Nitish Kumar: మోడీకి వ్యతిరేకంగా నితీశ్ భారీ వ్యూహం. ఆపరేషన్ 450 ఫలిస్తుందా ?

ప్రాంతాలు వేరు.. పార్టీలు వేరు.. వాళ్ల జెండా..ఎజెండా కూడా వేర్వేరు. కానీ కామన్‌గా వాళ్లంతా కోరుకుంటున్నది మాత్రం ఒక్కటే. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవకూడదు. మరోసారి మోడీ అధికారంలోకి రాకూడదు. దీని కోసం వ్యూహాలు, ప్రతివ్యూహాలు, చర్చోపచర్చలు కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి. పార్టీల మధ్య భావసారుప్యత లేకపోయినా.. మోదీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 28, 2023 | 06:53 PMLast Updated on: May 28, 2023 | 6:53 PM

Nitish Kumar Againest Strategy To Modi

పైగా కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీయేతర పక్షాలకు కొత్త ఊపు వచ్చింది. గ్రౌండ్ లెవల్‌లో గట్టిగా కష్టపడితే కేంద్రంలో బీజేపీని ఓడించడం కష్టమేమీ కాదన్న అభిప్రాయం ఈ మధ్య విపక్ష నేతల్లో కనిపిస్తోంది. సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి హాజరైన బీజేపీయేతర పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే యాంటీ బీజేపీ ఎజెండాను రూపొందించి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు.

విపక్షాలను ఏకం చేసే పనిలో నితీశ్ కుమార్
ఒకప్పుడు బీజేపీతో అంటకాగిన బీహార్ ముఖ్యమంత్రి, JDU అధినేత నితీశ్ కుమార్ ఇప్పుడు బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. సీఎంగా బీహార్ పాలనా వ్యవహారాల కంటే దేశ రాజకీయాలు, యాంటీ మోదీ వ్యూహాల గురించే ఆయన ఎక్కువ ఆలోచిస్తున్నారు. పైకి చెప్పకపోయినా ఆయన ప్రధాని రేసులో కూడా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ వ్యతిరేక వ్యూహాలకు నితీశ్ కుమార్ పదునుపెడుతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఎన్నికల రణరంగంలోకి దించాలని నితీశ్ భావిస్తున్నారు. దీని కోసం ఆయన పెద్ద స్కెచ్ వేశారు.

నితీశ్ మిషన్ 450 సీట్స్
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అడ్రెస్ గల్లంతు చేసేందుకు నితీశ్ కుమార్ పొలిటికల్ మిషన్ చేపట్టారు. దాని పేరే మిషన్ 450. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా 450 మందిని అభ్యర్థులను నిలబెట్టేందుకు నితీశ్ కసరత్తు చేస్తున్నారు. బీజేపీని, మోదీ పాలనను వ్యతిరేకిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు కామన్ క్యాండిడేట్స్‌ పై దృష్టి పెట్టాలని నితీశ్ కోరుతున్నారు. ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా బీజేపీ విజయవకాశాలను దెబ్బతీయవచ్చన్నది నితీశ్ మాట. నితీశ్ ఈ రకంగా ఆలోచించడానికి ఆయన లెక్కలు ఆయనకున్నాయి. ఏఏ లోక్‌సభ స్థానాల్లో విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలో కూడా నితీశ్ ఒక బ్లూ ప్రింట్ రెడీ చేశారు. ఆ స్థానాల నుంచి బలమైన అభ్యర్థులను బరిలోకి దించితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని నితీశ్ సన్నిహితుల వద్ద చెబుతున్నారట.

38 పర్సెంట్ వర్సెస్ 62 పర్సెంట్ ఇదే నితీశ్‌ ఫార్ములా
దేశవ్యాప్తంగా మోదీ మానియా నడుస్తున్న సమయంలో 2019 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. గత లోక్‌సభ ఎన్నికల రికార్డులను తిరగరాస్తూ ఆ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. సుమారుగా 38 శాతం ఓటింగ్ ‌షేర్‌తో 303 పార్లమెంట్ ‌స్థానాలను కైవసం చేసుకుంది. ఇది కేవలం బీజేపీ విజయం మాత్రమే. ఎన్డీయే కూటమిగా విజయాన్ని చూస్తే 45 శాతం ఓటు షేర్‌తో 353 స్థానాల్లో కమలం జెండా ఎగరేసింది. దేశవ్యాప్తంగా బీజేపీ సాధించిన ఓటు షేర్ 38 శాతమైతే… కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు 62 శాతం ఓటు షేరును నమోదు చేసుకున్నాయి. బీజేపీయేత పక్షాలన్నీ ఒకే మాటపై ఉంటే.. ఈ 62 శాతం ఓటు షేర్‌తో వచ్చే ఎన్నికల్లో కమలదళానికి చుక్కలు చూపించవచ్చని నితీశ్ భావిస్తున్నారు. విపక్ష పార్టీలన్నీ మహా కూటమిలా చేతులు కలిపితే ఇది సాధ్యమే అన్నది నితీశ్ లెక్క.

రాష్ట్రం ఏదైనా…లోక్‌సభ స్థానం ఎక్కడిదైనా.. విపక్ష పార్టీల ఓటు బ్యాంకు చీలకుండా చేయాలని నితీశ్ కోరుకుంటున్నారు. అది జరగాలంటే బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలు ఒకే మాటపై ఉండాలి. విబేధాలను, స్థానిక రాజకీయ అవసరాలను పక్కనపెట్టి… బీజేపీ పోటీ చేసే స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలి. 1977, 1989 ఎన్నికల్లో ఈ తరహా పవర్ షేరింగ్ ఫార్ములా పనిచేసింది. దాన్నే ఇప్పుడు అమలు చేసేందుకు నితీశ్ ప్లాన్ చేస్తున్నారు. 17 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి, 6 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన అనుభవమున్న నితీశ్ కుమార్.. తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి యాంటీ బీజేపీ స్ట్రాటజీకి పదును పెడుతున్నారు.

జూన్‌లో పాట్నాలో కీలక సమావేశం
అన్నీ అనుకున్నట్టు జరిగి.. విపక్ష పార్టీల నేతలు అందుబాటులో ఉంటే… జూన్ మొదటి వారంలోనే పాట్నాలో విపక్షాల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు నితీశ్ కుమార్. విపక్షాలను ఏకం చేయడం, బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టడం ఈ రెండు అంశాలే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భావసారుప్యతతో సంబంధం లేకుండా విపక్షాలన్నింటినీ ఏకం చేయడం అన్నది రాజకీయాల్లో అతి పెద్ద టాస్క్. టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీతో పాటు కాంగ్రెస్‌ను కూడా రాజకీయ ప్రత్యర్థిగా చూస్తాయి. అలాంటప్పుడు కాంగ్రెస్‌తో కూడిన విపక్ష కూటమి ఏర్పాటుకు కొన్ని ప్రాంతీయ పార్టీలు ముందుకు రాకపోవచ్చు. ఈ విషయంలోనే నితీశ్ తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించబోతున్నారు.

బీజేపీతో పోరాటం చేయాలంటే కాంగ్రెస్‌తో కూడిన విపక్ష కూటమి అవసరాన్ని ఆయన ఇప్పటికే గుర్తించారు. అందుకే ఇతర పార్టీలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీల మధ్య ఉన్న సైద్ధాంతిక విబేధాలు, నేతల మధ్య ఉన్న వ్యక్తిగత స్పర్ధలను అన్నింటినీ పక్కన పెట్టి ఒకే వేదికపైకి రావాలని నితీశ్ కోరుతున్నారు. ఢిల్లీలో అధికారాల విషయంలోనూ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నారు. హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ను కూడా కలిశారు. త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేతలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే నితీశ్ కుమార్‌తో మమత బెనర్జీ కూడా చర్చలు జరిపారు. కాంగ్రెస్‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా బీజేపీపై పోరాటం చేస్తే ఎలాంటి ఫలితం ఉండదన్న విషయాన్ని విపక్ష పార్టీలకు పదేపదే గుర్తు చేస్తున్నారు నితీశ్. అందుకే కాంగ్రెస్‌తో కూడా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

నితీశ్ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
బీజేపీ గెలవకూడదని.. మోడీ మరోసారి ప్రధాని కాకూడదని విపక్ష పార్టీలన్నీ కోరుకుంటున్నాయి. అయితే వాళ్లు అనుకున్నది సాధించే విషయంలో మాత్రం పార్టీల మధ్య ఎప్పటి వరకు సమన్వయం కనిపించడం లేదు. ఎవరికి వాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా గణమెత్తినా.. ఉమ్మడి కార్యాచరణ గానీ… ఐక్య పోరాటం గానీ ఇంత వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో జరగలేదు. కాంగ్రెస్ అంటే గిట్టని పార్టీలు ఇప్పటికీ ఆ పార్టీతో కలిసి బీజేపీపై పోరాడేందుకు సిద్ధంగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో నితీశ్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.. !