PM MODI: మోదీ ప్రభుత్వంపై రెండో అవిశ్వాసం.. 15సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నదెవరో తెలుసా..?
తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు అంతా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్న వారే. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, వీపీ సింగ్, చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్, దేవగౌడ, వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్, 2018లో చివరిసారిగా నరేంద్ర మోడీ అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు.
PM MODI: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రధానిగా మోదీ ఎదుర్కోనున్న రెండో అవిశ్వాస తీర్మానం ఇది. దేశంలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం కొత్తేం కాదు. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు అంతా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్న వారే. ఒక్క చౌదరి చరణ్‌సింగ్‌కు మాత్రమే మినహాయింపు. మొదటిసారిగా 1963లో దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోవడంతో అప్పటి నెహ్రూ ప్రభుత్వంపై ఆచార కృపలానీ 1963లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తొలి తీర్మానం వీగిపోయింది. కాకపోతే నాలుగు రోజులపాటు 21 గంటలు చర్చ జరిగింది. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి మూడుసార్లు, ఆపై ఇందిరాగాంధీ అత్యధికంగా 15సార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు. వీరితోపాటు వీపీ సింగ్, చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్, దేవగౌడ, వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్, 2018లో చివరిసారిగా నరేంద్ర మోడీ అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు 27 సార్లు అవిశ్వాస తీర్మానాలు జరిగాయి. దేశ రాజకీయ చరిత్రలో గత మూడు దశాబ్దాల్లో నాలుగు అవిశ్వాస తీర్మానాలున్నాయి. 1993 జూలైలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేతపై విపక్షాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అందులో ఆయన నెగ్గారు. ఇక 1999లో ఒక ఓటు తేడాతో వాజ్‌పేయి అధికారం కోల్పోయారు. 2009 జూలైలో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఆయన ప్రభుత్వం పూర్తి మెజార్టీతో నెగ్గింది. చివరగా 2018లో మోడీ మొదటిసారి ప్రధానిగా అవిశ్వాసాన్ని ఎదుర్కొని విజయం సాధించారు. ఇప్పుడు రెండోసారి అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. ఇది దేశ రాజకీయ చరిత్రలో ఇది 28వ అవిశ్వాస తీర్మానంగా రికార్డు కెక్కనుంది. ఈ తీర్మానంలో కూడా మోడీ ప్రభుత్వం సులభంగా విజయం సాధించబోతుంది. మోడీ ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ ఉంది. అవిశ్వాస తీర్మానాల్లో ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ప్రభుత్వాలు కూలిపోయాయి.
1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం.. 1999లో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వాలు కుప్పకూలాయి. వీటిల్లో వాజపేయి ప్రభుత్వమైతే ఒక్క ఓటు తేడాతో పడిపోయింది. తీర్మానాల విషయంలో రెండు కీలక అంశాలు ఉన్నాయి. ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టేది అవిశ్వాస తీర్మానమైతే.. అధికారపార్టీయే సభా విశ్వాసం కోరుతూ పెట్టే తీర్మానం రెండోది. తీర్మానం ఏదైనా.. లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరగడం ఖాయం. సభలో ప్రాతినిథ్యం ఉన్న పార్టీల సంఖ్యాబలం ఆధారంగా టైమ్ కేటాయిస్తారు సభాపతి. ఆ టైమ్‌లోనే ఆ పార్టీ నుంచి ఎంత మంది మాట్లాడతారో ఫిక్స్ చేసుకోవాలి.