Raghurama Krishna Raju: ఇద్దరు ఐపీఎస్‌లు హింసించారు.. వారిపై చర్యలు తీసుకోండి.. ప్రధానికి రఘురామ లేఖ..

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని ప్రధానంగా ఆరోపించింది. కేసు నమోదు చేసిన అనంతరం.. ఆయన పుట్టిన రోజు అయిన 2021 మే 14న ఏపీ సీఐడీ అధికారులు, హైదరాబాద్‌లో రఘురామను అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 1, 2023 | 04:54 PMLast Updated on: Nov 01, 2023 | 4:54 PM

Mp Raghurama Krishna Raju Writes Letter To Pm Modi To Take Action On Ips Officers

Raghurama Krishna Raju: పోలీసు కస్టడీలో తనను హింసించిన ఇద్దరు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని మోదీకి లేఖ రాశారు. లోకసభ నేతగా తనపై జరిగిన దాడిపై సీబీఐ, ఎన్‌ఐఏ దర్యాప్తు చేసేలా చర్యలు తీసుకోవాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్‌ఆర్ ఆంజనేయులు తనపై దాడిలో కీలకంగా ఉన్నారని ఫిర్యాదు చేశారు. రఘురామ వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి, ఆ పార్టీపై తిరుగుబాటు చేశారు.

ఈ క్రమంలో ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రఘురామపై సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్లు 124(ఏ), 153(బి), 505 ఐపీసీ, 120(బీ) కింద కేసు నమోదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని ప్రధానంగా ఆరోపించింది. కేసు నమోదు చేసిన అనంతరం.. ఆయన పుట్టిన రోజు అయిన 2021 మే 14న ఏపీ సీఐడీ అధికారులు, హైదరాబాద్‌లో రఘురామను అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లారు. తర్వాత రఘురామను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. తనను అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు తీవ్రంగా కొట్టారని కోర్టుకు తెలిపారు. పోలీసుల దెబ్బలకు తన కాళ్లు వాచిపోయి, నడవలేని స్థితిలో ఉన్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. స్పందించిన కోర్టు రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. శరీరంపై ఎలాంటి దెబ్బలు లేవని వైద్యులు నివేదిక సమర్పించారు.

ఈ నివేదికను తప్పుబడుతూ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా, గాయాలైనట్లు తేలింది. అనంతరం కోర్టు ఎంపీ రఘురామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అప్పటినుంచి రఘురామ బెయిల్‌పై ఉన్నారు. కాగా, తాజాగా ఈ అంశంపై ప్రధానికి లేఖ రాశారు. పార్లమెంట్ కమిటీ ద్వారా కూడా తనపై జరిగిన దాడిపై విచారణ జరిపించాలని లేఖలో కోరారు. తనను కస్టడీలో హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.