INNER RING ROAD SCAM: రింగ్‌ రోడ్డు కేసులో లోకేశ్‌ చేసింది ఇదే.. సీఐడీ మెమోలో సంచలన విషయాలు..

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేశ్‌ను ఏ14గా చేర్చిన సీఐడీ.. మెమోలో కీలక అంశాలు రాసుకొచ్చింది. హెరిటేజ్‌ సంస్థకు లాభం చేకూరేలా లోకేశ్ నిర్ణయాలు తీసుకున్నారని సీఐడీ అంటోంది. హెరిటేజ్ సంస్థలో ఈడీగా నారా బ్రహ్మణి, VC, MDగా నారా భువనేశ్వరి ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2023 | 07:42 PMLast Updated on: Sep 26, 2023 | 7:42 PM

Nara Lokesh Name In Cid Memo In Andhra Pradeshs Inner Ring Road Scam

INNER RING ROAD SCAM: స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. ఏపీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయ్. లోకేశ్ కూడా త్వరలో అరెస్ట్ అవడం ఖాయం అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు.. నిజం అయ్యేలా కనిపిస్తున్నాయ్ పరిణామాలు చూస్తుంటే! ఐతే అది స్కిల్ కేసులో కాదు.. ఇన్నర్‌ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌ చుట్టూ సీఐడీ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేశ్‌ను ఏ14గా చేర్చిన సీఐడీ.. మెమోలో కీలక అంశాలు రాసుకొచ్చింది.

హెరిటేజ్‌ సంస్థకు లాభం చేకూరేలా లోకేశ్ నిర్ణయాలు తీసుకున్నారని సీఐడీ అంటోంది. హెరిటేజ్ సంస్థలో ఈడీగా నారా బ్రహ్మణి, VC, MDగా నారా భువనేశ్వరి ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ కుటుంబానికి హెరిటేజ్‌లో 50శాతానికి పైగా షేర్లు ఉన్నాయ్. మంత్రి హోదాలో హెరిటేజ్ సంస్థకు ప్రయోజనం చేకూరే విధంగా లోకేష్ కుట్ర పన్నారని.. రాజధాని రావటానికి ముందే వేరే వ్యక్తులతో తుళ్లూరు, మందడంలాంటి ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేయించారని సీఐడీ తన మెమోలో తెలిపింది. భూములు కొనుగోలు చేసిన తర్వాత వ్యక్తుల నుంచి హెరిటేజ్ సంస్థ స్థలాలు తక్కువ ధరకు కొనుగోలు చేశారని.. 2017లో మంత్రి అయిన తర్వాత ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో ఈ స్థలాలు పోకుండా వాటి విలువ పెరిగేలా లోకేశ్ కుట్ర చేశారని సీఐడీ తెలిపింది.

చంద్రబాబును ప్రభావితం చేసి.. తన కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న హెరిటేజ్ సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేలా లోకేష్ కుట్ర చేసినట్టు సీఐడీ వివరించింది. ఈ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇదే కేసులో A1గా ఉన్న చంద్రబాబు.. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.