Chandrababu Naidu: కుప్పంలో బాబును ఓడించేలా జగన్ ప్లాన్.. లక్ష మెజారిటీయే లక్ష్యంగా టీడీపీ
వచ్చే ఎన్నికల్లో జగన్ తాను అధికారంలోకి రావడం.. టీడీపీని ఓడించడమే కాదు.. ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించారు.

Chandrababu Naidu: ఎన్నికలకు మరికొన్ని నెలలే గడువు ఉండటంతో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓటమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. మరోవైపు ఈ సారి లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. టీడీపీ వర్సెస్ వైసీపీగా సాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో జగన్ తాను అధికారంలోకి రావడం.. టీడీపీని ఓడించడమే కాదు.. ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఆయన కుప్పంపై స్పెషల్ ఫోకస్ చేసి, బాబు ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. గతంలో చంద్రబాబుపై వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన చంద్రమౌళి కుమారుడు భరత్‌కు ఇప్పటికే ఎమ్మెల్సీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బాబుపై భరత్ పోటీ చేస్తారని వైసీపీ ప్రకటించింది. ఈ దిశగా అతడికి పూర్తిస్థాయిలో వైసీపీ మద్దతిస్తోంది. భరత్ కుప్పం నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పని చేసుకుంటూ వెళ్తున్నాడు.
రాజకీయంగా వైసీపీ యాక్టివ్‌గా ఉండటమే కాకుండా.. టీడీపీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తోంది. తమకు అనుకూలంగా ఉంటేసరే.. లేదంటే కేసులు పెట్టి, వేధించడమే వైసీపీ చేస్తున్న పని. ఇక్కడ ఎమ్మెల్యే చంద్రబాబే అయినా.. అధికారంలో ఉంది వైసీపీ కావడంతో ఆ పార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. మరోవైపు అభివృద్ధి పనులకు నిధుల్ని కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. మరోవైపు టీడీపీకి చెందిన నేతల్ని తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. వైసీపీలో చేరాలి అని ఒత్తిడి తెస్తోంది. ఈ రకంగా చంద్రబాబు క్యాడర్‌ను తగ్గించాలని వైసీపీ భావిస్తోంది.
లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా
ఒకవైపు వైసీపీ ఎంతగా ఇబ్బందులు సృష్టిస్తున్నా టీడీపీ గట్టిగానే పోరాడుతోంది. ఈ సారి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రతి మూడు నెలలకోసారి నియోజకవర్గంలో పర్యటించాలని బాబు ప్రణాళికలు రూపొందించుకున్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతం చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. మండలస్థాయి, మున్సిపల్ స్థాయి నేతలతో బాబు సమావేశమయ్యారు. వైసీపీ ఎంతగా బెదిరిస్తున్నా తనవైపే నిలబడ్డ కార్యకర్తలను చంద్రబాబు అభినందించారు. వైసీపీ నుంచి కూడా కొందరు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కుప్పంలో టీడీపీ బాధ్యతలు చూసేందుకు టీడీపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు సమన్వయ కమిటీ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులు, రాజకీయాలపై ఆయన చంద్రబాబుకు వివరిస్తారు. లక్ష ఓట్ల మెజారిటీ సాధించేందుకు అవసరమైన ప్రణాళికల్ని బాబు వివరిస్తారు. ఎలాగైనా వైసీపీ ఎత్తుగడల్ని ఎదుర్కొని లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని అటు వైసీపీ.. ఇటు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరి ప్రణాళికల్ని వారు రచిస్తున్నారు.