Motkupalli Narasimhulu: కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి..? డీకే శివకుమార్‌తో భేటీ..!
ప్రస్తుతం బెంగళూరులో ఉన్న తాను.. హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం మోత్కుపల్లి బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. అయితే, ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.
Motkupalli Narasimhulu: తెలంగాణ సీనియర్ పొలిటీషియన్ మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. కర్ణాటక, బెంగళూరులో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివ కుమార్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందిందని, ఈ విషయంపై చర్చలు జరిగాయని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న తాను.. హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం మోత్కుపల్లి బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. అయితే, ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.
తెలంగాణలో మోత్కుపల్లి సీనియర్ రాజకీయ నాయకుడు. 1983 నుంచి ఇప్పటివరకు మొత్తంగా ఆరుసార్లు ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఆయనది. టీడీపీతోపాటు, కాంగ్రెస్ నుంచి కూడా గెలుపొందారు. అయితే, 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్‌లో చేరారు. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తాననే కేసీఆర్ హామీతో ఆయన పార్టీలో చేరారు. కానీ, ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే జాబితాలో ఆయన పేరు లేదు. ఆయనకు కేసీఆర్ టిక్కెట్ నిరాకరించారు. పైగా పార్టీలోనూ ఎలాంటి ప్రాధాన్యం లేదు. దీంతో కొంతకాలంగా బీఆర్ఎస్‌పై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా స్థానిక కాంగ్రెస్ నేతలతో, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సంప్రదింపులు జరిపారు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు.
కాంగ్రెస్ టిక్కెట్ ఖాయమా..?
కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఆయన ఆశిస్తున్న ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందా.. లేదా.. అన్న విషయంలో స్పష్టత లేదు. మోత్కుపల్లి కోరుకుంటున్న తుంగతుర్తి టిక్కెట్ కోసం గట్టి పోటీ ఉంది. బిఆర్‌ఎస్ నుంచి మందుల సామేలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ నియోజకవర్గం నుంచి అద్దంకి దయాకర్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయన గత రెండు ఎన్నికల్లో గెలుపు వరకు పొరాడి తక్కువ మెజారిటీలతో ఓడిపోయారు. పైగా ఆయన రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. వీరిలో ఎవరికి టిక్కెట్ వస్తుందో.. అదిస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎన్నికల వరకు వేచి చూస్తే తప్ప తెలియదు.