No Confidence Motion: అవిశ్వాస తీర్మానం మణిపూర్‌పై మోదీ ప్రకటన కోసమేనా..? విపక్షాల లక్ష్యం ఏంటి..?

మణిపూర్ హింస తరుణంలో.. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చింది. దీంతో మరోసారి అవిశ్వాస తీర్మానాల చరిత్ర, పార్లమెంట్‌లో పార్టీల బలాబలాలపై చర్చ జరుగుతోంది. వీగిపోతుందని తెలిసినా.. అవిశ్వాసం పెట్టడం వెనుక తమ వ్యూహం తమకు ఉందంటున్నాయి విపక్షాలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 27, 2023 | 01:46 PMLast Updated on: Jul 27, 2023 | 1:46 PM

No Confidence Motion In Lok Sabha This Is The Reason Why Opposition Go For It

No Confidence Motion: మణిపూర్‌లో మంటలు రేగుతున్న తరుణంలో.. విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చాయి. మణిపూర్‌పై ప్రధాని ప్రకటనకు పట్టుబడుతున్న విపక్షాలు అవిశ్వాసం పెట్టి అయినా.. మోడీతో మాట్లాడించాలని కంకణం కట్టుకున్నాయి.
మణిపూర్ హింస తరుణంలో.. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చింది. దీంతో మరోసారి అవిశ్వాస తీర్మానాల చరిత్ర, పార్లమెంట్‌లో పార్టీల బలాబలాలపై చర్చ జరుగుతోంది. వీగిపోతుందని తెలిసినా.. అవిశ్వాసం పెట్టడం వెనుక తమ వ్యూహం తమకు ఉందంటున్నాయి విపక్షాలు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. మణిపుర్‌ అంశం పై పార్లమెంటులో ప్రధాని మోడీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ఇండియా.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌కు నోటీసులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. ప్రధాని మోడీ మాట్లాడటంతో పాటు తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనే యోచనతోనే విపక్ష కూటమి ఈ అడుగువేసింది. స్పీకర్‌కు కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నోటీసులు సమర్పించాయి. ఈ నోటీసులను పరిశీలించిన ఓం బిర్లా.. తీర్మానానికి అనుమతించారు.
మణిపుర్ అంశంపై వాయిదా పడిన లోక్ సభ 12 గంటలకు తిరిగి ప్రారంభమైంది. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా అనుమతితో కాంగ్రెస్‌ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్‌.. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ తీర్మానంపై చర్చించేందుకు ఎంతమంది మద్దతు ఇస్తున్నారని స్పీకర్ సభ్యులను అడిగారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సహా పలువురు విపక్ష నేతలు తమ మద్దతు ప్రకటిస్తూ లేచి నిల్చున్నారు. చర్చకు అవసరమైన మద్దతు లభించడంతో ఈ తీర్మానాన్ని స్పీకర్ అనుమతించారు. దీనిపై అన్ని పార్టీలతో చర్చించి తేదీ, సమయం ప్రకటిస్తానని తెలిపారు. సాధారణంగా యాభై మంది ఎంపీల మద్దతు ఉంటే అవిశ్వాస తీర్మానానికి అనుమతి లభిస్తుంది. ఇదిలా ఉంటే.. మణిపుర్ అంశంపై పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూనే ఉంది. ఇదే విషయంపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్‌లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండియా కూటమి ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టింది.