Gaddar: గద్దర్ ముద్దుల వెనక ఇంత కథ ఉందా ?
గద్దర్.. పేరు కంటే ముందు పాట వినిపిస్తుంది.. ఆ పాటలో ఆవేదన కనిపిస్తుంది. తన గొంతుతో.. పదాలతో కోట్ల హృదయాలను కదిలించిన వ్యక్తి గద్దర్.
ఈ ప్రజాయుద్ధనౌక.. ప్రత్యక్ష రాజకీయాల ద్వారా.. ఇక ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయింది. రాజకీయాల్లోకి వచ్చేశారు కూడా ! ఆ మధ్య కేఏ పాల్ పార్టీలో చేరి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ఎందుకు చేరారు.. ఏం ఆశించి చేరారు.. ఆ పార్టీలో చేరి ఏం సాధిస్తారు అని చర్చ జరుగుతున్న సమయంలోనే.. అనుకోని సంఘటన జరిగిందొకటి. గద్దర్ రేవంత్‌తో కుమ్మక్కు అయ్యారని.. తన పార్టీ నుంచి బహిష్కరిస్తున్నానని ప్రకటించారు కేఏ పాల్. దీంతో కోపంతో ఊగిపోయిన గద్దర్.. ప్రత్యేక పార్టీ అంటూ ప్రకటనలు చేశారు. కట్ చేస్తే.. ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభలో ప్రత్యక్షం అయ్యారు. వేదిక మీదే రాహుల్‌గాంధీకి గద్దర్‌ను పరిచయం చేశారు రేవంత్. జీవితంతో దాదాపు అన్నీ చూసేసిన గద్దర్.. రాహుల్‌ను చూసి తన్మయత్వానికి గురయ్యారు అదేంటో ! ఆలింగనం చేసుకున్నారు.. నుదుటి మీద ముద్దులు పెట్టారు. చెవిలో ఏదో గుసగుస కూడా చెప్పారు రెండు నిమిషాలు.
ఇదే హైలైట్ అనుకుంటే.. పక్కనే కూర్చోండి అన్నట్లు గద్దర్‌ను చూసి రాహుల్ సైగలు చేయడం మరో హైలైట్. చూసేవాళ్లకు కూడా వింతగా, విచిత్రంగా అనిపించిన ఈ ఘటనపై సోషల్ మీడియాలో కొత్త జరుగుతోంది. గద్దర్ ఇంత ఎమోషనల్ ఎందుకు అయ్యారు. గద్దర్‌లాంటి వ్యక్తి.. వేదిక మీద ఇలా చేయడం ఏంటి.. ఆయన ఏం ఆశిస్తున్నారు.. కాంగ్రెస్ ఆయన నుంచి ఏం ఆశిస్తుందనే చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. నిజానికి రాహుల్ గాంధీని గద్దర్ ఇలా హగ్ చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలానే చేశారు. అప్పుడే ఆయన కాంగ్రెస్‌లోకి వస్తారని అంతా అనుకున్నారు. ఐతే అది జరగలేదు. ఐతే ఇప్పుడు సీన్ మారింది. తనను తాను అసెంబ్లీలో చూసుకోవాని గద్దర్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. అందుకే భారీ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీకి దిగుతానని గద్దర్ చేసిన ప్రకటనలు రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. తెలంగాణ జన గర్జన సభలో గద్దర్ తీరు చూస్తే.. ఈసారి ఆయన కాంగ్రెస్‌లోకి రావడం ఖాయంగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. కేసీఆర్ మీద గద్దర్‌ను పోటీకి దించాలని రేవంత్ భావిస్తున్నారా అంటే.. అదే జరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అనే చర్చ జరుగుతోంది. ఏమైనా తన పాటతో సమాజాన్ని కదిలించి.. పేద జనాల గొంతుకుగా మారిన గద్దర్.. ఇప్పుడు అదే పాటను పార్టీల కోసం ఉపయోగించుకోవడం.. ఇలా వేదికల మీద బడా నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేయడం కొత్త చర్చకు కారణం అవుతోంది. టైమ్ అంతే బాస్.. ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం అని నిట్టూరుస్తున్నారు మరికొందరు.