Nellore Politics: వేడెక్కుతున్న నెల్లూరు రాజకీయం.. టీడీపీవైపు కోటంరెడ్డి, ఆనం.. వైసీపీకి చెక్ పడేనా..?

వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 10, 2023 | 03:10 PMLast Updated on: Jun 10, 2023 | 3:10 PM

Nellore Politics Ysrcp Rebel Mlas Are Joining Tdp It Will Effect Ysrcp

Nellore Politics: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీకి చెందిన నేతలు టీడీపీవైపు చూస్తున్నారు. వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన ఈ ముగ్గురూ టీడీపీలో చేరితే.. వైసీపీకి గట్టి షాక్ తప్పదు.
నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే, వీరికి వైసీపీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పార్టీ పదవుల్లోనూ, మంత్రి పదవుల్లోనూ మొండిచేయి చూపారు. దీంతో కొంతకాలం నుంచి వీరు సీఎం జగన్, వైసీపీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ పెద్దలు కూడా వీరి ఆవేదనను పట్టించుకోలేదు. దీంతో వైసీపీపై తిరుగుబావుటా ఎగరేశారు. ఇది వైసీపీ అధిష్టానానికి మరింత ఆగ్రహం తెప్పించింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే కారణంతో వీరిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. దీంతో వైసీపీకి, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు పూర్తిగా దూరం పెరిగింది. ఈ క్రమంలో ఇతర పార్టీలవైపు చూశారు. దీంతో వీరిని తమ పార్టీలోకి తీసుకునేందుకు టీడీపీ ఆసక్తి చూపించింది. టీడీపీ ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈ నేతలు ఆ పార్టీలో చేరడం ఖాయంగా మారింది.
ఆనం, మేకపాటి ప్రకటనలు
టీడీపీలో చేరబోతున్నట్లు ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాజాగా ప్రకటించారు. జిల్లాలో నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రను స్వాగతిస్తామన్నారు. ఈ పాటికే ఈ అంశంపై లోకేష్‌తో ఇద్దరూ చర్చలు జరిపారు. దీంతో త్వరలోనే ఈ ఇద్దరూ పసుపు కండువా కప్పుకోబోతున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వడం లేదని ముఖంమీదే జగన్ చెప్పేశారని మేకపాటి చెప్పారు. ఆయనను కలిసేందుకు ఎంతో ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదన్నారు. టీడీపీ టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తానని, లేకుంటే ఆ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని మేకపాటి అన్నారు.ఇక మిగిలింది.. కోటం రెడ్డి. ఆయన కూడా దాదాపు టీడీపీలో చేరడం ఖాయం. కానీ, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నిజానికి ఇటీవల కోటంరెడ్డి.. సీఎం జగన్‌ను కలిశారు. పార్టీ కోసం కలిసి పని చేయాల్సిందిగా జగన్ కోరారు. అయితే, ఏమైందో.. ఏమో కోటంరెడ్డి మాత్రం టీడీపీవైపే చూస్తున్నారు.
వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదా?
నెల్లూరు జిల్లాలోని ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీ వెళ్తుండటంతో వైసీపీకి జిల్లాలో ఎదురుదెబ్బ తప్పడం లేదు. వేరే నేతల్ని పోటీకి దించినా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా వారికి ఉన్న బలం వేరు. దీని ప్రకారం వైసీపీ కొంతమేర నష్టపోవాల్సిందే. పైగా గత ఏడాదిలాగా ఈసారి వైసీపీ/జగన్ వేవ్ కనిపించడం లేదు. చాలా చోట్ల ఎమ్మెల్యేలు గట్టిపోటీనే ఎదుర్కోబోతున్నారు. మరోవైపు ఇదే జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్‌కు పోటీగా ప్రత్యర్థి వర్గం కూడా టిక్కెట్ ఆశిస్తోంది. ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా.. మరొకరి నుంచి తిరుగుబాటు తప్పదు. దీంతో ఈ సీట్లోనూ వైసీపీకి బ్యాండ్ పడే అవకాశాలున్నాయి. మొత్తానికి జగన్ తప్పిదాలతో వైసీపీకి నెల్లూరులో ఎదురుదెబ్బలు తప్పేలా లేవు.