NARA LOKESH YUVAGALAM: లోకేశ్ పాదయాత్ర – ప్లస్సులు.. మైనస్సులూ..!
nara lokesh pada yatra
పాదయాత్ర.. ఇప్పుడు ఎటు చూసినా ట్రెండింగ్ గా మారింది. ఈ సంప్రదాయానికి తెరతీసిన వారు 1983లో సోషలిస్ట్ నాయకుడు చంద్రశేఖర్ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా కన్యాకుమారి నుండి ఢిల్లీ వరకు నాలుగు నెలల పాటు 4,200 కిలోమీటర్ల భారత్ పాదయాత్రను చేపట్టారు. ఆ తరువాత చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు సంక్షోభంలో ఉన్న సమయంలో వారికి అండగా ఉన్నానని దివంగతనేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో ప్రజాప్రస్థానం పేరుతో 1,470 కిలోమీటర్లు నడిచారు. మరో ప్రజాప్రస్తానం అంటూ వై ఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేపట్టారు. కానీ ఇది అధికారం కోసం కాదు. తన అన్న జైలులో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేయడం కోసం 2012 లో ప్రారంభించి 10 నెలల పాటూ 3112 కిలోమీటర్లు నడిచిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇక 2012 సంవత్సరంలో వస్తున్నా మీకోసం అంటూ నారా చంద్రబాబు నాయుడు 2817 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అటుపైన చంద్రబాబు పాలనలో తీవ్ర వ్యతిరేఖతను గుర్తించిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరుతో 2017లో యాత్రను ప్రారంభించి 3648 కిలోమీటర్లు ప్రజల్లో తిరిగారు. 2023 సంవత్సరంలో నారాలోకేష్ కూడా ఇదే బాటను ఎంచుకున్నారు. ఇక తెలంగాణలో వై ఎస్ షర్మిల కొత్తగా పార్టీ స్థాపించి అధికారమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. 2021లో ఆమె దశల వారీగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ బిజెపి ఎంపీ బండి సంజయ్ కూడా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో విడతల వారీగా పాదయాత్ర చేపడుతున్నారు. ఇందులో విజయాలు చాలా మందికి వరించాయి. భవిష్యత్తులో గెలుపుకోసం ప్రయత్నాలు చేసేవారూ ఉన్నారు.
పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రులు అయిపోతారా… అంటే సమాధానం అంతు చిక్కని ప్రశ్న. పాదయాత్రలు విజయవంతం కావాలంటే రెండు ప్రధానమైన అంశాలు ఉండాలి. ఒకటి తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత, మరొకటి ప్రజల్లో చరిష్మా ఉండాలి. సీనియర్ రాజకీయ నాయకులకు కొడుకులు ఉంటే వారిని ముందుకు తీసుకు వస్తారు. కొడుకులు లేకుంటే మాత్రమే కూతుర్లని పరిచయం చేస్తారు. నెహ్రూ ఇందిర, శరత్ పవార్ సుప్రియా సూలేను తీసుకొచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ వైఎస్ జగన్, కేసీఆర్ కేటీఆర్, తమిళనాడులో కరుణానిధి ఉదయ్ స్టాలిన్, మహారాష్ట్రలో బాల్ థాక్రే ఉద్దేవ్ థాక్రే, ఉద్దేవ్ థాక్రే ఆదిత్య థాక్రే, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్, ఉత్తరప్రదేశ్ లో ములాయాం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ ను రాజకీయ వారసులుగా తీసుకొచ్చారు. వీరందరినీ ఏదో ఒక ఉద్యమంలోనో లేకుంటే ప్రజా సమస్యల్లోనో పోరాటం చేసి నాయకునిగా మార్చారు.
కానీ చంద్రబాబు అలా చేయలేదు. నేరుగా ఎమ్మెల్సీ ఇచ్చి తన కేబినేట్ లో కూర్చోపెట్టారు. ఇది అప్పట్లో విమర్శలకు దారితీసింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని లోకేశ్ ను నేరుగా మంత్రిని చేయడంపై పార్టీలో కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోకేశ్ ఓడిపోయారు. దీన్నిబట్టి లోకేశ్ కు తండ్రి నుంచి వచ్చిన వారసత్వం తప్ప ప్రజాదరణ లేదని నిర్ధారణ అయింది.
అందుకే ఇప్పుడు లోకేశ్ ను జనంలోకి పంపారు చంద్రబాబు. ప్రజల్లోకి వెళ్లినప్పుడే క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుస్తాయి. రాజకీయ నాయకులకు ఇది చాలా అవసరం. లోకేశ్ విద్యాభ్యాసమంతా విదేశాల్లో జరిగింది. 2014 తర్వాతే లోకేశ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉంటున్నారు. కానీ తండ్రి చాటు బిడ్డగానే ఉండిపోయారు. అలా కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకోవాలంటే తనదైన పంథా అవలంబించడం అవసరం.
లోకేశ్ ను ప్రజలు ఆదరించాలంటే ప్రజల్లోకి వెళ్లక తప్పని పరిస్థితి. టీడీపీకి భవిష్యత్ నాయకుడిగా లోకేశ్ ను తీర్చిదిద్దాలంటే ప్రజాసమస్యలపై పూర్తిపట్టు ఉండాలి. అంతేకాక.. పార్టీ కేడర్ కూడా లోకేశ్ సమర్థుడని నమ్మాలి. అప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది. లోకేశ్ కు ఆదరణ పెరుగుతుంది. ఇప్పుడు లోకేశ్ అందుకు సిద్ధమయ్యారు. యువగళం పేరుతో పాదయాత్రకు బయలుదేరారు. పాదయాత్ర లోకేశ్ ను సీఎం సీటులో కూర్చోబెడుతుందా.. లేదా అనేది వేరే సంగతి. కానీ లోకేశ్ ను తనను తాను నిరూపించుకునేందుకు ఒక చక్కటి అవకాశం దొరుకుతుంది. దీన్ని సమర్థంగా లోకేశ్ వాడుకోగలగితే కచ్చితంగా భవిష్యత్తులో మంచి లీడర్ గా గుర్తింపు పొందుతారు.