MP. Avinash Reddy: వై.ఎస్.వివేకా హత్య కేసు – ఏం జరిగింది.. ఏం జరగబోతోంది?

vivekanada reddy hatya case

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2023 | 08:55 AMLast Updated on: Feb 13, 2023 | 1:08 PM

Mp Avinash Reddy

ఏపీలో వివేకా హత్య కేసు ఒక సంచలనం. మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డిని 2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు హత్య చేసి చంపారు. ఇది ముమ్మాటికీ హత్యేనని ప్రాధమిక పోస్టుమార్టం నివేదిక తేల్చింది. ఆయన శరీరంపై మొత్తం ఏడు గాయాలున్నట్లు గుర్తించింది. బెడ్ రూంలో చంపి బాత్ రూంలో పడేసినట్లుగా అనుమానించారు పోలీసులు. ఈ హత్య జరిగిన సమయంలో ఇంటి వెనుక తలుపు తెరిచి ఉందని వాచ్ మెన్ తెలిపారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారమే ఈ మర్డర్ చేసినట్లు అనుమానించారు.

ఈ మిస్టరీని ఛేదించేందుకు సిఐడి అడిషనల్ డిజిపి అమిత్ గార్గ్ నేతృత్వంలో ఐదుగురి స‍‎భ్యులతో కూడిన సిట్ ను ప్రభుత్వం నియమించింది. హత్యకు ముందు రోజు రాత్రి 11.30 నుంచి ఉదయం 6 గంటలలోపు ఏం జరిగింది అనేదానిపై దృష్టిసారించారు సిట్ అధికారులు. ఇంటి వెనుకభాగంలోని తలుపు ఎందుకు తెరిచి ఉంది.. ఎవరు తీశారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ ప్రసాద్ ను పనికి త్వరగా రమ్మని చెబితే నన్ను చచ్చేలా కొట్టారని దీనిని రాసేందుకు చాలా కష్టపడ్డానని ప్రసాద్ ను వదిలిపెట్టద్దని ఆలేఖ సారంశం. ఈ లేఖపై స్పందించిన జగన్ హత్యను డ్రైవర్ పై నెట్టేందుకు ఇలా రాసి పెట్టారా.. ఎవరు రాశారు ఆ లేఖ అని ప్రశ్నించారు. అయితే ఇందులో రాజారెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుధాకర్ రెడ్డి హస్తం ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అదే సమయంలో అప్పటి ప్రతిపక్షనాయకుడిగా ఉన్న జగన్… వివేకా హత్యకు చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందే ఈ కేసుపై ఏదో ఒక విషయం తేలుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. జగన్ కుటుంబసభ్యులే వివేకాను హత్య చేశారని టీడీపీ ఆరోపించింది. వివేక హత్యకు కుటుంబ కలహాలే కారణమని చెప్పింది.
అయితే ఆ తర్వాత ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారు. తన చిన్నాన్నను హత్య చసిన వారిపై దర్యాప్తుకు ఆదేశిస్తూ మూడు ప్రత్యేక దర్యాప్తు సంస్థలను నియమిందింది జగన్ సర్కార్. తెలుగుదేశం నాయకులు ఈ కేసును సిబిఐకి ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జోక్యం చేసుకొని సిబిఐకి ఆదేశించగా మూడు నెలలు ఆలస్యంగా దీనిపై విచారణ చేపట్టింది. ఇందులో నలుగురు నిందితులు ఉన్నారని ప్రాథమికంగా నిర్ధారించింది. ముందుగా సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిని రిమాండుకు తరలించారు సీబీఐ అధికారులు. వీరిద్దరు ఒకే పల్సర్ బైక్ పై వివేకా ఇంటికి గొడ్డలితో వచ్చి తిరిగి పారిపోయినట్లు సిబిఐ అధికారులు చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఆపై మరో ముగ్గురిని అనుమానించి రిమాండ్ కు పంపించారు. డ్రైవర్ దస్తగిరి నుంచి వాగ్మూలం రికార్డ్ చేసింది.

సిబిఐ దర్యాప్తు వేగం చేసేకొద్దీ వైఎస్ కుటంబసభ్యులే హత్యకు కుట్ర చేశారనే అనుమానాలు మరింత పెరిగాయి. మరోవైపు సీబీఐ అధికారులు ఒత్తిళ్లకు లోనై కేసును దర్యాప్తు చేయలేమని చేతులెత్తేశారనే ఆరోపణలు కూడా వినిపించాయి. అంతేకాకుండా విచారణకు వచ్చిన అధికారులపైనే ప్రవేట్ కేసులు పెడుతుండటంపై సిబిఐ దర్యాప్తులో జాప్యం జరిగింది. ప్రభుత్వం సహకరించడం లేదని, కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని సీబీఐ ఆరోపించింది.

కేసులో తీవ్రజాప్యం జరుగుతుండడంతో వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును కోరారు. దీనికి కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ కేసును తెలంగాణ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారిస్తుందని ప్రకటించింది.

తెలంగాణకు కేసు బదిలీ అయ్యాక సీబీఐ వేగం పెంచింది. ఇందులో భాగంగా కడప ఎంపి అవినాష్ రెడ్డికి నోటీసులు పంపించింది. చాలా సార్లు విచారణకు నిరాకరించారు అవినాష్. ఏదో ఓపని ఉందని ఈ రోజు రాలేనని చెప్పుకుంటూ వచ్చారు. కానీ డిసెంబర్ 28న జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరవ్వాలని సిబిఐ సూచించడంతో విచారణకు సుముఖత చూపారు. అదే తరుణంలో సిబిఐతో విచారణకు వెళ్లే ముందు ఎంపి అవినాష్ రెడ్డి లోటస్ పాండ్ లోని విజయమ్మతో భేటి అయ్యారు. దీనిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ భేటి కంటే ముందు తనకు ఒక అడ్వొకేటును నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును అవినాష్ రెడ్డి లేఖలో కోరారు. అలాగే విచారణకు సంబంధించిన పూర్తి వీడియోని రికార్డ్ చేయాలని కూడా ఇందులో పొందుపరిచారు.

ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన వివేకా హత్య కేసు ఇకపై మరో మలుపు తిరుగుతుందని అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఏపీ కేంద్రంగా కేసు దర్యాప్తు నడిచింది. అయితే అక్కడ సీబీఐకి అధికారులు సహకరించలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు. అందుకే ఈ కేసు కొలిక్కి వస్తుందని అందరూ భావిస్తున్నారు.