నానీలో భయం స్టార్ట్.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లనే వంశీని, విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం అవుతుంది. గన్నవరం టిడిపి కార్యాలయం పై వంశీ అలాగే ఆయన అనుచరులు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దాడి చేయడం..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లనే వంశీని, విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం అవుతుంది. గన్నవరం టిడిపి కార్యాలయం పై వంశీ అలాగే ఆయన అనుచరులు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దాడి చేయడం.. అక్కడ పలువురి కార్లు అలాగే కార్యాలయ ఫర్నిచర్ వంటివి ధ్వంసం చేయడం అప్పట్లో సంచలనం అయింది. ఈ ఘటనలో వంశీ పై అలాగే ఆయన అనుచరులపై కేసు నమోదు అయింది. ఈ విషయంలో వంశీ ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు.
కానీ తాజాగా ఈ కేసులో ఫిర్యాదు చేసిన సత్య వర్ధన్ అనే వ్యక్తిని బెదిరించి కేసు వెనక్కి తీసుకునేలా అఫీడవిట్ రాయించారు. దీనితో ఈ వ్యవహారం ఒక్కసారిగా సంచలనం అయింది. దీనిపై ఫోకస్ పెట్టిన పోలీసులు అతన్ని బెదిరించి కేసు వెనక్కి తీసుకున్నారు అని గుర్తించారు. దీనితో వంశీని ఆయన అనుచరులు కొందరిని.. నేడు పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడ తరలించారు. ఈ వ్యవహారంలో వంశీ సేఫ్ జోన్ లో ఉన్నారని భావించినా.. ఆయన తాజాగా ఇరుక్కోవడంతో ఒకసారిగా కలకలం రేగింది.
దీనితో తర్వాత ఎవరిని అరెస్టు చేయబోతున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలోనే గుడివాడ నియోజకవర్గానికి చెందిన కొడాలి నానిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని పదే పదే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ ను అలాగే పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణను తీవ్రస్థాయిలో విమర్శించారు. అప్పట్లో వంశీ, నాని చేసిన వ్యాఖ్యలకు మీడియాలో కూడా హడావుడి ఎక్కువగానే ఉండేది.
ఒక వర్గం మీడియా వీళ్ళతో పదే పదే ఇంటర్వ్యూలు తీసుకుంటూ, ఆ వ్యాఖ్యలను ఎక్కువగా వైరల్ చేస్తూ ఉండేది. అయితే వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత.. కొడాలి నాని సైలెంట్ అయిపోయారు. ఆయన ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో కూడా స్పష్టత లేదు. మొన్నామధ్య వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద కనపడిన నాని.. ఇటీవల కృష్ణా జిల్లా పార్టీ నేతల సమావేశంలో కనిపించారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత నానిపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. వాలంటీర్లను బెదిరించారనే.. కేసులతో పాటుగా కబ్జా కేసులు కూడా నానిపై ఉన్నాయి.
దీనితో ఈ కేసుల్లో ఏదో ఒక కేసులో ఆయనను అరెస్టు చేయవచ్చు అని భావిస్తున్నారు. జగన్ పై ఉన్న అభిమానంతో చంద్రబాబును లోకేష్ ను బూతులు తిట్టిన నాని.. ఇప్పుడు తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక వంశీ అరెస్టును కూడా ఆయన సోషల్ మీడియాలో ఖండించారు. వంశీకి నానికి మధ్య మంచి స్నేహం ఉంది. నాని సహకారంతోనే వంశీ వైసీపీలో అడుగుపెట్టాడు. జగన్ కు వైసీపీ అధిష్టానానికి వంశీని దగ్గర చేసింది కూడా నానినే. అప్పట్లో గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలో కీలకంగా ఉండగా.. ఆయనను పక్కకు తప్పించి వంశీకి ప్రాధాన్యత పెంచడంలో నాని సక్సెస్ అయ్యారు.
ఇక 2024 ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావుకు ఖచ్చితంగా వైసిపి నుంచి సీటు రాదు అనే సిగ్నల్స్ ఇవ్వటంలో కూడా నాని సక్సెస్ అయ్యారు. దీనితో ఆయన టిడిపిలోకి వెళ్లిపోయారు. ఇక వైసీపీలో వంశీకి సీట్ వచ్చింది. ఈ సీట్ రావడంలో కూడా నాని కీలకపాత్ర పోషించారు. వాస్తవానికి వంశీకి గన్నవరం నుంచి పోటీ చేయడం ఆసక్తి లేదు అనే ప్రచారం కూడా జరిగింది. కొన్నాళ్లపాటు ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఓడిపోయిన తర్వాత నానీ కంప్లీట్ గా సైలెంట్ గా ఉండిపోయారు.
టిడిపి అధినేత చంద్రబాబుని ఆయన సతీమణి నారా భువనేశ్వరిని అభ్యంతరకరంగా మాట్లాడిన వంశీ.. ఈ మధ్యకాలంలో పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశి ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఆయనను తాజాగా అరెస్టు చేసే వరకు కూడా మీడియాలో పెద్దగా కనబడలేదు. ఇటీవల విజయవాడలో ఓ కేసు సందర్భంగా కోర్టుకు వచ్చిన వంశీ తన అనుచరులకు.. లాయర్ దుస్తులు వేసి తనకు రక్షణగా తీసుకొచ్చారు. ఇక నియోజకవర్గానికి పూర్తిగా వంశి నాని ఇద్దరు దూరంగానే ఉంటున్నారు.
గుడివాడలో నాని పెద్దగా తిరగడం లేదు. ఇక వైసిపి నాయకులతో కూడా ఆయన పెద్దగా మాట్లాడటం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీపై కూడా నాని పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలతో పాటుగా రాజకీయంగా సానుకూలంగా లేని పరిస్థితులతో నాని దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు నానిని కూడా అరెస్టు చేస్తే గుడివాడలో వైసిపి పరిస్థితి అగమ్య గోచరంగానే ఉండే అవకాశం ఉంది. పార్టీ ఓడిపోయిన తర్వాత వైసిపి కార్యకర్తల మనోధైర్యం కూడా నియోజకవర్గంలో పూర్తిగా దెబ్బ తింది. మరి నానిని అరెస్టు చేస్తారా లేదంటే నాని సైలెంట్ గా ఉంటారా అనేది చూడాలి.