Nara Brahmani: ఈసారి టార్గెట్ నారా వారి కుటుంబమే.. భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా అరెస్టవుతారా..?

చంద్రబాబును.. లోకేష్‌ను.. పార్టీకి సంబంధించిన ఇతర ముఖ్య నేతలు అచ్చెన్న, నారాయణ, దేవినేని ఉమ ఇలాంటి వారిని వివిధ కేసుల్లో అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతారని ఊహించారు తప్ప.. భువనేశ్వరి.. బ్రాహ్మణిలను కూడా కేసుల పరిధిలోకి వచ్చేలా చేస్తారని ఊహించలేకపోయామనేది టీడీపీలో జరుగుతున్న చర్చ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 27, 2023 | 02:24 PMLast Updated on: Sep 27, 2023 | 2:24 PM

Nara Bhuvaneswari And Brahmani Will Arrest Soon In Inner Ring Road Scam

Nara Brahmani: నందమూరి ఆడపడుచులు.. నారా వారి ఇంటి కోడళ్లు కూడా అరెస్ట్‌ కాబోతున్నారా..? ఇప్పుడిదే టీడీపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని A-6గా చేర్చడంతో ఈ అంశం తెరమీదకొచ్చింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ వీసీ ఎండీగా నారా భువనేశ్వరి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా నారా బ్రహ్మణి ఉండటంతో ఈ చర్చకు ఆస్కారం లభిస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత నారా లోకేష్‌‌ను, ఆ తర్వాత పార్టీకి సంబంధించిన కొందరు ముఖ్యులను అరెస్ట్‌ చేస్తారని ముందు నుంచి టీడీపీ నేతలు ఊహిస్తూనే వస్తున్నారు.

ప్రస్తుత పరిణామాలు కూడా దానికి అనుగుణంగానే సాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు. ఇప్పుడు క్వాష్‌.. బెయిల్‌ అంటూ కోర్టుల చుట్టూ తిరుగుతోన్న పరిస్థితి. మరోవైపు లోకేష్‌ కూడా రేపో మాపో అరెస్ట్‌ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 29వ తేదీ రాత్రి 08-15 గంటల నుంచి యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నారా లోకేష్‌.. పాదయాత్రలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి రాజమండ్రికి తిరిగి రాగానే ఎయిర్‌ పోర్టులోనే లోకేష్‌ను అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో చంద్రబాబు A-1గా ఉంటే.. నారా లోకేష్‌ A-14గా ఉన్నారు. దీంతో లోకేష్‌ అరెస్ట్‌ ఖాయం. ఆయన్ను ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో జైలుకు పంపడం ఖాయం అని అందరూ ఓ అంచనాకు వచ్చేశారు.
ఇదే సందర్భంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ వ్యవహరంలో ఆసక్తికర పరిణామం తెర మీదకు వచ్చింది. ఈ కేసులో A-6గా హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరు చేర్చారు. అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌‌లో మార్పులు, చేర్పులు చేసి.. భూములు కొనుగోలు చేసి లబ్ది పొందేలా చేసింది లోకేష్‌ అయితే.. లబ్ది పొందిన సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్‌ కాబట్టి.. A-6గా ఆ సంస్థ పేరును జత చేశారు. అయితే ఈ సంస్థకు వైస్‌ ఛైర్‌పర్సన్‌.. మేనేజింగ్‌ డైరెక్టర్‌గా భువనేశ్వరి వ్యవహరిస్తోంటే.. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నారా బ్రహ్మణి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ పేరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో ఉండడంతో ఆ సంస్థలో కీలక బాధ్యతలు చేపడుతూ కీలక పదవుల్లో ఉన్న అత్తా కోడళ్లిద్దరి మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా..? అనే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ పరిణామాన్ని ఎవ్వరూ ఊహించనే లేదంటున్నారు. చంద్రబాబును.. లోకేష్‌ను.. పార్టీకి సంబంధించిన ఇతర ముఖ్య నేతలు అచ్చెన్న, నారాయణ, దేవినేని ఉమ ఇలాంటి వారిని వివిధ కేసుల్లో అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతారని ఊహించారు తప్ప.. భువనేశ్వరి.. బ్రాహ్మణిలను కూడా కేసుల పరిధిలోకి వచ్చేలా చేస్తారని ఊహించలేకపోయామనేది టీడీపీలో జరుగుతున్న చర్చ.
ఈ టైంలోనే మరో చర్చా జరుగుతోంది. పార్టీని లీడ్‌ చేసే విషయంలో చంద్రబాబు తర్వాత లోకేష్‌.. లోకేష్‌ తర్వాత బ్రహ్మణి.. భువనేశ్వరి అనే పేర్లు వరుసగా తెర మీదకు రావడంతో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో వీరి పేర్లు తెరపైకి వచ్చి ఉండొచ్చనే భావన టీడీపీ వర్గాల్లో కన్పిస్తోంది. నారా ఫ్యామిలీ నుంచి ఎవ్వరినీ పార్టీని లీడ్‌ చేసే పరిస్థితి రానివ్వకుండా ఉండే ప్రక్రియలో భాగంగా వరుస కేసులతో.. చంద్రబాబు ఫ్యామిలీని టార్గెట్‌ చేసుకుని కేసులు పెడుతున్నారనేది ప్రస్తుతం పార్టీ వర్గాల్లో నడుస్తోన్న చర్చ. ఇదే సందర్భంలో కొడాలి నాని చేసిన కామెంట్లను ఓసారి గుర్తు చేసుకోవాలని అంటున్నారు. చంద్రబాబు గతంలో కమీషన్లకే కక్కుర్తి పడేవారని.. కానీ చంద్రబాబు ఫ్యామిలీ వచ్చాక.. మొత్తం స్వాహా చేస్తున్నారనే రీతిలో కామెంట్‌ చేశారనే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని అంటున్నారు. కొడాలి కామెంట్ల ప్రకారం చూస్తే.. ప్రతీదీ ప్రీప్లాన్డ్‌గానే చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని జరుగుతున్న పరిణామాలను టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీలో కొంత గందరగోళం నెలకొని ఉన్నట్టే కన్పిస్తోంది. ఇలా అరెస్టులు జరుగుతూ ఉంటే యాక్షన్‌ ప్లాన్‌ ఏ విధంగా సిద్దం చేసుకోవాలనే అంశంపై పార్టీలోని సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నట్టు కన్పిస్తోంది.