Kerala BJP: కేరళలో బీజేపీకి సపోర్ట్ గా క్రిస్టియన్ పార్టీ..!?  

క్రైస్తవ, హిందూ ఓటు బ్యాంకును కూడగట్టి 2024 పోల్స్ లో కేరళలో మంచి ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం చకచకా పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి పడే మైనారిటీ ఓట్లను చీల్చి క్రైస్తవులను తమవైపు ఆకర్షించవచ్చని బీజేపీ భావిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 4, 2023 | 08:45 PMLast Updated on: Aug 04, 2023 | 8:45 PM

Nationalist Progressive Party Is Going To Work With Bjp In Kerala

దక్షిణాదిలో కొరకరాని కొయ్యగా మారిన కేరళపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 27 శాతం ముస్లింలు, 18 శాతం క్రైస్తవులు కలిగిన కేరళలో హిందూ ఓటర్లను ఆకర్షించడంలో కమల దళం విఫలమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతాను తెరవడంలోనూ విఫలమైంది. కనీసం 2024 లోక్‌సభ ఎన్నికలలోనైనా ఆ రాష్ట్రంలో బోణీ కొట్టాలని  బీజేపీ ఉవ్విళ్లూరుతుంది.  27 శాతం ముస్లిం ఓటర్లు వామపక్షాలు, కాంగ్రెస్, ముస్లిం లీగ్ వైపే ఉన్నాయి. దీంతో క్రైస్తవ ఓట్లపై బీజేపీ దృష్టిపెట్టింది. ఈక్రమంలోనే కమల దళం ప్రోత్సాహంతో  ఏప్రిల్ 22న ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది.  దానిపేరు.. నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌పీపీ).  రాష్ట్రంలోని క్యాథలిక్ ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని ఈ పార్టీ ఏర్పడింది. జాతీయ మైనారిటీ కమిషన్ మాజీ సభ్యుడు వీవీ అగస్టిన్ ఈ పార్టీ ఛైర్మన్‌గా ఉన్నారు.

కాంగ్రెస్‌ కు పడే మైనారిటీ ఓట్లను చీల్చి.. 

కాంగ్రెస్‌ పార్టీకి పడే మైనారిటీ ఓట్లను చీల్చి క్రైస్తవులను తమవైపు ఆకర్షించవచ్చని బీజేపీ భావిస్తోంది. 2022లో గోవా పోల్స్ లో  క్రైస్తవులు క్లియర్ కట్ గా బీజేపీ వైపే మొగ్గు చూపారు. అక్కడ బీజేపీ ఎన్నికల బరిలోకి దింపిన అభ్యర్థుల్లో 30 శాతం మంది క్రిస్టియన్లే ఉన్నారు. కాథలిక్ క్రిస్టియన్ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్న దక్షిణ గోవాలో బీజేపీ పెద్దసంఖ్యలో సీట్లను గెల్చుకుంది. ఇటీవల క్రైస్తవులు అధికంగా ఉన్న నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో కూడా మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్రాల్లో క్రైస్తవులను అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయిన బీజేపీ.. ఇప్పుడు కేరళపైనా పట్టు సాధించాలనే కృత నిశ్చయంతో ఉంది. ఈక్రమంలోనే తెర వెనుక ఉండి..  కేరళ క్యాథలిక్ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తూ కొత్త రాజకీయ పక్షం  “నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ”ని  బీజేపీ ఏర్పాటు చేయించిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వచ్చే పోల్స్ లో బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధమని.. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశానికి మేలు జరుగుతోందని  “నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ” నేతలు పదేపదే చెబుతున్నారు.

టార్గెట్ తిరువనంతపురం.. ఎందుకు ?

కేరళ రాజకీయాలను కాథలిక్ క్రైస్తవులు చాలా ప్రభావితం చేయగలరు. రాష్ట్రంలోని 14 జిల్లాలకుగానూ 9 జిల్లాలలో వీరి ప్రాబల్యం అత్యధికంగా ఉంది. తిరువనంతపురంలో ఏకంగా 37 లక్షల మంది క్యాథలిక్ ఓటర్లు ఉన్నందున.. అక్కడి నుంచి ఎంపీగా ఎవరు ఎన్నికవుతారు అనేది కాథలిక్ క్రైస్తవ ఓటర్లే డిసైడ్ చేస్తారు.  “నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ”తో కలిసి  వచ్చే పోల్స్ లో  తిరువనంతపురం ఎంపీ స్థానాన్ని,  దాని పరిధిలోని 7   అసెంబ్లీ  సీట్లను  గెలుచుకోవాలని కమలదళం ప్రణాళిక రచిస్తోంది.  క్రైస్తవులకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగానే ఇటీవల కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కేటాయించింది. గత ఏడాది  పలు క్రైస్తవ సంఘాలు, కొన్ని చర్చిలు లవ్ జిహాద్ పై చేసిన ప్రకటనలకు కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు బహిరంగ మద్దతును ప్రకటించాయి. తద్వారా వారికి చేరువయ్యే ప్రయత్నం చేశాయి.  క్రైస్తవ, హిందూ ఓటు బ్యాంకును కూడగట్టి 2024 పోల్స్ లో కేరళలో మంచి ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం చకచకా పావులు కదుపుతోంది.