Top story భువనేశ్వరి సిద్ధం…. త్వరలో చక్రం తిప్పబోతున్నారా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వ బోతున్నారా ? రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కోవడానికి భువనేశ్వరి ఇప్పటినుంచి పొలిటికల్ గా సిద్ధమవుతున్నారా? గడచిన ఏడాదిగా భువనేశ్వరి ప్రతి మూవ్ పరిశీలిస్తే... భవిష్యత్ రాజకీయానికి ఆమె ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 14, 2024 | 12:20 PMLast Updated on: Oct 14, 2024 | 12:20 PM

Nara Bhuvaneswari Enter Into Polictis

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వ బోతున్నారా ? రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కోవడానికి భువనేశ్వరి ఇప్పటినుంచి పొలిటికల్ గా సిద్ధమవుతున్నారా? గడచిన ఏడాదిగా భువనేశ్వరి ప్రతి మూవ్ పరిశీలిస్తే… భవిష్యత్ రాజకీయానికి ఆమె ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఎన్టీఆర్ కుమార్తెగా కొన్నాళ్లు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు భార్యగా ఇన్నాళ్లు తెరవెనక పాత్రకే పరిమితమయ్యారు నారా భువనేశ్వరి. నందమూరి భువనేశ్వరి అనే పేరు నుంచి చంద్రబాబుని పెళ్లాడిన తర్వాత నారా భువనేశ్వరి గా మారినప్పటికీ… ఆమె ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు.1995లో ఆగస్టు సంక్షోభం సమయంలో తండ్రికి వ్యతిరేకంగా ఆమె భర్తను సమర్థించినప్పటికీ అప్పుడు కూడా తెర వెనకే ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఏ అధికార కార్యక్రమంలోనూ ఎన్నడు భువనేశ్వరి హాజరు కాలేదు. కేవలం వ్యక్తిగత, కుటుంబ కార్యక్రమాలకు మాత్రమే భువనేశ్వరి బాబు వెంట ఉండేవారు.1995, 1999, 2014 సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాల్గొన్న ఏ అధికార కార్యక్రమంలోనూ భువనేశ్వరి కనిపించలేదు. ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ, ముఖ్యమైన కార్యక్రమాల్లో మాత్రమే ఆమె హాజరయ్యేవారు. అలాగే ఎన్నడూ ఆమె రాజకీయాల గురించి మాట్లాడటం గానీ, అసలు వాటి ప్రస్తావన గాని తెచ్చిన సందర్భం ఎన్నడూ… ఎక్కడ చూడలేదు. బాబు సీఎంగా బిజీగా ఉన్న రోజుల్లో భువనేశ్వరి హెరిటేజ్ బిజినెస్ చూసుకునేవారు. ఒకరిద్దరూ కుటుంబానికి బాగా కావలసిన మిత్రుల సహకారంతో ఆమె హెరిటేజ్ సంస్థను విజయవంతంగా నడపగలిగారు. అంతేకాదు తన వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో, బరువు తగ్గే విషయంలో భువనేశ్వరి అవిశ్రాంతంగా కృషి చేశారు. దినాజ్ లాంటి ఫిజికల్ ట్రైనర్స్ సహకారంతో భువనేశ్వరి బరువు తగ్గి తన ఆరోగ్యాన్ని కూడా చక్కదిద్దుకోగలిగారు. చంద్రబాబుని మించి ఆమె చాలా క్రమశిక్షణగా ఉంటారని తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు.

హెరిటేజ్ వ్యాపారం, ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాలు తప్ప భువనేశ్వరి టిడిపి పార్టీ వ్యవహారాలు గాని, ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. బాగా సన్నిహితులకు, ఒకరిద్దరు అధికారులకు బదిలీల్లోనూ… పోస్టింగుల్లోనూ ఆమె గతంలో చంద్రబాబుకు సలహాలు ఇచ్చారనే వదంతులు వినిపించాయే తప్ప ప్రత్యక్షంగా భువనేశ్వరి పాత్రను ఎవరు చూడలేదు. పార్టీ ఆర్థిక వ్యవహారాలు వరకు మాత్రం ఆమె పర్యవేక్షించే వారిని సీనియర్ నేతలు చెప్తుంటారు. డబ్బు విషయంలో చాలా కరాకండిగా వ్యవహరిస్తారని… భువనేశ్వరి తో పోలిస్తే డబ్బు విషయంలో చంద్రబాబు నాయుడు చాలా లిబరల్ అనే మాట కూడా పార్టీలో వినిపిస్తుంటుంది. 2014లో భువనేశ్వరి ఒత్తిడి మేరకే చంద్రబాబు నాయుడు లోకేష్ ని ఎమ్మెల్సీగా, ఆపై మంత్రిగా చేశారని టాక్ వినిపించింది. పార్టీ వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకోకపోయినా పరోక్షంగా భువనేశ్వరి పాత్ర ఉందనేది కొందరి వాదన. 2019లో చంద్రబాబు ఓడిపోయాక…. అప్పటి సీఎం జగన్ తో వీధి పోరాటాల్లో భాగంగా, భువనేశ్వరి కూడా సోషల్ మీడియా వేధింపులకు బలి అయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ …భువనేశ్వరీని వ్యక్తిగతంగా కించపరుస్తూ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాలను కుదిపేసాయి. అసెంబ్లీలోనూ ఆమె పేరు చర్చకు వచ్చింది. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. తన భార్యను అవమానించిన కౌరవసభలో తానుండలేనని, తిరిగి ముఖ్యమంత్రి గానే అడుగు పెడతానని శపథం చేసి ఏపీ అసెంబ్లీ నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో కుమిలిపోతూ, చంద్రబాబు బోరున ఏడవటాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ…. వంశీ అన్న మాటలు నందమూరి కుటుంబాన్ని కూడా కదిలించాయి.

ఒకరకంగా ఎన్నడూ రాజకీయాల వైపు, టిడిపి వ్యవహారాల వైపు తలతిప్పి చూడని భువనేశ్వరికి ఆ సంఘటన కదలిక తెచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టిన సంఘటన భువనేశ్వరి ని రాజకీయాల వైపు నడిపించింది. చంద్రబాబు జైల్లో ఉన్నంతకాలం భువనేశ్వరి తాను రాజమండ్రి లోనే ఉంటూ ఆయనకు కావలసినవన్నీ ఏర్పాట్లు చేస్తూ, నిత్యం మీడియాతో, పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూ ఉండేవారు. ఒకానొక సమయంలో చంద్రబాబు కనుక ఎన్నికల వరకు జైలు నుంచి రాకపోతే… భువనేశ్వరీ కి పార్టీపగ్గాలు అప్పజెప్పి ఎన్నికల్లో ఆమెను జనంలో తిప్పాలని ప్రతిపాదన కూడా వచ్చింది. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో తరచూ మీడియాతో మాట్లాడుతూ…. సహజంగా ఉన్న బెరుకుని కూడా పోగొట్టుకున్నారు భువనేశ్వరి. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే నిజం గెలవాలి అనే నినాదంతో భువనేశ్వరి జనంలోకి యాత్ర చేశారు. ఈ యాత్రను ఆమె పొలిటికల్ అరంగేట్రం గా భావించవచ్చు. నిజం గెలవాలి యాత్ర సందర్భంగా, 13 జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ పార్టీ నాయకులను, సాధారణ మహిళలను కలుస్తూ చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని జనానికి చెబుతూ… ఊహించిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ సానుభూతిని కూడగట్టగలిగారు భువనేశ్వరి. చంద్రబాబు అంచనాలకు కూడా అందనంతగా జనంలోకి వెళ్లి పోయారు ఆమె. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా పార్టీకి పూర్తిస్థాయి ప్రచారం చేశారు. కుప్పం నియోజకవర్గం బాధ్యతలు భువనేశ్వరి స్వీకరించారు. ఆ సందర్భంగా చంద్రబాబు ఇంకెన్నాళ్లు… నేను పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అంటూ జనాన్ని ప్రశ్నించారు కూడా.ఎన్నికల్లో భువనేశ్వరి ప్రచారం కూటమికి చాలా కలిసి వచ్చింది.164 సీట్లతో చారిత్రక విజయం సాధించిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజు ప్రధాన మోడీ కూర్చున్న వేదికపైనే భువనేశ్వరి కూడా ఉన్నారు. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేదికపై భువనేశ్వరి మొదటిసారి హాజరయ్యారు.

అంతేకాదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కార్యాలయ బాధ్యతలు స్వీకరించిన రోజు కూడా ఆమె దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆ తర్వాత అన్న క్యాంటీన్ల ఓపెనింగ్ కి కూడా భువనేశ్వరి అధికార కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి అడపాదడపా ప్రభుత్వ కార్యక్రమాలన్నిటిలోనూ భువనేశ్వరి కనిపిస్తున్నారు. చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు. కమ్మ సామాజిక వర్గం ప్రముఖులు కూడా తరచూ ఆమెని కలుస్తూ గైడెన్స్ ఇస్తున్నారు. పాలన వ్యవహారాలు, పథకాలు పై ఆమె అవగాహన పెంచుకుంటున్నారు.
ఎప్పుడైనా అనివార్య లేదా అత్యవసర పరిస్థితులు వస్తే…. ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించడానికి, పార్టీ పగ్గాలు చేతిలోకి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారని పార్టీలోనే కొందరు చెప్తున్నారు. ఇప్పుడున్న కూటమి సర్కార్లో లోకేష్ కి ప్రభుత్వ పగ్గాలు ఇస్తే వ్యతిరేకత రావచ్చు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఉండగా లోకేష్ కు బాధ్యతలు ఎలా ఇస్తారంటూ కాపు సామాజిక వర్గంతో పాటు, ఎమ్మెల్యేలు అడ్డం తిరగవచ్చు. అదే భువనేశ్వరి అయితే అందరికీ ఆమోదయోగ్యం ఉంటుంది. ఇవన్నీ కేవలం అంచనాలు ఊహలు మాత్రమే. అయితే టిడిపిలో భువనేశ్వరి పేరిట మరో పవర్ సెంటర్ సిద్ధమైందనేది మాత్రం నిజం. భువనేశ్వరి సోదరి పురందేశ్వరి 10 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మొన్న కూడా కేంద్ర మంత్రి పదవి తృటిలో తప్పిపోయింది. ఇండియాలో అత్యంత సీనియర్ పొలిటీషియన్ , నాలుగు సార్లు ముఖ్యమంత్రి భార్య అయ్యుండి తానెందుకు ఇంటికి పరిమితమైపోవాలని భువనేశ్వరి అనుకొని ఉండొచ్చు. ఇప్పుడు హెరిటేజ్ బిజినెస్ మొత్తం లోకేష్ భార్య బ్రాహ్మణి చూసుకుంటున్నారు. భువనేశ్వరికి వ్యాపార బాధ్యతలు కూడా తగ్గిపోయాయి. ఆమె కేవలం హెరిటేజ్ డైరెక్టర్ గా మాత్రమే ఉన్నారు. ఇప్పుడు సమయం దొరికింది కనుక, అనుభవం కూడా వచ్చింది కనుక పార్టీ వ్యవహారాల పై పట్టు సాధిస్తే ఏ సమయంలోనైనా అక్కరకు రావచ్చని అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు భువనేశ్వరి.