INDIA-Canada: కెనడాతో సంబంధమున్న 43 మంది టెర్రరిస్టుల జాబితా విడుదల చేసిన భారత్..
కెనడాలో ఉంటూ, కెనడాతో సంబంధాలు కలిగి ఉన్న 43 మంది ఉగ్రవాదుల జాబితాను భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రూపొందించింది. వీరిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ చాలా మంది ఉన్నారు. వీరు కెనడా కేంద్రంగా పని చేయడమే కాదు.. పాకిస్తాన్ తీవ్రవాదులు, ఐఎస్ఐతో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు.
INDIA-Canada: భారత్-కెనడా సంబంధాలు దెబ్బతింటున్న వేళ ఇరు దేశాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. కెనడా.. భారత వ్యతిరేకశక్తులు, తీవ్రవాదులకు అడ్డాగా మారిన సంగతి తెలిసిందే. భారత వేర్పాటువాదుల్ని కెనడా పెంచి పోషిస్తోంది. కెనడా కేంద్రంగా పలువురు గ్యాంగ్‌స్టర్లు, సిక్కు నేతలు ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కెనడా నుంచి ఇండియాలోని తమ వారితో దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్రం తాజాగా అలాంటి ఉగ్రవాదులు, వారితో సంబంధాలు కలిగిన వారి జాబితా విడుదల చేసింది.
కెనడాలో ఉంటూ, కెనడాతో సంబంధాలు కలిగి ఉన్న 43 మంది ఉగ్రవాదుల జాబితాను భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రూపొందించింది. వీరిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ చాలా మంది ఉన్నారు. వీరు కెనడా కేంద్రంగా పని చేయడమే కాదు.. పాకిస్తాన్ తీవ్రవాదులు, ఐఎస్ఐతో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు. కొందరు భారతీయులు కెనడాకు పారిపోయి, అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఎన్ఏఐ విడుదల చేసిన జాబితాలో గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష దాలా, అన్మోల్ బిష్ణోయ్, జగదీప్ సింగ్, లఖ్ బిర్ సింగ్ లిండా వంటి ఉగ్రవాదుల పేర్లు ఇందులో ఉన్నాయి. గోల్డీ బ్రార్ లాంటి వాళ్లు ఇండియాలో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో కీలకపాత్ర పోషించారు. ఈ విషయాన్ని గోల్డీ బ్రారే వెల్లడించారు. అలాంటి నేరస్థుల్ని కెనడా వెనకేసుకొస్తూ, ఆశ్రయం కల్పిస్తోంది. ఈ లిస్టులో ఉన్న వాళ్లు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతిస్తున్నారు. ట్రూడో ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఈ ఉద్యమానికి, ఉగ్రవాదులకు సహకరిస్తోంది.
వీసాల జారీ నిలిపివేత
కెనడాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశం వెళ్లే భారతీయులకు వీసాల జారీపై కేంద్రం నిషేధం విధించింది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త కారణాలరీత్యా కెనడాకు వెళ్లే భారతీయులకు వీసాల జారీ నిలిపివేస్తున్నట్లు కెనడాలోని ఇండియా వీసా అప్లికేషన్ సెంటర్ పేర్కొంది. తాత్కాలికంగా వీసాలు నిలిపివేసినట్లు, ఈ నెల 21 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు, అప్‌డేట్స్ కోసం సంబంధిత వెబ్‌సైట్ సంప్రదించాలని సూచించింది. అధికారిక ప్రకటన వెలువడ్డప్పటికీ ఈ నిర్ణయంపై మాట్లాడేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు.
హిందువులూ జాగ్రత్త
కెనడాలోని హిందువులు జాగ్రత్తగా ఉండాలని, హిందువులపై దాడులు జరిగే అవకాశం ఉందని కెనడా ఎంపీ చంద్ర ఆర్య అన్నారు. ఖలిస్థాన్ వేర్పాటు వాదులు హిందువులపై దాడులు చేసే అవకాశముందని హెచ్చరించారు. ఇండియాకి తిరిగి వెళ్లిపోవాలని బెదిరింపులకు పాల్పడే అవకాశాలున్నాయన్నారు. అయితే, హిందువులంతా శాంతంగా ఉండాలని, అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సిక్కుల్లో చాలా మంది ఖలిస్థాన్‌కి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.