తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా… నందిగం సురేష్ వెర్షన్
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా భావిస్తున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా... పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా భావిస్తున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా… పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు. అయితే ఆయన పోలీసులకు సహకరించకపోవడంతో కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. పోలీసు విచారణలో ఆయన నుంచి ఏ మాత్రం సహకారం అందడం లేదు. కార్యాలయంపై దాడికి వెళ్లామని అంగీకరిస్తూనే ఆ సమయంలో తాను అక్కడ లేను అని సమాధానం ఇచ్చారు సురేష్.
అయితే గూగుల్ లొకేషన్ ను చూపించిన పోలీసులు… సురేష్ అక్కడే ఉన్నారని చెప్పారు. ఇక ఆయన వద్ద భద్రత కల్పించిన గన్మెన్ నుంచి కూడా పోలీసులు సాక్ష్యం తీసుకుని ఆ సాక్ష్యం కూడా సురేష్ ముందు ఉంచారు. దాడి సమయంలో సురేష్ సంఘటన స్థలంలోనే ఉన్నట్లు వారు సాక్ష్యం చెప్పారు. గన్మెన్ ల పేర్లు చెప్పాలని సురేష్ ని అడగగా సురేష్ నుంచి మర్చిపోయా అనే సమాధానమే వచ్చింది. కార్యాలయంపై దాడి ఎన్ని గంటలకు జరిగింది? అప్పట్లో ఎవరెవరు వచ్చారని ప్రశ్నించగా సురేష్ మర్చిపోయా అంటూ సమాధానం ఇచ్చారు.
ఇక ఫోన్ అప్పగించాలని కోరగా గతంలో వాడిన ఫోన్ పోయిందని సమాధానం ఇవ్వడంతో ఫిర్యాదు చేసారా అని పోలీసులు అడగగా… పాత ఫోన్ అని ఫిర్యాదు చేయలేదని సురేష్ తెలిపారు. అయితే రిమాండ్ రిపోర్టుపై ఆయన సంతకం పెట్టలేదు. అదే విషయాన్ని పోలీసులు మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకువెళ్ళారు. సురేష్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా… దాడి సమయంలో సురేష్ అక్కడ లేరని, బెయిల్ మంజూరుచేయాలని కోర్ట్ ని కోరగా మేజిస్ట్రేట్ వారి అభ్యర్థనను తిరస్కరించారు.