నిర్లక్ష్యమే కొంప ముంచింది..

ఏవి వరద నీళ్లో.. ఎవరి కన్నీళ్లో అర్థం కాని పరిస్థితి విజయవాడలో ! ఒక్కరాత్రి.. ఒక్క వర్షం.. ఒక్క నది.. ఒక్క వరద.. బెజవాడ బతుకులను రోడ్డు మీద పడేసింది. కంటిచూపు మేర ఎటు చూసినా వరద నీరే.. ఎక్కడ విన్నా ఆర్తనాదమే.. ఎవరిని కదిలించినా కన్నీళ్లే ! బుడమేరు వాగు కన్నెర్ర చేయడంతో..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 2, 2024 | 05:03 PMLast Updated on: Sep 02, 2024 | 5:03 PM

Negligence Has Sunk The Horn

ఏవి వరద నీళ్లో.. ఎవరి కన్నీళ్లో అర్థం కాని పరిస్థితి విజయవాడలో ! ఒక్కరాత్రి.. ఒక్క వర్షం.. ఒక్క నది.. ఒక్క వరద.. బెజవాడ బతుకులను రోడ్డు మీద పడేసింది. కంటిచూపు మేర ఎటు చూసినా వరద నీరే.. ఎక్కడ విన్నా ఆర్తనాదమే.. ఎవరిని కదిలించినా కన్నీళ్లే ! బుడమేరు వాగు కన్నెర్ర చేయడంతో.. విజయవాడ నగరం మునిగిపోయింది. బుడమేరు.. లక్షలాది మందిని వరద బాధితులుగా మిగిల్చింది. కృష్ణమ్మ ఉగ్రరూపం ఒకవైపు.. బుడమేరు కన్నెర్ర మరోవైపు.. బెజవాడ బెంబేలెత్తిపోతోంది.

ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఐతే 30ఏళ్లలో ఎప్పుడూ విలయం.. విజయవాడను చుట్టుముట్టింది. మానవ తప్పిదాలతో పాటు ప్రభుత్వం నిర్లక్ష్యం.. ఈ విలయానికి కారణంగా కనిపిస్తోంది. బుడమేరు వాగు ప్రళయం వెనక సంచలన కారణాలు వెలుగుచూస్తున్నాయ్. బెజవాడను బుడమేరు ముంచేయడం వెనక.. ముమ్మాటికీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం వైఫల్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నిజానికి వర్షాలు, వరదలపై.. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.

అన్ని జలాశయాల వివరాలు.. నీటి మట్టాల గురించి ప్రకటనలు చేస్తూనే ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల.. ఇలా ప్రతీ ప్రాజెక్ట్ నీటిమట్టంపై వివరాలను చెప్పడంతో పాటు.. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ సూచనలతో.. ఎక్కడ ఎంత వర్షపాతం అనేది క్లియర్‌గా అర్థం అయింది కూడా ! అలాంటపుడు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం వైపు నుంచి వస్తున్న మున్నేరు వరద ఎంత.. నూజివీడు, తిరువూరు, మైలవరం వైపు నుంచి బుడమేరుకి వస్తున్న వరద ఎంత అనే దానిపై అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా బుడమేరు కన్నెర్ర చేసింది.

ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని ఒక్కసారిగా విడుదల చేయడం అంటే.. అధికారుల వైఫల్యానికి ఇంతకుమించిన సాక్ష్యం ఉంటుందా.. శుక్రవారం భారీ వర్షం కురిసింది.. శనివారం బుడమేరు తెగింది. ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినా.. అధికారులు జనాలను అప్రమత్తం చేశారా అంటే అదీ లేదు. అలర్ట్ చేసి ఉంటే.. లక్ష కుటుంబాలు, 3లక్షల మంది జనాలు అంధకారంలో ప్రాణాలు అరచేత పట్టుకుని కాలం వెళ్లదీసేవారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్‌. వరదలో ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా ఏ అధికారి అయినా ప్రజాప్రతినిధి అయిన స్పందించారా అంటే.. అదీ లేదు.

నీటితో మునిగిపోయాక వచ్చారు అందరూ ! మొసలి కన్నీరు కార్చడానికి. సీఎం చంద్రబాబు రంగంలోకి దిగితే తప్ప.. అధికారుల్లో కదలికి రాలేదు. చంద్రబాబు వచ్చే వరకు బాధితులకు మంచినీరు, ఆహారం ఇవ్వాలనే ఆలోచన కూడా అధికారులకు రాలేదు. సీఎం వచ్చాక.. అప్పుడు సహాయక చర్యలు మొదలయ్యాయ్‌. తమ వల్ల కాదని చేతులెత్తేసి.. స్వచ్ఛంద సంస్థలకు చెప్పినా.. కనీసం సోమవారం ఉదయానికైనా నీరు, అహారం అందేది కదా… బురదలో నడుస్తూ.. మోకాళ్ల లోతు నీటిలో పర్యటిస్తూ చేతులూపుతూ ప్రచారం కోసం పాకులాడే రాజకీయ నేతలు ఏమయ్యారు.. జనాలను కనీసం అప్రమత్తం చేసి ఉంటే.. బెజవాడ జనం వరద్లో రాత్రి జాగారం చేసేవారు కదా. అది విజయవాడ కాదు.. విలయవాడ. జనాల కష్టాలు తలుచుకుంటేనే ప్రతీ ఒక్కరి గుండె తరుక్కుపోతోంది. పెరుగుతున్న వరద, బతుకుతామో లేదోననే భయం, ఆవేదన, చుట్టూ చీకట్లు, తిండి లేదు, బాధ వినేవాళ్లు లేరు.. ఇదీ సీఎం వచ్చేంతవరకు.. బెజవాడవాసుల బతుకు.. ఒక్కటి మాత్రం నిజం.. విజయవాడ వరదకు.. ఆ వరదలో కలిసిన జనాల కన్నీళ్లకు.. అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం అన్నది.. వందకు వందశాతం నిజం.