Nara Lokesh: చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్ర లేదనుకుంటున్నా: నారా లోకేశ్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నన్ను కలవాలనుకుంటున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. దీంతో అమిత్ షాను కలిసి, ఆయనకు అన్ని విషయాలు వివరించా. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నట్లు చెప్పా. చంద్రబాబు భద్రత పరంగా ఉన్న ఆందోళన కూడా చెప్పా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 12, 2023 | 05:08 PMLast Updated on: Oct 12, 2023 | 5:08 PM

Nara Lokesh Met Amith Sha And Informed About Chandrababu Naidu Arrest

Nara Lokesh: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేసే విషయంలో బీజేపీ పాత్ర ఉందని తాను అనుకోవడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు అరెస్టు అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరించినట్లు లోకేశ్ చెప్పారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై వివరించేందుకు టీడీపీ నేత నారా లోకేశ్ బుధవారం రాత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షాతో చర్చించిన విషయాలను లోకేశ్ మీడియాకు వివరించారు.

“కేంద్ర హోంమంత్రి అమిత్ షా నన్ను కలవాలనుకుంటున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. దీంతో అమిత్ షాను కలిసి, ఆయనకు అన్ని విషయాలు వివరించా. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నట్లు చెప్పా. చంద్రబాబు భద్రత పరంగా ఉన్న ఆందోళన కూడా చెప్పా. సీఐడీ ఎందుకు పిలిచింది..? ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు. ఇవన్నీ పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసులే అని అమిత్ షాకు చెప్పాను. బీజేపీ పేరు చెప్పి కక్ష సాధిస్తున్నారని అమిత్ షా అన్నారు. అమిత్ షా వద్ద ఎలాంటి రాజకీయ విషయాలు చర్చకు రాలేదు. బీజేపీనే చేయిస్తోందని ఒక ఎంపీ, మంత్రి నేరుగా అన్నట్లు చెప్పాను. చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్ర ఉందని నేను అనుకోవట్లేదు. బీజేపీ నేతల మౌనంతో ఆరోపణలు వచ్చాయనుకుంటున్నా. నిజం వైపు ఉండాలని అమిత్ షాను కోరా. టీడీపీ ఎంపీలు ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాశారు. రాష్ట్రం నుంచి అమిత్ షా సమాచారం తీసుకున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.

అక్రమ కేసుపై వైసీపీ క్యాడర్‌లోనే అనుమానం ఉంది. 10 రోజులుగా కేసు విషయమై వైసీపీ మాట్లాడట్లేదు. స్కిల్ కేసు వెనుక ఏదో జరుగుతోంది. నా తల్లి ఐటీ రిటర్న్‌లు సీఐడీ చేతికి ఎలా వచ్చాయి..? నా తల్లి ఐటీ రిటర్న్‌లపై సీబీడీటీకి ఫిర్యాదు చేస్తా. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరంలోనే ఉన్నాం. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలిశా. మేం సుప్రీంలో సవాల్ చేసిన 17ఏ అంశం చాలా కీలకం. 17ఏ పరిగణనలోకి తీసుకోకుంటే చాలామంది ఇబ్బంది పడతారు. ఏపీలో బీజేపీ పేరు చెప్పి వైసీపీ కక్ష సాధిస్తోందని అమిత్ షా అన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక తాము లేమని స్పష్టంగా చెప్పారు. బీజేపీపై జగన్ నిందలు మోపుతున్నారన్నారు. ” అని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.