Nara Bhuvaneshwari: రాజకీయాల్లోకి భువనేశ్వరి.. నిజం గెలవాలి పేరుతో రాష్ట్ర పర్యటన..!
నారా భువనేశ్వరిని రాజకీయాల్లోకి తేవాలని టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కూడా ఈ అంశంపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చే వారం నుంచే భువనేశ్వరి ఏపీ వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతున్నారు.
Nara Bhuvaneshwari: ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. నిజం గెలవాలి పేరుతో త్వరలో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. గత నెలలో చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిదే. దాదాపు 40 రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారు. దీంతో పార్టీని నడిపించే వాళ్లు కరువయ్యారు. లోకేశ్, బాలకృష్ణ వంటి నేతలున్నా.. అంతకంటే బలంగా ప్రజల్లో కదలిక తెచ్చే నేతలు, రాజకీయ ప్రణాళిక టీడీపీకి అవసరం.
అందుకే నారా భువనేశ్వరిని రాజకీయాల్లోకి తేవాలని టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కూడా ఈ అంశంపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చే వారం నుంచే భువనేశ్వరి ఏపీ వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతున్నారు. నిజం గెలవాలి పేరుతో ఆమె రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. అనేక నియోజకవర్గాల్లో ఈ పర్యటన సాగుతుంది. వారానికి రెండు, మూడు చోట్ల భువనేశ్వరి పర్యటన ఉండేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చంద్రబాబు ప్రజల్లో లేకున్నా.. ఆయన సతీమణిగా భువనేశ్వరికి ఆదరణ దక్కుతుందని ఆ పార్టీ ఆలోచన. భువనేశ్వరి పర్యటనతోపాటు టీడీపీతో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా కొద్ది రోజులుగా నిలిచిపోయిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని లోకేష్ నిర్ణయించారు. అలాగే ‘బాబుతో నేను’ కార్యక్రమంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడాలని, పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఇతర అంశాపై నాలుగైదు రోజుల్లో విస్తృతస్థాయి భేటీ జరుగుతుంది. ఈ భేటీలో భవిష్యత్ టీడీపీ కార్యక్రమాలపై నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం చంద్రబాబు జైలులో ఉన్నందున టీడీపీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, వైసీపీపై పోరాడాలని టీడీపీ భావిస్తోంది.