ఏపీ రాజకీయాల్లో లేకపోయినా సరే మెగాస్టార్ చిరంజీవి గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ పొలిటికల్ గా హల్చల్ చేస్తూనే ఉంటుంది. ప్రధానంగా ఆయనను రాజ్యసభకు పంపిస్తారు అనే వార్తలు నాలుగు ఐదేళ్లుగా వస్తూనే ఉన్నాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఘోర ఓటమిని చవిచూసిన చిరంజీవి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం ఆయనకు అప్పటి కాంగ్రెస్ పెద్దలు రాజ్యసభ సీట్ ఇచ్చారు. అలాగే కేంద్రమంత్రిని కూడా చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు రాజకీయాల్లో ఎక్కువగా కనపడిన చిరంజీవి ఆ తర్వాత మళ్లీ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల పేరుతో చిరంజీవి భారీగానే ప్రాజెక్టులకు సైన్ చేస్తూ వెళుతున్నారు. ఇదే టైంలో పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ రాజ్యసభలో అడుగు పెట్టాలని చిరంజీవి ఆసక్తి కనబరుస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవికి ప్రస్తుతం సభ్యత్వం ఉంది. ఆ పార్టీకి ఇంకా చిరంజీవి రాజీనామా చేయలేదు. కానీ బీజేపీ పెద్దలతో మాత్రం గట్టిగానే స్నేహం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద చిరంజీవి పై మంచి ఇంప్రెషన్ ఉంది. దీనితో మోడీ కూడా చిరంజీవిని బిజెపిలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో చిరంజీవి... ముఖ్యమంత్రి అలాగే మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ కూడా విచ్చేశారు. ఆ వేదికపై చిరంజీవితో ఎంతో మమేకంగా ఆప్యాయంగా మాట్లాడారు ప్రధాన మంత్రి మోడీ. ఇక తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిరంజీవికి ఎక్కువగా ప్రాధాన్యతిస్తూ కనిపించారు. ఎంతోమంది ప్రముఖులు హాజరైన సంక్రాంతి వేడుకలకు చిరంజీవిని కూడా ఆహ్వానించగా వారందరిలో ఒక్కడిగా కాకుండా చిరంజీవిని ఎక్కువగా మోడీ పక్కనే పెట్టుకున్నారు. దీనితో ఇక చిరంజీవి కూడా తన మనసులో మాట ప్రధానమంత్రి మోడీ వద్ద బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. తనకు రాజ్యసభ పై ఆసక్తి ఉందని మోడీ వద్ద చిరంజీవి చెప్పగా దానికి మోడీ కూడా వెంటనే సానుకూలత వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. అలాగే ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. చిరంజీవిని దాదాపుగా రాష్ట్రపతి కోటాలోనే రాజ్యసభకు పంపే అవకాశం ఉంది అనే ప్రచారం ఊపు అందుకుంది. పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఢిల్లీ వెళ్ళిన సమయంలో ఇదే అంశానికి సంబంధించి కేంద్ర పెద్దల వద్ద ప్రతిపాదన పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కోసమే ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను పవన్ కళ్యాణ్ వదులుకున్నారని వార్తలు కూడా ఉన్నాయి. చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి పొలిటికల్ గా మంచి వెయిట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అది బలం చేకూర్చే అవకాశం ఉండవచ్చు అని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. చిరంజీవికి రాజ్యసభ ఇస్తే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీకి కచ్చితంగా కాపు ఓటు బ్యాంక్ కలిసి వచ్చే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా బిజెపితో దగ్గరగా ఉండటం కూటమిలో ఉండటంతో ఇబ్బందులు ఉండవు అనే భావనలో బిజెపి పెద్దలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న బీజేపీ పెద్దలు చిరంజీవిని దారిలోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా అది తెలంగాణలో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కర్ణాటకలో పట్టు కోల్పోయిన తర్వాత తెలంగాణపై ఎక్కువగా బీజేపీ పెద్దలు దృష్టి సారించారు. మేలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ మార్పుల్లో భాగంగా చిరంజీవిని తీసుకునే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.[embed]https://www.youtube.com/watch?v=V0c8r177wWc[/embed]