Thatikonda Rajaiah: కడియం శ్రీహరికి సహకరిస్తానని నేను చెప్పలేదు.. మాట మార్చేసిన రాజయ్య..
స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ కడియం శ్రీహరికి కేటాయించడంతో కొంత కాలంగా రాజయ్య ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అక్కడి నుంచి తానే పోటీ చేస్తానని, చివరి దశలో బీఫాం తనకే ఇస్తారంటూ అనుచరులకు చెప్తూ వస్తున్నారు.
Thatikonda Rajaiah: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారం పక్కలో బల్లెంలా బీఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇటీవలే కేటీఆర్ మాట విన్నట్లు కనిపించిన ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ రివర్స్ అయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ కడియం శ్రీహరికి కేటాయించడంతో కొంత కాలంగా రాజయ్య ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అక్కడి నుంచి తానే పోటీ చేస్తానని, చివరి దశలో బీఫాం తనకే ఇస్తారంటూ అనుచరులకు చెప్తూ వస్తున్నారు. దీంతో కడియం, రాజయ్య మధ్య సయోధ్య కుదిర్చేందుకు మంత్రి కేటీఆర్ ఇద్దరు నేతలను ప్రగతిభవన్‌కు పిలిచారు.
కడియంకు సహకరించాల్సిందిగా రాజయ్యకు చెప్పారు. ఇద్దరూ కలిసి ఫొటోలు కూడా తీసుకున్నారు. హమ్మయ్య.. అంతా సెట్ అయ్యింది అని అధిష్టానం రిలాక్స్ అయ్యేలోగానే నియోజకవర్గానికి వెళ్లి మాట మార్చేశారు రాజయ్య. కడియం శ్రీహరికి మద్దతు తెలిపితే మా పరిస్థితి ఏంటని రాజయ్యను ఆయన అనుచరులు ప్రశ్నించారట. దీనికి సమధానంగా.. తాను కడియంకు మద్దతు తెలపలేదని.. ఎన్నికలు సమీపించేలోగా పరిణామాలు మారిపోవచ్చంటూ చెప్పారట. చివరి వరకూ బీఫాం కోసం ప్రయత్నిస్తానని అనుచరులను కూల్ చేశారట. రాజయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. అంతా సెట్ అయ్యింది అనుకున్న టైంలో రాజయ్య రివర్స్ కావడంతో బీఆర్‌ఎస్ హైకమాండ్‌కు మళ్లీ టెన్షన్ మొదలైంది.