parliament: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. వాడివేడిగా సాగనున్న చర్చ
ఈ సమావేశాల్లో 31 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మణిపూర్ హింస, ఢిల్లీ ఆర్డినెన్స్, యూసీసీ బిల్లుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గత సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడబోతున్నాయి.
parliament: గురువారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఆగష్టు 11 వరకు, 17 రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. ఇటీవలే ప్రతిపక్షాలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఐక్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతుండగా, ధీటుగా బదులిచ్చేందుకు ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు నిర్వహించే అఖిలపక్ష భేటీ బుధవారం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.
ఈ సమావేశాల్లో 31 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మణిపూర్ హింస, ఢిల్లీ ఆర్డినెన్స్, యూసీసీ బిల్లుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గత సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడబోతున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్ హింస, గవర్నర్ వ్యవస్థ, ఢిల్లీ ఆర్డినెన్స్, కులగణన, మహిళా రిజర్వేషన్ బిల్లు, బాలాసోర్ రైలు ప్రమాదం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చలు జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ముఖ్యంగా మణిపూర్ హింస, యూసీసీ బిల్లుపై హాట్ హాట్‌గా చర్చ జరగొచ్చు. మణిపూర్ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, ప్రభుత్వం అంగీకరించింది.
ఒడిశాకు ప్రత్యేక హోదా అంశంపై చర్చించాలని బీజేడీ డిమాండ్ చేసింది. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మణిపూర్‌లో శాంతి నెలకొనేందుకు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అటవీ సంరక్షణ సవరణ చట్టం, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, బయో డైవర్సిటీ బిల్లును వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ తెలిపింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే, ప్రధాని మాత్రం ఆ దేశానికి క్లీన్ చిట్ ఇస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని బీఆర్ఎస్, వైసీపీలు కేంద్రాన్ని కోరాయి.అయితే, ప్రతిపక్షాలు అడిగే ప్రతి అంశంపై చర్చిస్తామని బీజేపీ తెలిపింది. త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాల్ని ప్రభుత్వ, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.