Nawaz Sharif: పాక్ రాజకీయాల్లోకి మళ్లీ నవాజ్ షరీఫ్…! కాబోయే ప్రధాని ఆయనేనా ?
ఆర్థిక గండం నుంచి గట్టెక్కే విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంలో తాత్సారం చేస్తున్నఅధికార కూటమి.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు మాత్రం ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తోంది.
Nawaz Sharif: ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాక్ రాజకీయాలో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దేశం ఆర్థికంగా దివాళా తీసి అప్పులు కూడా కట్టలేని గడ్డు పరిస్థితులు వెంటాడుతున్నా సరే పాక్ రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల వ్యూహాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాయి. ఆర్థిక గండం నుంచి గట్టెక్కే విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంలో తాత్సారం చేస్తున్నఅధికార కూటమి.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు మాత్రం ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తోంది. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చుట్టూ అవినీతి ఉచ్చు బిగుసుకోవడం, ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం, పాక్ మిలటరీ కూడా ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా మారడంతో ఈ పరిణామాలన్నంటినీ రాజకీయంగా వాడుకునేందుకు వివిధ పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి.
దుబాయ్ వేదికగా కథ స్క్రీన్ ప్లే
అవినీతి కేసుల్లో శిక్ష పడి మెడికల్ కారణాలతో లండన్‌లో ఉంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి పాక్ పాలిటిక్స్‌లో కీ రోల్ ప్లే చేయాలని భావిస్తున్నారు. లండన్‌లో ప్రవాస జీవితం గడిపిన ఆయన కొన్ని రోజుల క్రితం దుబాయ్ చేరుకున్నారు. తాను మళ్లీ పాక్‌లో అడుగు పెట్టకుండా ఉన్న అడ్డంకులను తొలగించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇంతకాలం విదేశాల్లో ఉండి తన సోదరుడు, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ద్వారా రాజకీయాన్ని నడిపించిన నవాజ్ షరీఫ్ మరోసారి పాక్ పగ్గాలు చేపట్టాలని కలలు కంటున్నారు. ఇప్పటికే మూడు సార్లు పాక్ ప్రధానిగా పనిచేసిన అనుభవం ఉన్న నవాజ్ నాలుగోసారి ఇస్లామాబాద్‌లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం పాక్‌లో నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎంల్ -ఎన్ పార్టీ, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది. ఈ పార్టీని నడిపిస్తున్న జర్దారీ, బిలావల్ భుట్టో కూడా దుబాయ్‌లో నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపారు.
అసెంబ్లీ తీర్మానం వెనుక షరీఫ్ వ్యూహం
వారం రోజుల క్రితం పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ ఒక సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎలక్షన్ అమెండ్‌మెంట్ 2023 పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా ఎన్నికల్లో పోటీ చేయకుండా అమలులో ఉన్న అనర్హత కాలాన్ని ఐదేళ్లకు కుదించేశారు. పనామా సహా వివిధ అవినీతి కేసుల్లో దోషిగా తేలడంతో 2017లో సుప్రీంకోర్టు నవాజ్ షరీఫ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించింది. దీంతో ఆయన పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డు పడిపోయింది. ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న అధికార కూటమి నవాజ్ షరీఫ్‌కు లైన్ క్లియర్ చేసేందుకు సవరణ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో మరో కీలక మార్పు కూడా చేశారు. ఇకపై పాక్ అధ్యక్షుడితో సంప్రదింపులు జరపకుండానే కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించవచ్చు.
నవాజ్ షరీఫ్ రాజకీయం వెనుక..?
ప్రస్తుతం నవాజ్ షరీఫ్ వయస్సు 73 ఏళ్లు. కేసులు, అనర్హత వేటు కారణంగా రాజకీయాల నుంచి ఆయన ఎప్పుడో రిటైర్ అయిపోయారు. పార్టీ సుప్రీం లీడర్‌గా కొనసాగుతున్నప్పటికీ రోజు వారీ రాజకీయాల్లో ఆయన తెరముందు ఎలాంటి పాత్ర పోషించడం లేదు. ఇలాంటి సమయంలో నవాజ్ షరీఫ్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లో కి రావాలనుకోవడం వెనుక చాలా కారణాలున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి దించి అధికారాన్ని షేర్ చేసుకోవడంలో పీఎంఎల్-ఎన్, పీపీపీ కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం పాక్ రాజకీయం మొత్తం ఇమ్రాన్ వర్సెస్ ఇతర పార్టీలు అన్నట్టుగా మారిపోయింది. ఇమ్రాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ ఏడాది మే 9న జరిగిన విధ్వంసకర ఘటనల వరకు అన్నీ పాక్ రాజకీయాల్లో పెనుమార్పులకు కారణమయ్యయి. తనను రాజకీయంగా భూస్థాపితం చేసేందుకే ప్రత్యర్థి పార్టీలు, సైన్యంతో కలిసి కుట్ర పన్నాయని ఇమ్రాన్ భావిస్తున్నారు. ప్రస్తుతానికి తనను అధికారానికి దూరం చేసినా మరో మూడు నాలుగు నెలల్లో జరగనున్న జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా పాక్ ప్రజల్లో మాత్రం ఆయనపై సానుభూతి ఉంది. దేశ వ్యాప్తంగా ఈ మధ్య నిర్వహించిన సర్వేలో ఇమ్రాన్ ఖాన్‌పై 61 శాతం ప్రజలు పాజిటివ్‌గా ఉన్నారు. ఆయనే మళ్లీ ప్రధాని కావాలని కూడా మెజార్టీ పాక్ ప్రజలు కోరుకుంటున్నట్టు సర్వే ప్రకటించింది.
ఇమ్రాన్‌కు ఆదరణ.. పాలక పక్షానికి బ్యాడ్ టైమ్
ఇమ్రాన్ ఖాన్‌కు దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉండటం ఒక్కటే కాదు.. అధికార కూటమి నేతలకు మింగుడు పడని అంశాలు చాలా ఉన్నాయి. నవాజ్ షరీఫ్‌పై వేటు పడి ఆయన విదేశాలకు వెళ్లిపోవడంతో పీఎంఎల్-ఎన్ పార్టీలో కీలక నేతగా తెరపైకి వచ్చిన షరీఫ్ సోదరుడు, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై పాక్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన విధానాలను దేశ ప్రజలు ఆమోదించడం లేదు. ఇమ్రాన్‌పై పూర్తి సానుభూతితో ఉన్న దేశ ప్రజలు షెహబాజ్ షరీఫ్ విషయంలో మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆయన అప్రూవల్ రేటింగ్ 36 శాతం కంటే దిగువన ఉంది. మరోసారి ఆయన్ను ప్రధానిగా అంగీకరించేందుకు పాక్ ప్రజలు ఎంత మాత్రం సిద్దంగా లేరని సర్వేలను బట్టి అర్థమవుతోంది. ఇక అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.
ఆ పార్టీ అధినేత జర్దారీ, ఆయన కుమారుడు, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో పైనా పాక్ ప్రజలు అంత నమ్మకంగా లేరు. ఏ రకంగా చూసినా ప్రస్తుత పాలక పక్షంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. నేషనల్ అసెంబ్లీ గడువు ఆగస్టుతో ముగుస్తుండటంతో ఏ క్షణమైనా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. దీంతో తమపై ఉన్న వ్యతిరేకత ఓట్ల రూపంలో ప్రతికూలంగా మారకముందే జాగ్రత్త పడుతున్నారు. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన అనుభవం ఉన్న నవాజ్ షరీఫ్‌ను మరోసారి ఎన్నికల్లో నిలబెడితే తమ కూటమికి విజయావకాశాలు మెరుగుపడతాయని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత విదేశాల్లో ఉంటూ రాజకీయాలకు దూరమైన నవాజ్ షరీఫ్ మళ్లీ పాక్‌ను తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని ఆశపడుతున్నారు. అందుకే లండన్ టు ఇస్లామాబాద్ వయా దుబాయ్ పొలిటికల్ బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసుకుంటున్నారు.