NDA vs Opposition: పోటాపోటీ భేటీలు.. ఒకేరోజు ప్రతిపక్షాలు, ఎన్డీయే కూటమి సమావేశం.. ఎవరిది పైచేయి..?

ప్రతిపక్షాలను కలిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే, బీజేపీ కూడా మిత్రపక్షాలకు ఆహ్వానం పలుకుతోంది. మంగళవారం ఎన్డీయే కూటమి సమావేశం నిర్వహించబోతుంది. అయితే, ప్రతిపక్షాల కూటమి సమావేశం కూడా అదే రోజు జరుగుతుండటం విశేషం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 17, 2023 | 12:44 PMLast Updated on: Jul 17, 2023 | 12:44 PM

Nda Vs Opposition Mega Show Of Strength Tomorrow

NDA vs Opposition: పార్లమెంట్ ఎన్నికలకు మరో ఏడాది కూడా సమయం లేనందున రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. దీంతో జాతీయ రాజకీయాలు కూడా ఆసక్తిగా మారుతున్నాయి. మొన్నటివరకు వార్ వన్ సైడే అని భావించిన బీజేపీకి.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు షాక్ ఇచ్చింది. ఇదే ఊపులో కాంగ్రెస్.. ప్రతిపక్షాలను కలిపేందుకు ప్రయత్నిస్తుంటే, బీజేపీ కూడా మిత్రపక్షాలకు ఆహ్వానం పలుకుతోంది. మంగళవారం ఎన్డీయే కూటమి సమావేశం నిర్వహించబోతుంది. అయితే, ప్రతిపక్షాల కూటమి సమావేశం కూడా అదే రోజు జరుగుతుండటం విశేషం. ప్రతిపక్షాల కూటమి సమావేశానికి ప్రాధాన్యం దక్కకూడదనే ఉద్దేశంతోనే, అదే రోజు ఎన్డీయే సమావేశాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల ద్వారా అటు బీజేపీ.. ఇటు ప్రతిపక్షాలు ఏం సాధించబోతున్నాయి.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఈ లోపే ఐక్యత సాధించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కలిసికట్టుగా ఉంటేనే పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఎదుర్కోవచ్చు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు 8-9 నెలల సమయం మాత్రమే ఉంది. అందుకే బలం పెంచుకునేందుకు ప్రతిపక్షాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి ప్రయత్నిస్తున్నాయి. తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఒకే కూటమిగా మారేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం పరిస్థితులు అంతగా అనుకూలంగా లేనందున ఒంటరిగా పోటీ చేయడంకంటే.. ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తేనే గెలుపు సాధ్యమవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం పాత మిత్రులతోపాటు, కొత్త మిత్రులను కూడా ఎన్డీయే కూటమిలో చేర్చుకోవాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ నెల 18, మంగళవారం ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశం జరుగుతుంది. ఇక కర్ణాటకలోని బెంగళూరులో నేటి (సోమవారం) సాయంత్రం నుంచి ప్రతిపక్షాల కూటమి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం మంగళవారం కూడా జరుగుతుంది. ప్రతిపక్షాల సమావేశానికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుంటే, ఎన్డీయే కూటమికి బీజేపీ సారథ్యం వహిస్తోంది. ఎన్డీయే భేటీకి మోదీ హాజరయ్యే అవకాశం ఉండగా, ప్రతిపక్షాల భేటీకి సోనియా గాంధీ హాజరవుతారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్.. ఎవరికి వాళ్లు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు.
ఎన్డీయేలో 30 పార్టీలు..
ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో 30 వరకు పార్టీలున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌కు చెంది భారతీయ సమాజ్ పార్టీ కూడా ఎన్డీయే కూటమిలో చేరింది. ఆ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీకి సంబంధించి జనసేనకు కూడా ఎన్డీయే కూటమి సమావేశానికి ఆహ్వానం అందింది. టీడీపీకి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. మరోవైపు ఏపీలో వైసీపీ కూడా ఎన్డీయేకు మద్దతుగానే ఉంది. కూటమిలో చేరకపోయినప్పటికీ, బీజేపీ ప్రభుత్వానికి అన్నివిధాలుగా మద్దతు ఇస్తుంది. వీలైనన్ని చిన్న పార్టీలను కూడా కలుపుకొని, ఓటు బ్యాంకు పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందువల్ల ప్రాంతీయ పార్టీలకు కూడా ఈసారి ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతిపక్షాల కూటమిని బలంగా ఎదుర్కోవాలంటే మిత్రపక్షాల్ని కలుపుకొని వెళ్లడమే సరైన మార్గమని బీజేపీ అంచనావేస్తోంది. ముఖ్యంగా దక్షిణాది పార్టీలపై బీజేపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఎన్డీయే సమావేశానికి బిహార్‌కు చెందిన చిరాగ్ పాశ్వాన్ (లోక్ జనశక్తి పార్టీ-రాంవిలాస్), ఉపేంద్రసింగ్ కుశ్వాహా (రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ), జితన్ రామ్ మాంఝీ (హిందుస్థాన్ అవామ్ మోర్చా), ముకేష్ సహానీ (వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ)లు కూడా హాజరవ్వబోతున్నాయి. ఈ సమావేశానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా అధ్యక్షత వహిస్తారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఎన్డీయే నేతలు హాజరవుతారు.
ఓబీసీలకు దగ్గరయ్యేలా
కొంతకాలంగా దూరమవుతున్న ఓబీసీలు, దళితుల ఓట్లే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా యూపీలో ఆ వర్గాలకు అత్యంత దగ్గరైన రాజ‌్‌భర్‌ను ఎన్డీయే కూటమిలో చేర్చుకుంది. అందుకే ఆయా వర్గాలకు చెందిన నేతలు, పార్టీలపై ప్రత్యేకదృష్టి పెట్టింది. దళితులు, ఓబీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోందంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు దీనిద్వారా ధీటుగా బదులివ్వాలని, ఆ వర్గం ఓటర్లను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ముఖ్యంగా బిహార్, యూపీ వంటి చోట్ల వీరి ఓట్లు చాలా కీలకం. మరోవైపు కాంగ్రెస్ ఆ వర్గం వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఓబీసీకి చెందిన సిద్ధరామయ్యను కర్ణాటక సీఎంను చేసింది కాంగ్రెస్. దీనిద్వారా ఈ విషయంలో కాంగ్రెస్ ముందుంది. మరోవైపు ఓబీసీ జనగణన విషయంలో బీజేపీ ఏమాత్రం స్పందించడం లేదు. ఓబీసీలు, దళితుల అంశం తాజా రాజకీయాల్లో కీలకాంశం కానుంది.
ప్రతిపక్ష కూటమిలో 24
ప్రతిపక్షాలకు సంబంధించి 24-26 పార్టీలు జట్టు కట్టబోతున్నాయి. ఇంకా చర్చలు ప్రాథమిక దశలోనే ఉంది. ఇప్పటికే ఒకసారి పాట్నాలో సమావేశంకాగా, మంగళవారం జరిగే భేటీ తర్వాత కూటమిపై మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుత కాంగ్రెస్‌తో కలిసేందుకు ఆమ్ ఆద్మీ కొంత సానుకూలంగానే ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల భేటీ జరుగుతుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ‌్‌దీప్ సూర్జేవాలా ఆధ్వర్యంలో ఈ సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ (సీఎం కేజ్రీవాల్)తోపాటు తృణమూల్ కాంగ్రెస్ (సీఎం మమతా బెనర్జీ), బిహార్‌కు చెందిన జేడీయూ (సీఎం నితీష్ కుమార్), ఆర్జేడీ (లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్), తమిళనాడుకు చెందిన డీఎంకే (సీఎం స్టాలిన్), ఝార్ఖండ్ నుంచి జేఎంఎం (సీఎం హేమంత్ సోరెన్), మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ (శరద్ పవార్), ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే, సంజయ్ రౌత్, ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్ఎస్పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (మణి), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్) పార్టీలతోపాటు, మరికొన్ని పార్టీలకు చెందిన నేతలు హాజరవుతారు. బీజేపీ విధానాలపై పోరాడటంతోపాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీలను బీజేపీ ఎలా కూలుస్తుంది అనే అంశంపై ప్రతిపక్షాలు చర్చలు జరుపుతాయి. అలాగే బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ఉమ్మడి ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది.
ఎవరి బలం ఎంత..?
ప్రస్తుతానికి అధికార ఎన్డీయే కూటమి బలంగానే ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల పుంజుకుంటోంది. దీంతో ఎన్డీయే మిత్రపక్షాలను కలుపుకొని బీజేపీ, ప్రతిపక్షాలను కలుపుకొని కాంగ్రెస్ బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ప్రతిపక్షాల ఐక్యత విషయంలోనే అనేక సందేహాలున్నాయి. ఆ పార్టీల మధ్య కొన్ని అంశాల్లో విబేధాలున్నాయి. వాటిని పరిష్కరించుకోవాలి. అలాగే ప్రతిపక్షాల కూటమికి నేతృత్వం వహించే పార్టీ ఏది..? అధ్యక్షుడు లేదా కన్వీనర్ ఎవరు..? వంటి విషయాలు తేలాలి. అప్పుడే ప్రతిపక్షాల కూటమి సమావేశానికి అర్థం ఉంటుంది. లేదంటే ఎన్డీయే కూటమిదే పై చేయి అవుతుంది.