

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ వ్యవహారం, టీఎస్పీఎస్పీ పేపర్‌ లీకేజీలో బీఆర్ఎస్‌ను కార్నర్ చేస్తూ బీజేపీ వ్యూహాలు రచిస్తుంటే.. టెన్త్‌ హిందీ పేపర్‌ లీకేజీకి సంబంధించి బండి సంజయ్‌ను టార్గెట్‌ చేస్తోంది బీఆర్ఎస్‌. బండిని అరెస్ట్ చేయడం.. వ్యవహారం కోర్టుకెక్కడం.. ఆతర్వాత బెయిల్ దక్కడం.. జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిణామాల మధ్య ప్రధాని మోదీ.. తెలంగాణకు వచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

కేసీఆర్‌ కుటుంబపాలనపై విమర్శలు గుప్పించారు. ఇది కాదు అసలు మ్యాటర్.. బేగంపేటలో ఫ్లైట్ దిగుతూనే.. బండి సంజయ్‌ను మోదీ పలకరించిన తీరు.. ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. మోదీకి స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్‌, బీజేపీ నేతలు తరలివచ్చారు. అందరికీ నమస్కారం చెప్పిన మోదీ.. బండి సంజయ్ దగ్గరరకు చేరుకున్న సమయంలో ఆయనను ప్రత్యేకంగా పలకరించారు. ఆ సమయంలో బండి సంజయ్ చేతులు జోడించి నమస్కారం తెలుపగా.. ప్రధాని మోదీ ఆయన చేతులను పట్టుకుని చిరునవ్వు చిందించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా నవ్వుతూ కనిపించారు.

బండి సంజయ్ అరెస్ట్ అంశం తీవ్ర సంచలనంగా మారిన వేళ.. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. బండి సంజయ్ అరెస్ట్‌పై కేంద్ర అధినాయకత్వం దృష్టిసారించింది. సంజయ్ అరెస్టుకు దారితీసిన పరిణామాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా‌లు వివరాలు సేకరించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోదీ.. బండి సంజయ్‌ తనకు నమస్కారం పెట్టిన సమయంలో ఆయనకు ధైర్యం చెప్పేలా ప్రత్యేకంగా పలకరించినట్లు తెలుస్తోంది. ఏం జరిగినా తానున్నానని.. ప్రత్యర్థిపై పోరాటం ఆపకూడదని సంజయ్‌కి సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు తెలంగాణ బీజేపీలో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అయింది. బీఆర్ఎస్ మీద యుద్ధం మరింత తీవ్రం చేస్తామని కమలం పార్టీ నేతలు అంటున్నారు.