ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు క్యాబినెట్ మార్పులు చేర్పుల వ్యవహారాలు కాస్త హాట్ టాపిక్ అవుతున్నాయి. త్వరలోనే కొంతమంది మంత్రులను బయటకు పంపించే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు పూర్తయింది. అప్పటినుంచి కొన్ని మంత్రి పదవులు పై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు కనీసం 10 మంది మంత్రులపై ఆరోపణలు రావడంతో వారిని పక్కన పెట్టాలని డిమాండ్లు కూడా వినపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సీనియర్ నేత మంత్రి అచ్చేన్నాయుడు విషయంలో సొంత పార్టీ నేతలు కూడా సీరియస్ గానే ఉన్నారు. ఇక జిల్లా నేతలు కూడా ఆయనపై కాస్త ఆగ్రహం గానే ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆయనను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. అలాగే మరో మంత్రి వంగలపూడి అనిత విషయంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఏకంగా హోం శాఖపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆమె పిఏ వ్యవహారం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. ఇక తాజాగా డార్లింగ్ మంత్రి అంటూ మరో మంత్రి గురించి ఒక పత్రికలో వచ్చిన కథనం తీవ్ర దుమారమే రేపింది. ఏకంగా తెలంగాణ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ను హెచ్చరించింది. ఇలాగే మరి కొంతమంది మంత్రులపై కూడా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ నుంచి ఎవరిని తప్పిస్తారు అనే దానిపై కాస్త ఆసక్తి నెలకొంది. అయితే తప్పించిన వారి స్థానంలో ఎవరిని క్యాబినెట్ లోకి తీసుకుంటారు అనే దానిపై కూడా పెద్ద చర్చ జరుగుతుంది. త్వరలోనే జనసేన నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత క్యాబినెట్లోకి రానున్నారు కొణిదల నాగబాబు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూడా ప్రకటించాయి. స్వయంగా పవన్ కళ్యాణ్ దీనిపై ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు నాగబాబు క్యాబినెట్ లోకి వెళితే తాను కూడా క్యాబినెట్ లోకి వస్తాను అంటూ నందమూరి బాలకృష్ణ అడుగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో తనకు క్లారిటీ లేదని కాబట్టి క్యాబినెట్ లో బెర్త్ కావాలని బాలయ్యను.. చంద్రబాబును కోరినట్లుగా టిడిపి వర్గాలు అంటున్నాయి. బాలకృష్ణ మూడుసార్లు హిందూపురం నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధిస్తూ వచ్చారు. గతంలోనే ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ బాలకృష్ణ మాత్రం క్యాబినెట్ లోకి వచ్చే విషయంలో ఆసక్తి చూపించలేదు. తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబ సభ్యులు ఎవరూ 2014 తర్వాత క్యాబినెట్లో చోటు దక్కించుకోలేదు. దీనితో బాలకృష్ణ క్యాబినెట్ లోకి అడుగు పెట్టాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య క్యాబినెట్ లో ఉన్నా లేకపోయినా పవర్ఫుల్ అని టిడిపి వర్గాలు ఎప్పటినుంచో చెబుతూ ఉంటాయి. కానీ క్యాబినెట్లో ఉంటే ఆ లెక్క వేరు అనే ఫీలింగ్లో బాలయ్య ఉన్నట్లు సమాచారం. ఇక బాలయ్య అడిగితే కచ్చితంగా చంద్రబాబు చేసే అవకాశం కూడా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనవంతుగా పూర్తిస్థాయిలో సహకారం అందించే.. బాలకృష్ణను క్యాబినెట్లోకి తీసుకోవాల్సిందే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక సామాజిక వర్గ లెక్కల ప్రకారం చూసుకుంటే బాలకృష్ణకు కాస్త ఇబ్బందికర పరిణామం.. ఉన్నా సరే ఆయన మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేదానిపై స్పష్టత లేదు కాబట్టి తీసుకుంటే మంచిదని టిడిపి సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నందమూరి.. నారా కుటుంబాల నుంచి చంద్రబాబు, నారా లోకేష్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి పయ్యావుల కేశవ్.. అలాగే నాదెండ్ల మనోహర్ క్యాబినెట్లో కొనసాగుతున్నారు. మరి బాలకృష్ణని క్యాబినెట్ లోకి తీసుకుంటే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది చూడాలి.[embed]https://www.youtube.com/watch?v=-m5ChDnZ_1I[/embed]