Mynampally Hanumanth Rao: వేటు పడకముందే మైనంపల్లి కారు దిగబోతున్నారా..?
మైనంపల్లి వ్యవహారం బీఆర్ఎస్‌లో రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సడెన్‌గా ఆయనకు కోపం ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ మాటల మీద బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అర్థం కాదు. నెక్ట్స్ ఏం జరుగుతుందన్న అంచనా లేదు.

Mynampally Hanumanth Rao: రాజకీయం అంతా ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ దగ్గరే కనిపిస్తోంది. తమకు టికెట్ రాలేదని కొందరు.. తమ వాళ్లకు టికెట్ రాలేదని ఇంకొందరు.. తమ వాళ్లకే టికెట్ రాకుండా ఆపుతారా అని మరికొందరు.. ఇలా అసంతృప్తులు, అసహనాలు భారీగానే వినిపిస్తున్నాయి ఆ పార్టీలో! టికెట్లు, అభ్యర్థులు, ఆశావహులు, అసంతృప్తుల సంగతి ఎలా ఉన్నా.. మైనంపల్లి వ్యవహారం బీఆర్ఎస్‌లో రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సడెన్‌గా ఆయనకు కోపం ఎందుకు వచ్చిందో తెలియదు.
ఆ మాటల మీద బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అర్థం కాదు. నెక్ట్స్ ఏం జరుగుతుందన్న అంచనా లేదు. ఇలాంటి పరిణామాల మధ్య ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అన్నట్లుగా మారింది మైనంపల్లి వ్యవహారం. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి కొన్ని గంటల ముందే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇస్తే సరి.. లేదంటే ఊరుకోబోనని మాట్లాడారు. ఇక్కడితో ఆగారా అంటే.. హరీష్ రావును టార్గెట్ చేశారు. హరీష్ బట్టలు ఊడతీసే వరకు నిద్రపోనని, సిద్దిపేటలో ఆయన అడ్రస్ గల్లంతు చేస్తానని మెదక్‌లో హరీష్ పెత్తనం ఎందుకని, మెదక్ అంటే ఓ కీప్ మాదిరిగా చూస్తున్నారని అంటూ తిరుమల సాక్షింగా మైనంపల్లి రేపిన మంటలు బీఆర్ఎస్‌లో రగులుతూనే ఉన్నాయి. మైనంపల్లి ఈ వ్యాఖ్యలు చేశాక.. బీఆర్ఎస్ లిస్ట్ వచ్చింది. ఈ లిస్టులో మైనంపల్లి హన్మంతరావు పేరు ఉంది. దీనిపై కేసీఆర్‌ను ప్రశ్నిస్తే.. ఏమైనా ఎక్కువ చేస్తే తీసి అవతల వేస్తామని అన్నారు. కేటీఆర్, కవిత కూడా.. మైనంపల్లి వ్యాఖ్యలని ఖండించారు.
దీంతో మైనంపల్లి వెనక్కి తగ్గారు. తాను పార్టీని ఏమీ అనలేదని.. తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఐనాసరే.. మైనంపల్లిపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గానే ఉంది. ఆ పార్టీ నేతలు కూడా మైనంపల్లి పేరు చెప్తే కస్సుమంటున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వేటుకు కూడా రంగం సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఐతే తనపై బీఆర్ఎస్ హైకమాండ్ చర్యలు తీసుకునే లోపే.. తనే పక్కకు జరగాలని మైనంపల్లి నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో తన కార్యచరణ ప్రకటిస్తానని మైనంపల్లి అంటున్నారు. ఆ ప్రకటనలో ఏముంటుంది..? ఎలాంటి సంచలన నిర్ణయాలు ఉంటారు..? అన్నది ఆసక్తికరంగా మారింది.